Tuesday, July 9, 2024

!!ఏమడుగుతావు!!

ఎంతో కష్టమీద కాలం గడిచిపోయింది
నా వయసు ఎందుకులే అడుగుతావు?   
అనుకుని ఆలోచించిన వాటికన్నా..
ఎక్కువే నేర్పాయి నా అనుభవపాఠాలు
నా తప్పులు ఏంటని ఎందుకడుతావు?
ప్రేమించి ప్రేమను పొందాలనుకున్నా..
అవసరానికి తగ్గట్లు అదీ మారిపోయింది
నా ద్వేషానికి కారణమేం అడుగుతావు?
బాధ భరించలేక బంధం కోరుకున్నా..
వ్యధను చెప్పుకుని చివరికి విసిగిపోయా
ఇప్పుడు ఇంకేం మిగిలిందని అడుగుతావు?
 

Friday, May 17, 2024

!!నిర్జీవిని!!

ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన
నాపైన ఇప్పుడు అన్నీ నేరారోపణలే..
ఎందుకంటే నేను నిస్సహాయురాలినిగా

ఒంటరిగా ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా
నాకు నేను ధైర్యంగా బ్రతికినన్నాళ్ళూ..
ఎంతో గొప్ప వ్యక్తిత్వం నిండిన దాన్నిగా

అడిగిన వెంటనే కాదనక అన్నీ చేసిన
నేను ఇప్పుడు అక్కరకు రాకున్నాలే..
ఎవరైనా అవసరం తీరినాక అంతేనటగా

శారీరక రోగానికి చికిత్స చేయించుకుని
మానసిక వ్యధ తోడుకావాలని కోరితే..
ఎందుకని అందరూ ప్రశ్నలు అడిగేరుగా

మెల్లగా శక్తిసామర్ధ్యాలన్నీ సమాధి అయ్యి
నాలో ఇప్పుడు మిగిలినవన్నీ తప్పులే..
ఎలాగో మానసికంగా చచ్చి నవ్వుతున్నాగా!


 

Tuesday, March 26, 2024

ఒంటరిపోరాటం

జీవితమార్గమిప్పుడు చెప్పులు లేకుండా నడుస్తున్నా
దారంతా కంకరాళ్ళు దుమ్మూ ముళ్ళతో నిండున్నా
నా మెత్తటి పాదాలు వాపు రక్త గాయాలతో ఉన్నా
నేను..అదరక బెదరక ఒంటరిపోరాటం చేస్తున్నా!

అప్పుడప్పుడూ పరిసరాల్లో అభిమాన కాంతులున్నా
కొన్నిమార్లు అంధకారమేదో నన్ను భయపెట్టేస్తున్నా
నా అన్నవాళ్ళు నన్ను పలుమార్లు పరామర్శిస్తున్నా
నేను..ఆదరంగా వాటిని అన్నింటినీ ఆహ్వానిస్తున్నా!

ఒకోసారి నిష్క్రమణ మదిని సజీవ గాయంచేస్తున్నా
కొందరుచేసిన అంతర్లీన గాయాలకి మందులేకున్నా
నా వేదనా కన్నీటిధారలు ఎండినా సరే ఏడుస్తున్నా
నేను..ఎవ్వరు విననని కేకలతో గగ్గోలపెడుతున్నా!

ఇప్పుడు శరీరమంతా మండుతున్నట్లు అనిపిస్తున్నా
మంటా నొప్పితో నిండిన పాదాలతో అడుగులేస్తున్నా
నా తోడుంది ఇప్పుడు ఒంటరితనమని తెలుసుకున్నా
నేను..అంగీకారాన్ని ప్రత్యామ్నయంగా ఎంచుకున్నా!

Monday, March 11, 2024

!!పైపైన!!

మనుషులు వివిధ మార్గాల్లో మనుగడసాగిస్తారు
బ్రతికేస్తూ దానిగురించి మాట్లాడేవారు కొందరు
మౌనంగా అన్నీభరించి బ్రతికేవారు ఇంకొందరు
కొద్దిమందే బ్రతుకుతూ అదర్శమార్గం చూపేరు!
 
