Sunday, November 13, 2016

!!ప్రయత్నించు!!

లేడిలా లేచి పరిగెత్త లేనని
ఆలోచించి ఆవేదన చెందకు
చేతకావడంలేదన్న చింతతో  
నీ ఆశయాలకు కళ్ళెం వేయకు
తాత్కాలిక ఒడిదుడుకులకు లొంగి
శాశ్వత సంతోషాల్ని తృంచివేయకు
జీవితంలో పడిలేచి పరుగిడక తప్పదు   
అయిన గాయాలు మానితే గెంతులేస్తావు
ప్రయత్నించకుండా ఫలితాన్ని పొందలేవు
ధృఢనిశ్చయంతో దేన్నైనా సాధిస్తావు!

Thursday, November 10, 2016

!!విలువ!!

 చిరు జీవితంలో చిన్నగా ఊహించి చేసేది కొంచెం
ఉన్నతంగా ఊహిస్తేనే మనకొచ్చేను లాభం...
నిన్న చేయిజారి క్రిందపడితే కళ్ళకద్దుకున్న
పెద్ద నోట్లే నేడు పల్లీ పొట్లాలుగా
పాత సామాన్లా వేయాలంటూ
వ్యాఖ్యలు వ్యంగంగా మాటలు!
ఇలాగే మనిషి రూపం బయటపడేది...
నిన్న రంగు కాగితానికి లొంగిపోయి
విలువ లేదంటే నేడు అవహేళనలు
విలువ పోయే వెయ్యి నోటుకు కాదు
మనిషి నోటికి మానవతా విలువలకి!

Sunday, November 6, 2016

!!నేను!!

ఎద నిండుగా కోరికలున్న నన్ను
కాలమా క్షణక్షణం ఏల పరీక్షిస్తావు?
నేను స్థిరంగా ఉండే సాగరాన్ని కాను..
ఓర్పుతో నదుల్ని నాలో కలుపుకోడానికి
సహనంతో సాధించనిది సంగ్రహించడానికి!  
వ్యధల్ని వధించే ధీరురాల్ని అసలే కాను..
గెలుపోటమిలా వచ్చిపోతాయని నవ్వడానికి
అన్నీ అశాశ్వితమని వేదాలు వల్లించడానికి!
రాయినో రప్పనో అంతకన్నా కాను..   
భావోధ్వేగాలు నన్ను తాకవని సర్దుకోడానికి
కభోధినై కన్నకలల్ని కట్టిపడేసి జీవించడానికి!