Sunday, July 19, 2020

!!ఎవ్వరూ రారు!!


తలుపులు బార్లా తీసి ఉంచినా లోపలికి ఎవ్వరూ రారు
వెన్నెల విరబూసున్నా జాబిలిని ఎవ్వరూ పలుకరించరు
ఇప్పుడు పూలవాసన్ని ఆకులూ ముళ్ళే పీలుస్తున్నాయి
పక్షుల కుహకుహలు కూడా రోదనలుగా వినిపిస్తున్నాయి
ఈ నమ్మశక్యం కాని నిజమైనా చూడ్డానికి ఎవ్వరూలేరు!

కష్టాల్లో హితులు పలుకరించడానికి రావాలనున్నా రాలేరు
కడుపున పుట్టిన వారిని అయినా సరే ముట్టుకోవద్దంటారు     
భ్రమరాలు సైతం పువ్వులలో తేనె ఝుర్ర ఆలోచిస్తున్నాయి
సీతాకోకచిలుకల రెక్కలు కూడా ఎగురలేక అతుక్కున్నాయి
ఈ విపత్కర పరిస్థితుల్లో నాలుగ్గోడలే స్వర్గం అంటున్నారు!

ఒంటరిగా అరచి గోలచేసినా వినడానిక్కూడా ఎవ్వరూ లేరు   
కరోనా సోకిన రోగి శవంపై దుప్పటి కూడా ఎవ్వరు కప్పరు
అందుకే గుంపుగా ఉండొద్దు దూరాన్ని పాటిద్దాం అంటున్నది
అత్యవసరం అనుకుంటే తప్ప ఇంటిపట్టునే ఉండమంటున్నది
ఈ మహమ్మారికి ఇంతకు మించిన పరిష్కారము లేకున్నది!

Wednesday, July 15, 2020

Friday, July 3, 2020

!!తెలిసింది!!

ఒంటరిగా ఉన్నప్పుడు నన్నునేను చూసుకుని ఆలోచిస్తూ
మనసుకి వేసుకున్న ముసుగులన్నీ తీసి నగ్నంగా నిలబడి
నాతోనేనే మాట్లాడుకుంటూ నన్ను నేనే తిట్టుకుని తర్కిస్తే..

అప్పుడు ఒక్కసారిగా నన్ను నేను పోల్చుకుంటే తెలిసింది
నాకు కనిపించే మీరు, మీకు కనిపించే నేను ఒకటి కాదని!

నేనెవరని చేస్తున్నవి సబబేనాని ప్రశ్నించుకుంటే తెలిసింది
నిజం నిష్టూరమైనా చెప్పి గరళాన్ని మ్రింగేసినా ఏం కాదని!

నన్ను కాపాడుకోడానికి నానీడను బోనులో బంధిస్తే తెలిసింది
తోడు కోసమని నాది నాది అనుకున్నది ఏదీ నాది కాదని!