ప్రతీఒక్కరూ ఏదొక సమస్యను ఎదుర్కొంటారు
ఎవ్వరూ తీర్పు ఇవ్వకున్నా శిక్ష అనుభవిస్తారు
చూసేవారికి ఏ బాధలూ లేనివారిగా కనిపిస్తారు
కొద్దిమందే ఒడిదుడుకుల్లో నిశ్చింతగా ఉంటారు!
 
కాబట్టి పైపైన చూసేసి బేరీజు వేయకండి మీరు
ఎవరికి ఏం ఎరుక ఎవరెంత కష్టపడుతున్నారు
ఒకచోట ప్రశాంతంగా కనబడే సముద్రపు నీరు
వేరోచోట తుఫాను సృష్టిస్తుందని గ్రహించగలరు!

Monday, March 4, 2024

Friday, August 4, 2023

!!బ్రతుకుభరోసా!!

ఊపిరి ఆగిపోయిన ఊహలకు
గాయపడిన జ్ఞాపకాలు గుర్తులేవు
కానీ..అలజడి చేసే అంతరంగానికి
అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి కదా!

ఉనికి మోసే గుర్తుల సంకెళ్ళకు
సానుభూతి శాలువాలు కప్పక్కర్లేదు
కానీ..సహనానికి సహకారం కావాలి  
అంతులేని కధకి అర్థం చెప్పాలి కదా!

ఉసురేదో తగిలె గాయమైన గుండెకు
భరించలేని బాధతోనైనా బండకాలేదు
కానీ..భవిష్యత్తుని భరోసా కోరుతుంది
బ్రతికి ఉండగానే చావలేదేమో కదా!

Tuesday, May 2, 2023

!!మారాలి!!

నిలకడగా నిలబడి నెమ్మదిగా అన్నీ వినుకో
ఎవరి నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది..

నీ గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకో
తుదివరకూ నీకునువ్వే తోడు ఉండాల్సింది..

అంతా మన మంచికే జరుగుతుంది అనుకో
మంచిచెడుల తేడా మన వైఖరి పైనే ఉంది..

మాట్లాడే ముందు పలుమార్లు ఆలోచించుకో
అన్నది మరువకున్నా క్షమించాల్సి వస్తుంది..

చెప్పే చాడీలు నమ్మక కళ్ళు తెరచి చూసుకో
పనికొచ్చే సమాచారమైతే అది బాగుంటుంది..

Wednesday, April 26, 2023

!!జీవిద్దాం!!

మనిషిలో మంచి కోసం ప్రాకులాడకు
వారిలో వాస్తవాలను వెతుకులాడు!!

మంచి బూటకపు బుర్కా వేసుకున్నా
నిజం నగ్నంగా నెమ్మదిగా నడుస్తూ
గర్వంగా గాయాలతో సాగిపోతుంది!!!

మన జీవితం మనకి నచ్చినట్లు ఉందాం
దొరికింది ఏదైనా ఆనందంగా అనుభవిద్దాం
పొందలేని వాటి గురించి చింతించ వద్దు
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం!

Monday, January 23, 2023

 !! సర్దుకునిపో!!

బాధలు ఎన్ని ఉన్నా..
నలుగురిలో నవ్వవలసిందే!

ఎలా ఉన్నావని అడిగితే..
బాగున్నామని చెప్పవలసిందే!

పరిస్థితులు మారిపోతుంటే..
తలవంచి మసలుకోవల్సిందే!

మన కలలు పలుమార్లు చస్తే..
కొత్తవాటికి ఊపిరి పోయాల్సిందే!

మనసులోని భావోద్వేకాలను..
మనలో అణచుకుని మగ్గవల్సిందే!

కారణాలు ఏవి అయితేనేమి..
మౌనంగా మనం ఉండవలసిందే!

ఇష్టం ఉన్నా లేకపోయినా..
కొందరిని మరచి బ్రతకవలసిందే!

Sunday, November 27, 2022

 !!మన'పురో'గతి!!

