Sunday, October 19, 2014

!!ఉవాంఛ!!

చూడని తెలియని జీవిత వీధుల్లో...

మళ్ళీ విహరించాలన్న వాంఛ నాలో!

మరోమారు నా ఉనికిని చాటుకుంటూ

కాలప్రవాహంలో కొట్టుకుపోయిన ఆశల్ని

పరామర్శించి ఎవరి పంచన ఉన్నావంటూ

గట్టిగాహత్తుకుని మెత్తగామొట్టి మెల్లగాగిల్లి

బోరు బోరుమని ఏడవాలన్న ఉవాంఛ నాలో!

గతం అంతా గల్లంతై విహంగిలా గగన వీధుల్లో...

పసిపాపై గెంతి కిలకిలా నవ్వాలన్న కాంక్ష నాలో!

ఓసారి అన్నీమరచి నన్నునేను ప్రేమించుకుంటూ

స్వార్ధంతో నేను నాటిన చెట్టు పండ్లని నేనే తినాలని

నియమ నిష్టల నీతులు చెప్పిన వారిని తిట్టుకుంటూ

బంధం త్రుంచి భాధ్యతలని తెంచి నాలో ధైర్యాన్ని పెంచి

అడుగు వెనుక అడుగేసి కలిసిపోవాలన్న ఆకాంక్ష నాలో!

Wednesday, October 8, 2014

!!అన్వేషిస్తే!!

అలసిన జీవితానికి వయసుని ఆసరా అడిగా
గమ్యం ఏదంటూ ఎవరిని అడగాలో తెలియక
సాధించావలసినవి ఉన్నా శరీరం సహకరించక!

జీవితసారాన్వేషణలో "మార్పు"కి అర్థం అడిగా
అవసరానికి నీవారిగా దరిచేరి వీడిపోయేవారని
అనుభవశాలి విచిత్రంగా చెబుతూ చిత్రంగా నవ్వె!

సంతంతా తిరిగి సహనంతో సొమ్మసిల్లి అడిగా
మానవత్వం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని
సంతలో కానరాదు స్మశానంలో చూడమన్నారు!

మృత్యువునే మోహించాలని దానిరూపం అడిగా
చూడనైతే లేదు, కాని కడుసుందరమైన వినికిడి
ఒక్కసారి కలిసి జీవించడం వదిలేస్తారని తెలిసె!

Thursday, October 2, 2014

Friday, September 26, 2014

!!అమ్మ మూల్యం!!

తెలిసీ తెలియని వయసులో నా కూతురు వంట చేస్తుంటే నా దగ్గరగా వచ్చి చిన్నికాగితంలో ఏదో లిస్ట్ రాసి చూసి డబ్బులు ఇవ్వమంది.
అందులోని సారాంశం....
పుస్తాకాలు చక్కగా సర్దుకున్నందుకు:-   రూ  20-00
మంచి మార్కులకి తెచ్చుకున్నందుకు:-       20-00
బజారుకి వెళ్ళి సరుకులు తెచ్చినందుకు:-      20-00
ఇల్లు సర్దడంలో సహాయపడినందుకు:-          50-00
నీకు నచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు:-           40-00
                                                              ----------
                      మొత్తం- - - - - - - - - --    150-00
నేను అలా అమాయకంగా నించుని చూస్తున్న తనని చూసి నవ్వుతూ కాగితాన్ని తిప్పి ఇలా రాసాను.....
తొమ్మిది నెలలు మోసినందుకు కూలి......రు:-    00-00
నిద్రలేకుండా రాత్రులెన్నో గడిపినందుకు:-       00-00
నీ ముక్కు చీది నిన్ను శుబ్రపరిచినందుకు...    00-00
ఆలనాపాలనా చూసి ఆడించినందుకు           00-00
                                                              -----------
మొత్తంగా చూసి అంతా కూడితే ....               00-00
అది చదివి నా కూతురు సారీ అమ్మా అంటూ నన్ను గట్టిగా హత్తుకుని "ఐ లవ్ యూ" అంది. వెంటనే నేను తనని ముద్దాడి ఈ ఒక్క మాటతో నాకు ఇవ్వవలసిన మొత్తం మూల్యం చెల్లించావు అన్నాను. అది ఒక మధురానుభవం!
ఇప్పుడు అన్నీ తెలిసిన వయసులో మన ఆశలని ఆశయాలని నేలకూల్చి మనల్నే సర్దుకుపొమ్మంటూ దానికి మూల్యంగా మన అనురాగాన్నే నవ్వుతూ వారికి చెల్లించమనడం ఎంతవరకూ సమంజసం!
కూతురికి తను అమ్మ అయినప్పుడే తన తల్లి విలువ తెలుస్తుంది అది సహజం!
మరి తల్లికి తన గడిచిన కాలం తిరిగిరాదు.....ఎవరు చెల్లిస్తారు దీనికి మూల్యం?