Thursday, March 4, 2010

ప్రేమంటే! పెళ్ళంటే?

బొటానికల్ టూర్ కి వెళ్ళిన అందరూ భోంచేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఒకబ్బాయి లెక్చరర్ ని ప్రేమంటే ఏమిటీ అని అడిగిన దానికి సమాధానంగా ఆయన ఆ స్టూడెంట్ని "ఒరేయ్ నీకు దీనికి సమాదానం చెబుతాను కాని నీవు ముందు ఆ ఎదురుగా ఉన్న పొలంలో నుండి ఏపుగా ఎదిగిన ఒక జొన్నకంకిని కోసుకుని రా, ఒక్క షరతు ఎంత సమయమన్నా తీసుకో కాని ఒకసారి పరిశీలించిన కంకిని మరల వెనుకకి వచ్చి దాన్ని చూడకూడదు" అన్న మాటలకి ఆ అబ్బాయి అలాగేనంటూ పొలంలోకి వెళ్ళి కంకుల్ని పరీక్షిస్తూ ఒకదానికన్న ఇంకొకటి పెద్దగా ఉండవచ్చునేమో అనుకుంటూ పొలమంతా తిరిగి ముందు చూసిందే పెద్దగా వుందిగా అనుకుని మరల వెనుకకి వెళ్ళి కోయకూడదు కదా అని ఖాళీ చేతులతో వచ్చి "సార్ ఏదో వెళ్లేకొద్దీ పెద్ద కంకులు దొరుకుతాయనుకుని చివరికి ఏది దొరక్క తిరిగి వచ్చానని సమాధానమిచ్చాడు.
దానికి లెక్చరర్ గారు నవ్వి "ఇలాటిదేరా ప్రేమంటే! ముందుకి వెళ్ళేకొద్దీ ఇంకా ఏదో దొరుకుతుంది అన్న ఆశతో చేతికి అందిన వాటిని వదిలేసుకుంటాము" అని సమాధానం ఇచ్చారు.
ఇంకొక అబ్బాయి లేచి మరి పెళ్ళంటే ఏమిటి సార్ అని అడిగిన దానికి సరే వెళ్ళి నువ్వు పొలం నుండి ఒక పెద్ద కంకినె తీసుకుని రా చెబుతాను పెళ్ళంటే ఏమిటో అన్నారు.
ఈ తెలివైన అబ్బాయి ఈసారి నేను ముందు వానిల చేయకూడదు అనుకుని పొలంలో వున్న కొన్నింటిలో పెద్దగా కనపడిన కంకిని కోసుకుని వచ్చి "సార్ కనపడిన వాటిలో పెద్దది చూసి తీసుకుని వచ్చాను" అని కంకిని చేతికి అందించారు.
లెక్చరర్ వాడివంక చూసి "ఇలాంటిదే మరి పెళ్ళంటే" అన్నారు.
అదేంటి సార్ ఫెళ్ళికి దీనికి ఏమిటి సంబంధం అన్న దానికి ఆయన నవ్వుతూ........అవును నువ్వు వెళ్ళి వున్న వాటిలో నీకు నచ్చినది నీకు పెద్దగా అనిపించింది చూసి ఎంచుకుని తీసుకున్నావు, నీవు చేసిన పనిపై నీకు నమ్మకంతో, కనపడిన వాటితో మంచిది ఎంచుకుని తృప్తి పడి సర్దుకుపోయవుగా పెళ్ళికూడా అటువంటిదే అని సమాధానం ఇచ్చారు.

Tuesday, February 16, 2010

ఆపరేషన్ కి అనువైనవాడు!

అయిదుగురు సర్జన్స్ చర్చించుకుంటున్నారు...

ఎటువంటి పేషంట్ అయితే ఆపరేషన్ కి అనువైన వాడని!

:):):):):) ?????



మొదటి డాక్టర్ అన్నారు నేనైతే అకౌంటంట్ అనువైన వాడు అనికుంటాను ఎందుకంటే అతని శరీరంలో ప్రతి భాగమూ నంబరింగ్ వేసివుంటుంది కదా!

రెండవ డాక్టర్...హేయ్ ఎలక్ట్రీషియన్ అయితే అతనిలోని భాగాలన్ని కలర్ కోడ్స్ తో ఆపరేషన్ కి అనువుగా వుంటాయి!

మూడవ డాక్టర్...నాకైతే లైబ్రేరియన్ పేషంట్ కి ఆపరేషన్ చేయడం సులువు ఎందుకంటే అతని శరీరంలో ఏభాగమైనా చక్కగా ఒక క్రమమైన పద్దతిలో లేబులింగ్ చేసి అమర్చబడి ఉంటాయి.

నాలగవ డాక్టర్...మీరు ఏమన్నా నాకు మాత్రం భవనాల కట్టడి( ) రంగంలో వున్నవారైతే హాయి ఏమో అనిపిస్తుంది , ఎందుకంటే వాళ్ళే అర్థం చేసుకోగలరు పని ఆఖరిలో చిన్న చిన్న పనులు వదిలేసి పూర్తి చేస్తాం అన్నా ధైర్యంగా వుండడం ఎలాగో!