శ్రమించి సంపాదించి కడుపు నిండా భుజించేవారు
కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు వచ్చేసాయి
తిన్నది అరగడానికి ఇప్పుడు వాకింగు చేస్తున్నారు

నడిరాత్రి నట్టింట కన్నంవేసి దొంగలు దోచేసేవారు
కొత్త కోర్సులు పుట్టుకొచ్చి సైబర్ నేరగాళ్ళ నెలవైంది
పగలురేయి దొంగలు దొరలై నెట్ ఇంట దోస్తున్నారు

చాలామంది సాప్ట్ వేర్ ఇంజనీర్లుగానే పనిచేస్తున్నారు
మనసులు మాత్రం హార్డ్ వేర్ గా మారిపోతున్నాయి
కూర్చుని తిని కుశలప్రశ్నలు అడిగేవారు కరువయ్యారు

నాడి పట్టి చూసి గుళికలతో రోగం నయం చేసేవారు
ఆయాసమ్మొస్తే ఆస్తులు అమ్ముకోవలసి పరిస్థితొచ్చింది
చేయిపట్టి పలుకరించి ఏమైందని అడగడం మానేసారు

అప్పట్లో అప్పు చేయటం తప్పు అదోపెద్ద ముప్పనేవారు
మిషన్లుగా మారిన మనుషుల కష్టం కాసులౌతున్నాయి
క్రెడిటుకార్డు పై కొనటమే ఇప్పుడు క్రెడిట్ అంటున్నారు

వస్తువేదో చూసి బజారుకెళ్ళి కావల్సినవి కొనుక్కునేవారు
నాణ్యత చూడ్డమంటే ఇప్పుడు నామోషీ అయిపోయింది
కుర్చీలో కూర్చుని మొబైల్ ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు

పుష్టిగా తిని కాపురంచేసి పిల్లల్ని కనిపెంచి పోషించేవారు
సంతానం కోసం ఇప్పుడు సాఫల్య కేంద్రాలు వెలిసాయి
సెక్స్ మూడ్ కోసం తేదీచూసి మందులు మ్రింగుతున్నారు

Thursday, September 29, 2022

!!గుండెమాట!!


గుండె అలసి ఆగిపోయే ముందు..
గుండె పంపేటి సంకేతాలు వినుకో
ఛాతీ నొప్పి అతిపెద్ద లక్షణమనుకో!

మనస్సు రాత్రిపగలు చేస్తే చంచలం
మనస్సు జాగ్రత్తంటూ చేసే సంకేతం
గుండె భారం బిగుతూ ఒత్తిడి ఉంటే
గుండెవైద్యుడ్ని కలువని చెప్పిందనుకో
ఈజబ్బుకి అధికబరువొక కారణమనుకో!   
 
ఒక్కసారిగా ఒంటికి చెమటలు పట్టడం
చల్లని చెమటలు గుండెవైఫల్య కారణం
ఛాతీ చికిత్సను కోరుతుందని తెలుసుకో

విపరీతమైన అలసట శ్వాస ఆడకపోతే
ఎక్కువ పని చేయటంవల్లని పొరబడకు   
బలహీనమైన గుండె నాళాల లక్షణమది
శ్వాసలోపం గుండెపోటుకి పెద్దహెచ్చరిక
కనుక్కో సకాలంలో వైద్యం చేయించుకో!

ప్రపంచ హృదయ దినోత్సవం రోజున..  
నీ గుండెని కాపాడే భరోసా నీవేఇచ్చుకో     
హృదయం చెప్పిందే ఎల్లప్పుడూ వినుకో   
హృదయాన్ని శాంతినిలయంగా మార్చుకో! 

Friday, June 17, 2022

Tuesday, May 10, 2022

!!మనుషులు!!


వందకు ఒక్క కిలో ఉల్లిపాయలు అమ్మినప్పుడు
పుంఖానుపుంఖాలు పోస్టులు జోకులు రాసేసారు..
పదికిలోలు వందకి అమ్ముతుంటే మాట్లాడకున్నారు!

మనుషులు దేనిగురించైనా అంతేకదా!
వందసార్లు పెట్టి ఒక్కసారి లేదంటే
పెట్టనిదాని గురించి పదిసార్లు చెప్పి
పెట్టిన విషయం గురించి మాట్లాడరు

ప్రేమని ఎంతో పంచి కోపంలో తిడితే
తిట్టింది తలచి పంచిన ప్రేమ మరిచేరు

దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే
ఏదీ అడక్కుండా అతిగా చెయ్యకూడదు
చవగ్గా ఇచ్చిన వాటికి విలువ ఉండదు
సులభంగా చేసిన పనికి గుర్తింపులేదు! 

