Tuesday, March 31, 2020

లాక్ డౌన్ జిందాబాద్

ఏదో కొంప మునిగిపోయిందన్నట్లు ఆందోళన ఎందుకు? 
సూర్యోదయం ఆగలేదు మీలో ప్రేమనూ లాక్ చెయ్యలేదు  
బయటకు రావద్దన్నారే కానీ మీలోని కళల్ని కట్టేయలేదు
మీలోదాగిన కరుణను దయను కప్పి పెట్టమని అనలేదు!

మూసి మిమ్మల్ని బంధిఖానాలో వేసారనుకోడం ఎందుకు?  
మీలో దాగిన సృజనాత్మకతను సంకెళ్ళతో లాక్ చేయలేదు
కొత్త విషయాలు తెలుసుకోవద్దు నేర్చుకోవద్దనీ బెదిరించలేదు
మీ ఇంట్లో నలుగురూ కలిసి ముచ్చటించుకోవద్దు అనలేదు! 

విద్యా విజ్ఞానాన్ని కాల్చి బూడిద చేసినట్లు చింత ఎందుకు?
బంధువులతో కలవద్దన్నారే కానీ బంధాల్ని లాక్ చెయ్యలేదు 
ప్రార్ధన ధ్యానం దర్జాగా తిని హాయిగా నిద్రపోవద్దనీ చెప్పలేదు
మీ ఆశలను ఆశయాలను అణచుకోమని అస్సలు అనలేదు!

ఇంట్లో నుండి పనులు చేస్తూ ఎంజాయ్ చెయ్యమనడం తప్పా?
లాక్ డౌన్ అన్నది చెయ్యాల్సింది చెయ్యడానికిచ్చిన ఒకవకాశం
ఇంట్లో ఉండడం వెంటిలేటర్లో ఉండడం కన్నా ఎంతో బెటర్ కదా
ఈ లాక్ డౌన్ విజయవంతం చేస్తే అందరం బాగుంటాము కదా!

Tuesday, March 3, 2020

!!అమ్మదే కులం!!

ఆమెను మీరే కులమని ఒక తెలివైన అబ్బాయి అడిగిన ప్రశ్నకు.. అమ్మగా చెప్పనా లేక అమ్మాయిగా చెప్పనాని పక్కున నవ్విందామె! అహా..ఆ రెంటిలోని ఆంతర్యమేమని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టగా ఆమె చెప్పడం ప్రారంభించింది---- ఆత్మవిశ్వాసంతో మరో జన్మనెత్తి తల్లినైనప్పుడు "కులరహితనే" నేను!! తల్లిగా బిడ్డ మలమూత్రాలను శుభ్రపరిచినప్పుడు "శూద్ర" జాతి నాది.. శిశువుకు అన్నింటా రక్షణ కల్పించే ప్రక్రియలో "క్షత్రియ" కులం నాది.. పిల్లల్ని పెంచటంతోపాటు నాకులం కూడా మారిపోతుంది...అదెలాగంటావా! మంచి సంస్కృతి, విలువలు ప్రవర్తన నేర్పేటప్పుడు "బ్రాహ్మణ" జాతి నాది.. సంపాదనలో పొదుపు ఖర్చుల గురించి మార్గనిర్దేశం చేసే "వైశ్య" కులం నాది.. సమాధానం చదివి కూడా ఏ కులమని ఎవరైనా అడిగితే "అమ్మకు కులమే లేదంది" మరి మతాల పై మీ అభిప్రాయం ఏమిటన్నాడు ఆ అబ్బాయి.. "మతలబుతో బ్రతుకుతూ మట్టిలో కలిసే మనకు మతాల గురించి మాట్లాడే హక్కే లేదంది"