Monday, June 26, 2017

అరవైలో ఇరవై


అరవైలో ఇరవై కోసం చేసే కసరత్తులు కావివి.. 
అనుభవాలతో ఆరితేరిన సారాంశ గుణపాఠాలు 
పాత తరానికేం తెలియదని గేలి చేసేరు కుర్రకారు 
పిల్లకాకులకేం తెలుసునని ఉండేలు దెబ్బలు.. 
తెలివితేటలతో ఆలోచనల్లో అంబరాన్ని తాకుతారు 
అరిటాకులతో పోల్చినా అన్నింటా మిన్న స్త్రీలు.. 
తెర ముందు తెర వెనుక అవసరం నేడు నటనలు
నేటి తరానికి ఆవేశం ఎక్కువ ఆలోచనలు తక్కువ 
కష్టపడకుండా కావాలనుకుంటారు ధనవంతులు.. 
ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ నవ్వించక 
కడకు ఒంటరేనని తెలిసీ ఎందుకీ తాపత్రయాలు.. 
చీకటివెలుగుల్లా వచ్చిపోతాయి సమస్యలు సంతోషాలు 
ఏదేమైనా ఎంజాయ్ చేసేద్దాం రండి మన జీవితాలు!!

Wednesday, June 21, 2017

!! డౌట్ !!

నాదొక డౌట్...శంకర్ బ్రాండ్ పొగాకు
గణేష్ బ్రాండ్ బీడీలు, లక్ష్మీ బ్రాండ్ టపాసులు
కృష్ణ బార్ & రెస్టారెంట్, జైమాతా మటన్ షాప్ చూసా
కానీ ఇంత వరకూ ఎప్పుడూ ఎక్కడా నేను
అల్లా బ్రాండ్ గుట్కా, ఖుదా బ్రాండ్ బీడీ,
జీజస్ బ్రాండ్ చుట్టలు, క్రీస్తు చికెన్ షాప్ అంటూ
అమ్మే దుకాణాలు ఎక్కడా చూడలేదు!!
ముస్లింలకీ క్రైస్తవులకీ ఈ అలవాట్లు లేవా?
లేక వారు ఈ దురలవాట్లకు బానిసలు కారా?
అంటే...అన్ని మతాల్లోనూ బానిసలు ఉన్నారు
వారిలో ఉన్న ధర్మ సన్మానం, భగవంతుని పై భక్తి
హిందువుల్లో కొరవడిందనే అనిపిస్తుంది...కాదంటారా!??

(ఇది కేవలం నా ధర్మ సందేహమే తప్ప ఎవరినీ ఉధ్ధేశించి కాదని మనవి చేసుకుంటున్నాను-పద్మారాణి)

Friday, June 16, 2017

!!బ్రతుకు కష్టం!!

విహంగాన్నై స్వేచ్ఛగా విహరించాలని
గ్రహాల మధ్య విలాసంగా పయనించాలని
కోట్ల క్రోసుల దూరదృశ్యాలను వీక్షించాలని
హిమాలయాల్లో ఐహిక వాంఛలు వీడాలని
భూగర్భంలో చొరబడి చిందులేయాలని
స్వల్ప రేణువుగా మారి ఎగిరిపోవాలని
సాగరంలో చేపలా కదలాడాలని
మండుటాగ్నిలో కాలక సేదతీరాలని
కోరుకోవడం ఒక ఎత్తు అయితే....
మనిషై పుట్టినందుకు మనిషిగా బ్రతకడం
మరో ఎత్తు...అవునంటారా కాదంటారా!? 

Friday, June 9, 2017

!!లోకం తీరు!!

నాలా ఉండలేక నా వెనుక
గుసగుసలాడేరు కుచితస్వభావులు..
నాకు దక్కినవి వారికి దక్కవని 
ఈర్ష్యచెందేరు అసూయపరులు..
నాతో పోల్చుకుని ప్రయత్నించకనే
లోలోన కుళ్ళేరు అసమర్ధులు..
దేన్నైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు
లోకం అర్థమైన జ్ఞానులు!

Wednesday, June 7, 2017

!!మనసా వస్తావా!!

మనసా దూరతీరాలకు వెళదాం వస్తావా 
వేదనలతో హృదయం నిండె ఊరడిస్తావా
వ్యధగాయాలు ఆశల్లేని లోకం చూపవా 
కులాసాల కొత్త కుటీరం ఏదైనా వెతకవా

ఉద్యానవనమేల అందులో మనసు కాల
నాకు అవసరం లేదు విశాలమైన లోగిలి
నావనుకున్న నాలుగు గోడలుంటే చాలు
గాలి వచ్చిపోయేలా గుండె తలుపు మేలు

బాధలే జ్ఞాపకం రానట్టి లేపనం పూయవా
ఓదార్పు ముసుగులో కన్నీరు దాచేయవా
నవ్వుతో నటించే నేర్పు నాకు నేర్పించవా 
ఓ నా మనసా ఎగిరిపోదాం నాతో వస్తావా!