అప్పటి వరకూ నోరు మెదపకుండా కూర్చున్న అయిదవ డాక్టర్ ఒక్క ఉదుటన లేచి పిచ్చివాళ్ళారా... రాజకీయ నాయకుడి కన్నా ఎవరూ అనువైన రోగి కాదు ఆపరేషన్ కి, ఎందుకంటే వాళ్లకి మాత్రమే హృదయం కాని,అనుకున్న పనిని చేసే ధైర్యం కాని, వెన్నెముక కాని,తల వున్నా అందులో మెదడుకాని,ఏవీ ఉండవు, ఏ భాగం లేని వానికి ఆపరేషన్ చేయడం ఎంత సులువో ఒక్కసారి ఆలోచించండి!

Thursday, February 4, 2010

ఏడువారాల నగలు!

ఏవిటిది స్వామీ..... నేను నమ్మలేకపోతున్నాను, ఏవిటీ ఇవ్వన్నీ నాకేనా?
అమ్మో! ఇన్నినగలే....వడ్డాణం,అరవంకీ,కాసులపేరు,పాపిటబిల్ల,సూర్యుడు, చంద్రుడు,ముక్కుపుడక,నాగరం,జడకుప్పెలు,గాజులు,మురుగులు, బంగారుపట్టీలు,జుంకీలు,దుద్దులు,చెంపసరాలు,మాటీలు,ఉంగరాలు,చంద్రహారం,నెక్లెస్, లాకె ట్గొలుసు....
ఎన్నని చెప్పను కొన్నింటి పేర్లు కూడా నాకు తెలియడంలేదు, ఈ ఆనందం తట్టుకోలేక తెలిసిన వాటి పేర్లు కూడా తప్పు చెప్పేస్తున్నానేమో!
ఇవేకామోసు ఏడువారాల నగలు అంటే?

భగవంతుడా! చప్పడ్ ఫాడ్ కర్ దేనా అంటే ఇదేనా స్వామీ?తెలుగులో సామెతలు కూడా గుర్తురావడం లేదు అడ్జస్ట్ అయిపో స్వామీ....
ఇవ్వడమైతే ఇచ్చావు మరి ఎలా ధరించాలో వీటిని వివరించవేలయ్యా?
ఆదివారం సూర్యానుగ్రహానికి కెంపులు,
సోమవారం చంద్రుని చల్లదనానికి ముత్యాలు,
మంగళవారం కుజుని కొరకై పగడాలు,
బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు,
గురువారం బృహస్పతి కొరకు కనక పుష్యరాగాలు,
శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు,
శనివారం శని శాంతికై నీలమణి పతకాలు....
వేసుకోమని సెలవిచ్చారు సంతోషం స్వామీ!
కానీ మీకు మా పై ఇంత చిన్నచూపు ఏలనయ్యా?
వారానికి పదిరోజులు పెడితే మీ సొమ్మేం పోతుంది స్వామీ?
స్వామీ....చెప్పండి,
చెప్పండి స్వామీ?
స్వామీ...స్వామీ
చెప్పండి స్వామీ
కలలోనైనా
కనీసం జస్టిస్
చేయండి స్వామీ>:):)

Saturday, January 23, 2010

నా జ్ఞాపకాలు.

