Monday, November 16, 2015

!!దారి మళ్ళింపు!!

జీవితంతో అష్టాచెమ్మా ఆడుతూ సాగిపోవాలని..
కష్టాలని కాల్చి బూడిదచేసి గాలిలో కలిపివేస్తున్నా 

ఓడిపోయానని శోకించి లోకానికి చెప్పి వ్యర్థమని
ఓటములంటినీ విందుకు రమ్మని వేడుక చేస్తున్నా

విధి వంచించెనని వెక్కిరించడం మతిలేని చేష్టలని
మదిని మందలించి, మరో కొత్తదారి వెతుక్కోమన్నా

దక్కినదాన్నే అదృష్టంగా భావించి స్వీకరించాలని
దక్కనివి కోరనేలేదని మరిచే ప్రయత్నంలో ఉన్నా

దుఃఖానికీ ఆనందానుభూతికీ వ్యత్యాసమే లేదని
హృదయానికి అదే గమ్యమని దారి చూపుతున్నా!

Sunday, November 8, 2015

Friday, October 30, 2015

Tuesday, October 13, 2015

!!తలపు!!

కొన్నిమాటలు తలపుకు వచ్చినప్పుడు
కన్నీటిచుక్కలు చెంపల్ని తడుముతూ
ఎవరో గుండెచలమల పై అడుగేసినట్లు
నిశ్శబ్ధంగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది!

అద్దంలో నన్నునేను చూసుకున్నప్పుడు
రెండు పరావర్తన ప్రతిబింబాలు నవ్వుతూ
గడిచిన కాలమే గెంతులేస్తూ వచ్చినట్లు
మనసువిప్పి మాట్లాడినట్లు మరపిస్తుంది!


ఆలోచనల్లో అక్షరాలను వెతుకున్నప్పుడు
గుర్తులే గోళ్ళ చివర మొలచి మొరపెడుతూ
మూసిన కవనంలో తెరచిన జ్ఞాపకాలున్నట్లు
పట్టుకోబోతే దక్కిన ఆనందమే పారిపోతుంది!

Tuesday, October 6, 2015