Thursday, September 24, 2020

!!బీ హ్యాపీ!!

యవ్వనంతో మిడిసిపడకు రేపు చింతిస్తావు
ఉదయించే సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు
కొన్నాళ్ళు కొనసాగే జీవిత బాటసారివి నువ్వు
రిక్తహస్తాలతో ఏడుస్తూ వచ్చి ఏడిపించి పోతావు

మూడునాళ్ళ ముచ్చటేనని తెలిసి మురుస్తావు

జీవితాన్ని చూసి ఏడుస్తాడు జీవితం తెలిసినోడు
అనవసరంగా ఆలోచించి ఆందోళన చెందే నువ్వు
అన్నీ తెలిసి కూడా ఎందుకనో ప్రాకులాడుతావు

గర్వంతో తలెత్తి నడిచావో తలకు బొప్పికడతావు

చావు నుండి ఎవరైనా ఎంతని తప్పించుకోగలరు
సమాధియే చివరి గమ్యం చెప్పకుండా పాతేస్తారు
ఓహ్ గుండే..ఉన్నంత వరకూ హాయిగా ఉండు!

Thursday, September 10, 2020

!!నిశ్చింత నిద్ర!!


నేను మంచి నిద్రలో ఉన్నట్లు ఉన్నాను...
నిద్రలో నాకు జాగ్రత్తగా స్నానం చేయించారు
ఇంట్లో అందరూ ఏదో కొత్త ఆట ఆడుతున్నారు
చిన్నవాళ్ళని భుజాలపై ఎత్తుకున్నట్లు నన్నెత్తి
అటూ ఇటూ తిప్పి కదలకుండా నన్ను కట్టారు
నా చుట్టు గుమ్మిగూడి ఏవో మాట్లాడుతున్నారు
ఏడుస్తూ మనసులో మరచిపోవాలనుకుంటున్నారు
ప్రేమగా ఎప్పుడూ నావైపు చూడని వారు కూడా
ప్రేమను చూపిస్తూ లోలోన తొందరపడుతున్నారు!

ఎందుకో ఏమో తెలియదు నిద్రిస్తున్న నన్ను చూసి
గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నన్ను నిద్ర లేపుతున్నారు
హైరానా పడిపోతూ హడావిడిగా తిరుగుతున్నారు!!

నా శరీరం ఎందుకో బిగుసుకుంది ఆ స్థలం చూసి
ఎక్కడైతే నన్ను శాశ్వితంగా పడుకోబెట్టనున్నారో!
ప్రేమ అనుబంధాలకు పరీక్ష పెట్టారు కామోసు..
వారి చేతులతో నాకు నిప్పు పెట్టి వెనుకకు తిరిగి
చూడకుండా వెళ్ళిపోయారు, హమ్మయ్య ముగిసింది
ఇక రోజూ నిద్ర లేవాల్సిన పనిలేదు...గుడ్ బైయ్!!