Thursday, May 5, 2022

!!టేక్ కేర్!!

ప్రొద్దున్నే కాఫీ టిఫినీలు లేకుంటే కడుపు కరాబు
రోజూ పదిగ్లాసుల నీరు లేకుంటే కిడ్నీలు కరాబు
తొమ్మిదిగడియలు నిద్రపోకుంటే పిత్తాశయం ఫట్
 
పాచిన చల్లని ఆహారం తిను చిన్నప్రేగులు కరాబు
మస్తుమసాలా వేపుళ్ళు తింటే పెద్దప్రేగులు కరాబు
కలుషితపొగ సిగరెట్లే చేస్తాయి ఊపిరితిత్తుల్ని ఫట్ 
 
జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తో కాలేయం కరాబు
తీపి పదార్ధాలతో జీర్ణరసాలగ్రంధి క్లోమం కరాబు
తినే తిండిలో ఉప్పూ కొవ్వు ఎక్కువైతే గుండె ఫట్
 
చీకట్లో మొబైల్, కంప్యూటర్ చూస్తే కళ్ళు కరాబు
అనవసర విషయాల ఆలోచనలతో మెదడు కరాబు
సుఖదుఃఖ ఆనందాలు సరితూగకుంటే ఆత్మ ఆంఫట్ 
 
శరీరభాగాలు ఏవీ సంతలో దొరికే సరుకులు కావు
ఆస్తులు ఎన్ని కూడబెట్టినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు
కాబట్టి నీ అవయవాలన్నింటినీ నీవే సంరక్షించుకో!

Wednesday, March 9, 2022

!!ఎదుగుతున్నాం!!

తల్లి పాలు తాగి అప్పుడు రొమ్ముపై తన్నాం
ఇప్పుడేమో మనసు విరచి దూరమైపోతున్నాం
అవును మనం బాగా ఎత్తుకు ఎదిగిపోయాం!

అమ్మ కనబడకపోతే అప్పుడు అల్లాడిపోయాం
ఇప్పుడు అమ్మానాన్నలను వదలి వెళుతున్నాం
అవును విదేశాల్లో ఉంటేనే సంస్కారవంతులం!

డిబ్బీలో డబ్బులువేసి అప్పుడు మురిసిపోయాం
ఇప్పుడు డబ్బులకు దాసోహమై బ్రతికేస్తున్నాం
అవును మనమిప్పుడు మాగొప్ప ధనవంతులం!

చెడులో కూడా మంచి చూస్తూ పెరిగిన వాళ్ళం
ఇప్పుడు మంచి చెప్పినా చెడు అనుకుంటున్నాం
అవును ఇప్పుడు మనం ఎంతో జ్ఞానవంతులం!

చుట్టూ చుట్టాలుండాలని అప్పుడు కోరుకున్నాం
ఇప్పుడు చుట్టాలు వస్తారంటేనే బాధపడుతున్నాం
అవును స్వార్థపు ఏడంతస్తుల మేడలో ఉన్నాం!

సంతోషం సగం బలమని పోటీపడుతూ పెరిగాం
ఇప్పుడు సంపాదనే సర్వమని వెంపర్లాడుతున్నాం
అవును మనం ఇప్పుడు స్థితిమంతులమైపోయాం!

ఎదగడానికి తొందరపడి ఎదిగేక సిగ్గుపడుతున్నాం
యంత్రాలమైపోయి మనుషులమని మరచిపోయాం
అవును ఎంతో ఎదిగి ఏంకాకుండానే రాలిపోతాం! 

Thursday, November 18, 2021

!!విలువ!!



పాలను మంటపెట్టి
మరిగిస్తే పెరుగు..
పెరుగును గిలక్కొట్టి
పిండితే వెన్న..
వెన్నను వేడిచేసి
కాలిస్తే నెయ్యి అవుతోంది!
మండి మరిగి మాడి
కాలి ఇబ్బంది పడినా...
పాల కన్నా పెరుగు
ఖరీదు ఎక్కువ...
పెరుగు కన్నా వెన్న
వెన్న కన్నా నెయ్యి
విలువ ఎక్కువైనా
అన్నీ తెలుపురంగే ఉంటాయి...
అలాగే మనిషి కూడా కష్టం నష్టం
సుఖదుఃఖాలు ఏం కలిగినా
మారక స్థిరంగా ఉంటే..
వారి విలువ తప్పక పెరుగుతుంది!