నా మెదటి పోస్టింగ్ కాజీపేట్ హాస్పిటల్లో వేసినప్పుడు ప్రతిఒక్కరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చి అక్కడ అన్నలు, అక్కలు ఉంటారు వాళ్ళతో జాగ్రత్త అని చెపితే అదేంటి అందరిళ్ళలో ఉండరా ఏంటి అని మనసులో అనుకున్నా పైకి అంటే ఇంకో నాలుగు ఉచిత సలహాలని ఇచ్చేస్తారని భయపడి. ఈ అన్నలు అక్కలు అంటే వాళ్ళ దృష్టిలో నక్సల్స్ అని తరువాత తెలుసుకున్నాననుకోండి అది అప్రస్తుతం..... అలా హాస్పిటల్ లో అడుగిడిన నన్ను అందరూ సాదరంగా ఆహ్వానించి స్టాఫ్ అందరినీ పరిచయం చేసారు. పదిరోజులు కాజీపేట్ హైదరాబాద్ మధ్య తిరుగుతూ గడిచి పోయాయి. తరువాత కాజీపేట్ లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకుని ఉన్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు నేను హాస్పిటల్ కి వెళుతుంటే దారిలో "గుడ్ మార్నింగ్ మాడం" అంటూ ఆరడుగుల అందగాడు కాస్త మాసిన గెడ్డంతో నన్ను పలుకరించాడు.అది మొదలు రోజూ హాస్పిటల్ వరకు నా వెనుక, ఇంటికి వెళ్ళేటప్పుడు నా ముందు రావడం దినచర్యగా మారింది. అడుగుదాము ఎందుకు ఇలా రోజూ వెంటపడుతున్నావు అనుకున్నా కాని....అమ్మో! అన్నేమో మనల్ని ఏమీ అనడంలేదుకదా అని ఊరుకున్నా. ఇలా రెండు వారాలు గడిచాయి. ఆరోజు అతను నాకు కనపడలేదు నిజం చెప్పాలంటే నా కళ్ళుకూడా ఏమైంది ఈరోజు రాలేదు అని వెతికాయనుకోండి....
హాస్పిటల్ లో అడుగు పెట్టగానే ఎదురుగుండా ఆ కుర్రాడు "గుడ్ మార్నింగ్" అంటూ నవ్వుతూ కనిపించాడు మనసు హాయిగా అనిపించింది. అది మొదలు అలా రోజూ హాస్పిటల్ కి రావడం విష్ చేసి మెడిసిన్ తీసుకుని ఔట్ పేషెంట్ బ్లోక్ లోనుండి నన్ను చూసి కొద్దిసేపటికి వెళ్ళిపోవడం. ఒకరోజు ఉండలేక అడిగాను ఎందుకు ఇలా రోజు వస్తావు నీకు ఏం పనిలేదా అని కాస్తవిసుగ్గా.... దానికి చిరునవ్వు నవ్వి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని వెళ్ళిపోయాడు. ఎందుకో నేను అంత విసుగ్గా అడిగి ఉండవలసింది కాదు అనుకున్నాను మనసులో. ఆ తరువాత అతను కనిపించలేదు. రోజూ అతను కనపడతాడని నాకళ్ళు వెతికేవి కాని అతను ఇక ఎప్పటికీ కనపడని లోకానికి వెళ్ళిపోయాడని, అతనికి బ్రెయిన్ ట్యూమర్ వుందని కాస్త మతిస్తిమితం కూడా తప్పిందని తరువాత మా సీనియర్ స్టాఫ్ చెపితే తెలిసింది. మనసంతా భారమైంది.....
కొద్దిరోజుల తరువాత......ఒకరోజు కంప్లెండ్స్ బాక్స్ తెరచి చూస్తే అందులో నాకు అతను వ్రాసిన లేఖ కనపడింది, దాని సారాంశం నేను వాళ్ళ అక్కలా వుంటానని వాళ్ళక్కా బావా ఇతనికి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించ వలసివస్తుందో అని వదిలేసారని. వాళ్ళ అమ్మానాన్న మంచీర్యాల ట్రయిన్ ఆక్సిడెంట్ లో పోయారని. ఆ ఉత్తరం చదువుతుంటే నాకు తెలియకుండానే కళ్ళవెంట నీళ్ళు రాలాయి. నిన్న కాజీపేట్ పనిమీద వెళ్ళి వస్తుంటే నా పాత జ్ఞాపకాలు నన్ను తడిమాయి....
వాటిలో ఒకటి ఇలా మీముందు!!!

Tuesday, January 19, 2010

ఈరోజు ఉదయాన్నే లేచిపోయా!

రేపు ఉదయాన్నే తప్పకుండా లేచి మొదలు పెట్టాల్సిందే...
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక దీన్ని ఆపకూడదు, ఏవిటి బొత్తిగా ఇంత బద్దకం పెరిగిపోయింది అప్పట్లో ఎంతటి చలాకితనం ఉత్సాహం ఉండేవి నాలో అవన్నీ ఏమైపోయాయి,ఇలాగైతే మున్ముందు ఇంకా కష్టం.ఇదే కనుక కొనసాగితే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏమైనాసరే మరల మునుపటి నేను నేనుగా మారవలసిందే ఇంక రేపు ఉదయం లేచిపోయి పారిపోతున్నా! అచ్చు తప్పు తప్పు...పరిగెడుతున్నా అంటే వడివడిగా నడిచేస్తానని ఇలా ఆరునెలల్లో అరవైసార్లు అనుకుని ఉంటాను. ఇలా రాత్రి పడుకునేటప్పుడు అనుకోవడం ప్రొద్దున్నే బద్దకించడం అలవాటైన నాకు నాశరీరం కూడా సహకరించడంతో వాకింగ్ షూ పాడై మూడురోజుల్లో కొత్తవి కొనుక్కొని మొదలుపెడదాంకదా అనుకున్నది ఆరునెలలు పట్టిందన్నమాట.
ఇందులో గొప్పేముంది వెళితే ఆశ్చర్యపోవాలి కాని అంటారా! నిజమేనండి....కాని ఈరోజు ఉదయాన్నే అయిదున్నరకి నేను లేచిపోయి తయారై కొత్త షూ వేసుకుని పరిగెట్టేసానుగా అందుకే ఈ ఆనందం అన్నమాట.
ఏదో ఆరునెలల నడకనంతా కవర్ చేయాలి అన్న భావోద్రేకంలో పరుగు తీసానే కాని ఆఫీసులో కాళ్ళంతా ఒకటే నొప్పి, ఇంటికివచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కాని రాత్రి ఒకేసారి పడుకుందామని ఇలా రిఫ్రెష్ అయి మీతో పంచుకుంటే కాస్త నొప్పి మరచిపోతానని ఆశన్నమాట.
ఏవండో...మరచిపోయాను ఈ నడక ఇకముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగాలని కోరుకుని నన్ను ప్రోత్సహిస్తారు కదూ!