సంధ్యా సమయంలో ఒకవ్యక్తి అలా సముద్రపు ఒడ్డున నడుస్తూ కుప్పగా పడి దారికడ్డుగా ఉన్న పెద్ద పెద్ద మట్టిబెడ్డల్ని చూసి వాటిని తీసి ఒకోటి సముద్రంలోకి విసిరేస్తూ చివరికి నాలుగు మిగిలి ఉండగా....యాధాలాపంగా ఒక మట్టిబెడ్డని పగులగొట్టి చూసి ఆశ్చర్యంతో చకితుడైనాడు అందులో మెరుస్తున్న వజ్రాన్ని చూసి. మిగిలిన నాలుగూ పగులగొట్టి చూడగా అందులో కూడా వజ్రాలే మెరుస్తూ కనపడి ఇతడ్ని వెక్కిరిస్తున్నట్లుగా అనిపించి....
అయ్యో అనవసరంగా మట్టిబెడ్డలు అనుకుని పైపైన చూసి అనవసరంగా వజ్రాలని సముద్రపాలు చేసాను కదా అని పశ్చాతాపడ్డాడు....
మనం కూడా అలాగే పైపై ఆకారాన్ని చూసి ఎందుకూ పనికిరారనుకుని నిర్లక్ష్యం చేస్తుంటాం వజ్రాలాంటి కొంతమంది వ్యక్తుల్ని. అలా కాకుండా చూసిన వెంటనే ఎవరిపైనా ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి రాకుండా వారితో సాన్నిత్యంగా మెలిగి వారిలోని మంచిని గ్రహిస్తే వజ్రాలెన్నో మన చేయిజారిపోకుండా మనతోనే ఉండి మన విలువను మరింత పెంచుతాయేమో యోచిద్దాం.....ఏమంటారు!
మా ఆఫీస్ లో నా సహ ఉద్యోగిని లంచ్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఆత్రుతతో భోజనం కూడా చేయనీయకుండా వినమంటూ వివరించబోతుంటే......
ఒక్క నిముషం నీవు చెప్పే ముందు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధనం చెప్పి తరువాత నీవు చెప్పమంటే.... సరే అన్న తనతో సాగిన సంభాషణ...
1.ప్ర:-నీవు చెప్పాలనుకుంటున్నది నిజమా, అది నీవు చూసావా?
జ:- "లేదు"విన్నాను చెప్పుకుంటుంటే...
మరి అలాంటప్పుడు నీవు చెప్పేది నిజము అవునోకాదో, నీవు కన్నులతో చూడలేదు నీవు చెప్పబోయే విషయం గురించి నీకే సరిగ్గా తెలీదు దాని గురించి మనకెందుకు! 2.ప్ర:- నీవు చెప్పబోతున్న విషం మంచిదా?
జ:-"లేదు" మంచి విషయం ఐతే పదిమందికి చెప్పు, లేకపోతే దానిగురించి మరచిపో! 3.ప్ర:-నీవు చెప్పడం వలన మనిద్దరిలో ఎవరికైనా ఉపయోగము ఉందా?
జ:-అలాంటిది ఏమీ లేదు.
నీవు చెప్పాలనుకుంటున్న విషయంలో నిజంలేదు, మంచిలేదు, ఉపయోగం అంతకన్నాలేదు.
అలాంటప్పుడు అది నాకు చెప్పవలసిన అవసరం కూడాలేదు.
ఫ్రెండ్స్....ఏదైనా విషయం చెప్పేముందు ఈ మూడు ప్రశ్నలు మనకి మనం వేసుకుని ముందుకు సాగుదాం...
Wishing you GOOD LUCK!
అమ్మా...ఎందుకని ఇలా అన్నీ నాకే జరుగుతున్నాయి, నేనేం తప్పుచేసాను, మొన్న లెక్కల్లో ఫెయిల్ అయ్యాను, నిన్న నా అనుకున్న స్నేహితుడు నన్ను వదిలేసాడు, ఏది అనుకున్నా నాకే ఎందుకని ఇలా వ్యతిరేకంగా జరుగుతుంది? ఇలా ప్రశ్నలవర్షం కురిపిస్తున్న కూతుర్ని కేక్ తయారుచేస్తున్న తల్లి చూసి నీకు ఇష్టమైన కేక్ చేస్తున్నాను ఇది నీవు తిన్నాక నీ ప్రశ్నలకి సమాధానం వెదుకుదాం అన్న మాటలకి సరె అని..."నీవు చేసే కేక్ అంటే నాకు అమితమైన ఇష్టం".
అమ్మ: కాస్త డాల్డాని అందివ్వు..
కూతురు: ఛా ఇదేంటో ఇంత జిడ్డుగా ఉంది!
అమ్మ: ఆ 4 కోడిగుడ్లని కూడా పగులగొట్టి అందులో వేయి, అలాగే ఆ మైదాపిండిని కూడా, అదే చేత్తో చిటికెడు సోడా తీసుకుని కలుపు..
కూతురు: యాక్ :( ఇదేంటమ్మా ఈ గుడ్లు ఇంత వాసన వస్తున్నాయి, ఈ పిండి ఇలా రబ్బర్ లా సాగుతుంది....చూస్తుంటేనే అసహ్యంగా ఉన్నాయి!
అమ్మ: అవును అవి అన్నీ అలా విడివిడిగా అలాగే ఉంటాయి, కానీ వాటినన్నింటినీ సమపాళ్ళలో కలిపి సక్రమంగా ఉడకనిస్తే....నీకు ఇష్టమైన రుచికరమైన కేక్ తయారౌతుంది.