Wednesday, November 3, 2021

!!అనుకుంది చేసెయ్!!

 ఆలోచనలతో వృధా చేయకు సమయాన్ని
మంచిగా అనిపించిన పనిని చేసేయ్ అంతే

తెలిసో తెలియకో తప్పుచేసి తెలుసుకుంటే
క్షమార్పణ కోరటం తలవంచినట్లు ఏంకాదు

ఎవరివల్లైనా బాధకలిగితే వారికి తెలియాలి
చెప్పాలి అనుకున్నది చెప్పి పడేయ్ అంతే

నీవలన ఏదైనా తప్పు జరిగినా బాధపడినా
మన్నించమని వేడికో అదేం చిన్నతనం కాదు

నలుగురితో కలిసినవ్వే సమయం వచ్చిందంటే
సంకోచించక మనసు విప్పి నవ్వేసేయ్ అంతే

ఎవరైనా బాధపడుతూ వారి కంటనీరు చూస్తే
అక్కున చేర్చుకుని ఓదార్చు తప్పు ఏంలేదు

పలుమార్లు అబద్ధాలు చెబితే అద్దాన్ని చూపు
ఎదగడానికి అవసరమైతే ముందడుగేయ్ అంతే

ఎవరైనా నిన్ను వదిలి వెళుతున్నామని అంటే
వీడ్కోలు చెప్పి వీపు నిమురు చేసేది ఏమీలేదు

Wednesday, October 13, 2021

!!అన్నిట్లో ఆనందం!!


ఆస్తులేం కూడబెట్టలేదని హైరానా పడకు..
డబ్బులకేం అడుక్కునైనా కూడబెట్టుకోవచ్చు
అభిమానం నమ్మకం అడుక్కుంటే దొరకవు
సంపాదించుకోవాలి అంటే శ్రమపడవలసిందే
పోగొట్టుకోవాలి అనుకుంటే చిటికెలో పోతాయి!

ఒకరుపోతే మరొకరు వస్తారు ఆస్థానంలోకి..
అలాగని తృప్తిపడాలి లేకుంటే బ్రకలేం కదా
వందమంది గుంపుగా ఉండి మాత్రం ఏమిటి
ఆ ఒక్కరి స్థానాన్ని మాత్రం పూరించలేరుగా!

నన్ను నాశనం చేయాలనుకునే ప్రయత్నాలని
పలుకరించి ప్రణామంచేసి మరీ చెబుతున్నా..
నాశనమవ్వడంలోనూ నవ్వగలనని చెబుతున్నా!

Tuesday, September 21, 2021

Thursday, September 16, 2021

!!సమయానుసారం!!


చీకటిని తరమాలన్న ప్రయాసలో సమయం వృధా కానీయక
వెలుగునిచ్చే దీపాన్ని వెలిగించటంలో సమయాన్ని వెచ్చించు

వేరెవరినో నీచంగా చూపించడంలో సమయాన్ని కేటాయించక
నీవు ఉన్నతంగా ఎదగడానికి ఎక్కువ సమయం ప్రయత్నించు

ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారని యోచించక
నువ్వేం చేస్తున్నావు ఎవరికెంత వరకు ఉపయోగం ఆలోచించు

దొరికిందే మంచిసమయమనుకో మంచి సమయంకోసం వెతక్కు
సమయం కనబడదు కానీ ఎన్నో కనబడేలా చేస్తుంది గ్రహించు

అవసరమైన సమయంలో చెయ్యవలసిన సహాయము చెయ్యక
సమయం మించిపోయాక చేస్తే క్షమించరాని నేరంగా పరిగణించు

సమయానుసారం నువ్వు మారు లేదా దాన్ని నువ్వు మార్చు
సమస్యలు వస్తే తిట్టుకోకు ఏది ఏమైనా ముందుకు పయనించు!