Monday, April 20, 2015

!!వ్యధలారా పొండి!!

ప్రియమైన వ్యధలారా నన్ను వదిలిపొండి 

ఆనందాన్ని ఇవ్వని మీరు నా దరిరాకండి

మనసు మమకారమంటూ లేనివి వల్లించి

మౌనరోధనకు మరో కొత్త భాషను నేర్పించి

మరల జీవితం పై చిగురాశను రేపకండి...

నన్ను చూసి భయపడే నా నీడనడగండి

వెలుగులో తోడొచ్చి చీకటిలో వీడెను ఏలని?

సంతోషాలని వెతికి వేసారిన నాపై ధూపమేసి

మసగబారిన మదిలో మమతని వెతక్కండి

జరిగినది మంచికేనని ఉత్తుత్తినే ఊరడించి

పక్షవాతపు జీవితాన్ని పరిగెత్తమని అనకండి!!!

Saturday, April 11, 2015

!!జోస్యఫలం!!

నా అలవాట్లు నా పై అలుగుతుంటాయి
నా చేష్టలు నాతో చెలిమి కూడనంటాయి
నా ఇష్టాలు నన్ను వీడి వెళ్ళిపోయాయి
దురదృష్టం వలపంటూ నీడై వెంటాడుతూ
నా కోరికలతో కయ్యమంటూ కాలుదువ్వి
నా ప్రమేయం లేకుండానే భాధల్ని రువ్వి
నా కంట జారే నీరు చూసి విరగబడి నవ్వి
నుదుటిరాత మార్చలేమని జోస్యమే చెబితే
నాలోని పట్టుదలే విధిపై నన్ను ఉసిగొల్పింది
నా గమ్యం నాకు తోడై శ్రమని నమ్ముకోమంది
నా ప్రయత్న ఫలితమే నాకు జయం అయ్యింది!