అలాగే మన పనులు కూడా......ఇష్టమైన విధంగా జరగాలంటే విసుగు, చిరాకు లేకుండా మనకి జరుగుతున్న విషయాలని కష్టం అనుకోకుండా సక్రమంగా ఆలోచించి ఆచరణలో పెట్టి శ్రమపడితే తగిన సమయానికి మనం ఆశించిన ఫలితాలు మనకి దక్కుతాయి. అవే మనం జీవితంలో ముందుకు సాగడానికి కిక్కునిస్తాయి :)
యువహృదయం డాబుగా దర్జాగా నిలబడి తనంత అందమైన వారే ఎవరూ లేరు అంటూ విర్రవీగింది. ఔనంటే ఔనంటూ దాని అందాన్ని మిగతా యువ హృదయాలు పొగడ సాగాయి.అంతలో అక్కడికి ఒక వృధ్ధహృదయం వచ్చి.........
ఏంటీ! నాకన్నా అందమైనదా నీ హృదయం అని ప్రశ్నించింది.
యువ హృదయాలన్నీ.....
ఆ ముక్కలై, సొట్టలుపడి, బీటలువారి, అక్కడక్కడా అతుకులు వేయబడి వున్న వృధ్ధహృదయాన్ని చూసి ఇదా! అందమైన హృదయమా! అని ఆశ్చర్యపోతూ బీటలువారిన నీవెక్కడ అత్యంత సౌందర్యవంతమైన మా యువ హృదయమెక్కడ అని అవహేళన చేసాయి.....
దానికి సమాధానంగా వృధ్ధహృదయం.... నీవు బాహ్యసౌందర్యాన్ని చూసి విర్రవీగు తున్నావు. నా హృదయం పైన బీటలు నేను పంచిన ప్రేమకి చిహ్నం, నా హృదయాన్ని కోసి ముక్కలుగా నా ప్రేమని పంచాను. దానికి బదులుగా వారు ఇచ్చిన ప్రేమను తీసుకుని నా హృదయంలోని ఖాళీలను పూడ్చాలని ప్రయత్నించాను.అలా ఏర్పడినవే ఈ అతుకులు, బీటలు.నేను పంచిన ప్రేమకి బదులుగా కొందరు తిరిగి ఇవ్వని వాటికి గుర్తులు ఈ ఖాళీలు.సరీ సరిపడని ప్రేమతో ఏర్పడిన ఈ ఖాళీలు, అతుకులు, బీటలు చూడడానికి అసహ్యముగావున్నా నాకు గర్వంగా కూడా వుంటుంది. ఎందుకంటే నేను ఇంతమందికి ప్రేమని పంచగలిగానుకదా అని. ఇప్పుడు చెప్పు ఎవరు అందమైనవారో????
యువహృదయం మౌనంగా కన్నీరు కారుస్తూ వెళ్ళి వృధ్ధహృదయాన్ని క్షమించమంటూ తన హృదయం నుండి కొంచెం ముక్కని తీసి ఇచ్చి ఖాళీగా ఉన్న వృధ్ధహృదయంలో అమర్చింది.అది సరిగ్గా అందులో సరిపడకపోయినా వృధ్ధహృదయం యువహృదయాన్ని కౌగిలించుకుని తన హృదయం నుండి చిన్నిముక్కను తీసి ఇచ్చింది.దాన్ని యువహృదయం అమర్చుకుని చిన్ని బీట ఉన్న తన హృదయం ఇప్పుడిప్పుడే అందాన్ని సంతరించుకుంటుందని వృధ్ధహృదయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తెగమురిసింది.....
పరీక్షల్లో పిల్లల్ని వ్యాసరచనల్లో భగవంతుడ్ని మీరు ఎవరిలా మార్చమని కోరుకుంటారు అన్న దానికి సమాధానంగా ఒక చిన్నారి వ్రాసిన సమాధానాన్ని చదివిన టీచర్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది చూసి వాళ్ళాయన ఏమైంది అని అడిగిన దానికి సమాధానంగా ఆ కాగితాన్ని ఇచ్చి చదవమంది....
ఓ! భగవంతుడా నన్ను నీవు ఒక టెలివిజన్ గా మార్చేయి, నేను మా ఇంట్లో ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి అనుకుంటున్నాను.అలా నేను మా కుటుంబ సభ్యుల అందరినీ నా చుట్టూ కూర్చోపెట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించాలని నా ఆశ. టీవీ పనిచేయకపోతే దాని మీద చూపించే శ్రధ్ధని నా పై చూపాలని నా కోరిక. నాన్నగారు బయటి నుండి రాగానే టీ తాగుతూ రిలాక్స్ అవ్వడానికి, అమ్మ మూడ్ బాగోపోతే విసిగించకు నన్ను అంటూ మనసుని ఉల్లాస పరచుకోవడానికి, అన్నయ్యలు ఇది అది అని నాకోసం పొట్లాడుకోవడానికి నాపై ఆధారపడతారు, అంటే ఇంట్లోని అందరి దృష్టి నాపై(టీవీ) ఉంటుందిగా. అలా అందరూ నాతో సమయాన్ని గడుపుతూ వాళ్ళు ఆనందాన్ని పొందుతారు కదా! అందుకే నిన్ను నేను ఇలా కోరుకుంటున్నాను. భగవంతుడా! నన్ను టెలివిజన్ గా మార్చి నాకోరిక తీరుస్తావు కదా!
అది చదివిన టీచర్ గారి భర్త కాగితాన్ని భార్యకు ఇస్తూ... భగవంతుడా!ఎంత ధారుణం ఆ తల్లిదండ్రులది, పాపం ఆ పసిపాప అనుకుంటూ.... అది మన కూతురు వ్రాసినదేనండి అంటూ అతని వైపు చూసింది!