Wednesday, April 26, 2023

!!జీవిద్దాం!!

మనిషిలో మంచి కోసం ప్రాకులాడకు
వారిలో వాస్తవాలను వెతుకులాడు!!

మంచి బూటకపు బుర్కా వేసుకున్నా
నిజం నగ్నంగా నెమ్మదిగా నడుస్తూ
గర్వంగా గాయాలతో సాగిపోతుంది!!!

మన జీవితం మనకి నచ్చినట్లు ఉందాం
దొరికింది ఏదైనా ఆనందంగా అనుభవిద్దాం
పొందలేని వాటి గురించి చింతించ వద్దు
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం!

Monday, January 23, 2023

 !! సర్దుకునిపో!!

బాధలు ఎన్ని ఉన్నా..
నలుగురిలో నవ్వవలసిందే!

ఎలా ఉన్నావని అడిగితే..
బాగున్నామని చెప్పవలసిందే!

పరిస్థితులు మారిపోతుంటే..
తలవంచి మసలుకోవల్సిందే!

మన కలలు పలుమార్లు చస్తే..
కొత్తవాటికి ఊపిరి పోయాల్సిందే!

మనసులోని భావోద్వేకాలను..
మనలో అణచుకుని మగ్గవల్సిందే!

కారణాలు ఏవి అయితేనేమి..
మౌనంగా మనం ఉండవలసిందే!

ఇష్టం ఉన్నా లేకపోయినా..
కొందరిని మరచి బ్రతకవలసిందే!

Sunday, November 27, 2022

 !!మన'పురో'గతి!!

శ్రమించి సంపాదించి కడుపు నిండా భుజించేవారు
కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు వచ్చేసాయి
తిన్నది అరగడానికి ఇప్పుడు వాకింగు చేస్తున్నారు

నడిరాత్రి నట్టింట కన్నంవేసి దొంగలు దోచేసేవారు
కొత్త కోర్సులు పుట్టుకొచ్చి సైబర్ నేరగాళ్ళ నెలవైంది
పగలురేయి దొంగలు దొరలై నెట్ ఇంట దోస్తున్నారు

చాలామంది సాప్ట్ వేర్ ఇంజనీర్లుగానే పనిచేస్తున్నారు
మనసులు మాత్రం హార్డ్ వేర్ గా మారిపోతున్నాయి
కూర్చుని తిని కుశలప్రశ్నలు అడిగేవారు కరువయ్యారు

నాడి పట్టి చూసి గుళికలతో రోగం నయం చేసేవారు
ఆయాసమ్మొస్తే ఆస్తులు అమ్ముకోవలసి పరిస్థితొచ్చింది
చేయిపట్టి పలుకరించి ఏమైందని అడగడం మానేసారు

అప్పట్లో అప్పు చేయటం తప్పు అదోపెద్ద ముప్పనేవారు
మిషన్లుగా మారిన మనుషుల కష్టం కాసులౌతున్నాయి
క్రెడిటుకార్డు పై కొనటమే ఇప్పుడు క్రెడిట్ అంటున్నారు

వస్తువేదో చూసి బజారుకెళ్ళి కావల్సినవి కొనుక్కునేవారు
నాణ్యత చూడ్డమంటే ఇప్పుడు నామోషీ అయిపోయింది
కుర్చీలో కూర్చుని మొబైల్ ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు

పుష్టిగా తిని కాపురంచేసి పిల్లల్ని కనిపెంచి పోషించేవారు
సంతానం కోసం ఇప్పుడు సాఫల్య కేంద్రాలు వెలిసాయి
సెక్స్ మూడ్ కోసం తేదీచూసి మందులు మ్రింగుతున్నారు

Thursday, September 29, 2022

!!గుండెమాట!!


గుండె అలసి ఆగిపోయే ముందు..
గుండె పంపేటి సంకేతాలు వినుకో
ఛాతీ నొప్పి అతిపెద్ద లక్షణమనుకో!

మనస్సు రాత్రిపగలు చేస్తే చంచలం
మనస్సు జాగ్రత్తంటూ చేసే సంకేతం
గుండె భారం బిగుతూ ఒత్తిడి ఉంటే
గుండెవైద్యుడ్ని కలువని చెప్పిందనుకో
ఈజబ్బుకి అధికబరువొక కారణమనుకో!   
 
ఒక్కసారిగా ఒంటికి చెమటలు పట్టడం
చల్లని చెమటలు గుండెవైఫల్య కారణం
ఛాతీ చికిత్సను కోరుతుందని తెలుసుకో

విపరీతమైన అలసట శ్వాస ఆడకపోతే
ఎక్కువ పని చేయటంవల్లని పొరబడకు   
బలహీనమైన గుండె నాళాల లక్షణమది
శ్వాసలోపం గుండెపోటుకి పెద్దహెచ్చరిక
కనుక్కో సకాలంలో వైద్యం చేయించుకో!

ప్రపంచ హృదయ దినోత్సవం రోజున..  
నీ గుండెని కాపాడే భరోసా నీవేఇచ్చుకో     
హృదయం చెప్పిందే ఎల్లప్పుడూ వినుకో   
హృదయాన్ని శాంతినిలయంగా మార్చుకో! 

Friday, June 17, 2022