Tuesday, May 26, 2015

జీవించు.


చదవడం నేర్చుకుంటే...
ప్రతిమనిషీ ఒక పుస్తకమే!
వ్రాయడం నేర్చుకుంటే...
నీ జీవితం కూడా ఒక గ్రంధమే!
జీవించడం నేర్చుకుంటే...
మనం లోకానికి ఒక ఆదర్శమే!
నీవు కృంగి పోతున్నావంటే...
భూతకాలంలో బ్రతుకుతున్నట్లు!
నీలో అతృత పెరుగుతుందంటే...
భవిష్యత్తు పై బోలెడు ఆశలున్నట్లు!
నీవు ప్రశాంతంగా జీవిస్తున్నావంటే...
ప్రస్తుతకాలంతో రాజీపడి హాయిగున్నట్లు!

Friday, May 22, 2015

ఎలా!?

మిణుకు మిణుకుమంటూ మెరిసే దీపాలెన్నో...
వాటిని దేదీప్యమానంగా ఎలా వెలిగించను నేను?
తడారిపోయిన అధరాలపై వెలగని వత్తులలో...
సంతోషపు చమురు నింపి ఎలా నవ్వించను నేను?
నిరాశ్రయులైన పిల్లలు, జబ్బుపడ్డ తల్లులెందరో...
నీడనిచ్చి, తల్లడిల్లే తల్లివ్యాధిని ఎలా తగ్గించను నేను?
ధర్మంకర్మా నీతీనియమం అనే మాటల నీతులెన్నో...
మనిషిలోని మానవత్వాన్ని ఎలా మేల్కొల్పను నేను?
స్వఛ్ఛందంగా సేవ చేసేవారు కొందరున్నారు లోకంలో...
కావలసినవారికి సరైన సహాయం ఎలా అందించను నేను?
హంగు ఆర్భాటాలతో సమగ్ర సిగ్గులేని జీవితాలెందరివో...
మరమనిషిని మనిషికే దేవునిగా ఎలా చూపించను నేను?

Wednesday, May 20, 2015

!!సూచన!!

 కాలమా! కష్టాల్లో కాస్త చూసి నడుచుకో 
కాలం కలిసొస్తే నిన్ను లెక్కచేయను పో 
జీవితమా! నీవొక చిద్విలాస చిరుస్వప్నం 
బిక్షగాడి కంటికి మహలుగా కలలో కనబడి 
మహల్లోని మారాజుకి కంటిపై కునుకై రావు 
అయినా మేల్కొని నిదురించేవారు ఉన్నారు. 

ధనమా! ఢాంభికాలు చాలించి మసులుకో 
 నాణ్యమే సవ్వడి చేస్తూ చిందులేస్తుంది 
నోటు ఎప్పుడూ నోరుమూసుకుంటుంది 
అందుకే! విలువపెరిగితే వినయంగా ఉండు 
నీ అంతస్తుని అంచనా వేసి అల్లరి చేసి 
చిందులేసే చిల్లర వ్యక్తులు చాలా ఉన్నారు.

Friday, May 15, 2015

!!కోల్పోయి!!

బాల్యాన్ని కోల్పోయిన ఒంటరితనం మొదటిసారిగా

మరణించి, యవ్వనంలోకి పరకాయప్రవేశమే చేసి,

స్వేఛ్ఛనే హత్యచేసిన విధి వ్యంగ్యంగా నవ్వితే తెలిసె..

నన్నునే కోల్పోయిన ప్రతీసారి చచ్చి బ్రతకడమేనని

మరచిపోవడం తెలిసిన ప్రాణానికి ఇది కొత్తేం కాదని!

గుండె నుండి తోడిన గుప్పెడు కన్నీళ్ళు మోముపై

చల్లుకుని భారమేదో తీరెనన్న నా ఓదార్పులో తెలిసె..

బండబారి మదిలో లావా బడబాగ్నై మండుతుందని

పొంగి పొర్లిందంటే అస్తికల్లోనైనా అస్తిత్వం కానరాదని!

ఆలోచనలు కొండగాలికే రెపరెపలాడుతూ కీచుమంటే

చిట్లిన కనురెప్పలే మూతపడలేమని తెలిపితే తెలిసె..

భారమైన ఒంటిపై మట్టికప్పితేనే మనసు మరణమని

కోల్పోయి మరణించి లేచి మరల కోల్పోయి సాగాలని!

Friday, May 8, 2015

!!నా అ జ్ఞానం!!


నేను మంచితనం మానవత్వం చాలానే చూసా

ఒంటిపై వస్త్రం లేనివారు, ఉన్నా కప్పుకోని వారు


పరిస్థితులు అర్థమై అర్థం కానట్లు నటించేవారు


భావాలెన్ని ఉన్నా ఏ భావం తెలుపలేని వారు..


ఒకరికింకొకరు అర్థం కారు, ఎవరికి ఎవరూ కారు


తెల్లకాగితాన్ని చదివి తెలుసుకునేవారు కొందరు


పుస్తాకాన్ని చదివి అర్థంచేసుకోలేని వారున్నారు!

Tuesday, May 5, 2015

!!ఆకలి!!


ఆకలితో ఎవరైనా చచ్చిపోతే అది హత్యే కదా
ఆ హత్యలకి కారణమైన వారికి దండనే లేదా
చట్టాలలోని వ్రాతలకు ఎన్నటికీ చలనం రాదా!

ఆకలితో అలమటించే వారికి న్యాయం జరగదా
మద్దతుకై జనాలని ఆకలి ఆత్మ పట్టి పీడించదా
ఉపన్యాసాలు ఇచ్చే నేతల గొంతు పిసికేయబోదా!


ఆకలితో ఎండిన ప్రేగుకి ఉపవాసమంటే తెలియదా
దిక్కుమాలిన దేశం ఎందుకని శాపనార్ధాలు పెట్టదా
ఉసురు తగిలిన పచ్చని పంటే బీడుగా మారిపోదా?