Wednesday, March 9, 2022

!!ఎదుగుతున్నాం!!

తల్లి పాలు తాగి అప్పుడు రొమ్ముపై తన్నాం
ఇప్పుడేమో మనసు విరచి దూరమైపోతున్నాం
అవును మనం బాగా ఎత్తుకు ఎదిగిపోయాం!

అమ్మ కనబడకపోతే అప్పుడు అల్లాడిపోయాం
ఇప్పుడు అమ్మానాన్నలను వదలి వెళుతున్నాం
అవును విదేశాల్లో ఉంటేనే సంస్కారవంతులం!

డిబ్బీలో డబ్బులువేసి అప్పుడు మురిసిపోయాం
ఇప్పుడు డబ్బులకు దాసోహమై బ్రతికేస్తున్నాం
అవును మనమిప్పుడు మాగొప్ప ధనవంతులం!

చెడులో కూడా మంచి చూస్తూ పెరిగిన వాళ్ళం
ఇప్పుడు మంచి చెప్పినా చెడు అనుకుంటున్నాం
అవును ఇప్పుడు మనం ఎంతో జ్ఞానవంతులం!

చుట్టూ చుట్టాలుండాలని అప్పుడు కోరుకున్నాం
ఇప్పుడు చుట్టాలు వస్తారంటేనే బాధపడుతున్నాం
అవును స్వార్థపు ఏడంతస్తుల మేడలో ఉన్నాం!

సంతోషం సగం బలమని పోటీపడుతూ పెరిగాం
ఇప్పుడు సంపాదనే సర్వమని వెంపర్లాడుతున్నాం
అవును మనం ఇప్పుడు స్థితిమంతులమైపోయాం!

ఎదగడానికి తొందరపడి ఎదిగేక సిగ్గుపడుతున్నాం
యంత్రాలమైపోయి మనుషులమని మరచిపోయాం
అవును ఎంతో ఎదిగి ఏంకాకుండానే రాలిపోతాం! 

Thursday, November 18, 2021

!!విలువ!!



పాలను మంటపెట్టి
మరిగిస్తే పెరుగు..
పెరుగును గిలక్కొట్టి
పిండితే వెన్న..
వెన్నను వేడిచేసి
కాలిస్తే నెయ్యి అవుతోంది!
మండి మరిగి మాడి
కాలి ఇబ్బంది పడినా...
పాల కన్నా పెరుగు
ఖరీదు ఎక్కువ...
పెరుగు కన్నా వెన్న
వెన్న కన్నా నెయ్యి
విలువ ఎక్కువైనా
అన్నీ తెలుపురంగే ఉంటాయి...
అలాగే మనిషి కూడా కష్టం నష్టం
సుఖదుఃఖాలు ఏం కలిగినా
మారక స్థిరంగా ఉంటే..
వారి విలువ తప్పక పెరుగుతుంది!

Wednesday, November 3, 2021

!!అనుకుంది చేసెయ్!!

 ఆలోచనలతో వృధా చేయకు సమయాన్ని
మంచిగా అనిపించిన పనిని చేసేయ్ అంతే

తెలిసో తెలియకో తప్పుచేసి తెలుసుకుంటే
క్షమార్పణ కోరటం తలవంచినట్లు ఏంకాదు

ఎవరివల్లైనా బాధకలిగితే వారికి తెలియాలి
చెప్పాలి అనుకున్నది చెప్పి పడేయ్ అంతే

నీవలన ఏదైనా తప్పు జరిగినా బాధపడినా
మన్నించమని వేడికో అదేం చిన్నతనం కాదు

నలుగురితో కలిసినవ్వే సమయం వచ్చిందంటే
సంకోచించక మనసు విప్పి నవ్వేసేయ్ అంతే

ఎవరైనా బాధపడుతూ వారి కంటనీరు చూస్తే
అక్కున చేర్చుకుని ఓదార్చు తప్పు ఏంలేదు

పలుమార్లు అబద్ధాలు చెబితే అద్దాన్ని చూపు
ఎదగడానికి అవసరమైతే ముందడుగేయ్ అంతే

ఎవరైనా నిన్ను వదిలి వెళుతున్నామని అంటే
వీడ్కోలు చెప్పి వీపు నిమురు చేసేది ఏమీలేదు

Wednesday, October 13, 2021

!!అన్నిట్లో ఆనందం!!


ఆస్తులేం కూడబెట్టలేదని హైరానా పడకు..
డబ్బులకేం అడుక్కునైనా కూడబెట్టుకోవచ్చు
అభిమానం నమ్మకం అడుక్కుంటే దొరకవు
సంపాదించుకోవాలి అంటే శ్రమపడవలసిందే
పోగొట్టుకోవాలి అనుకుంటే చిటికెలో పోతాయి!

ఒకరుపోతే మరొకరు వస్తారు ఆస్థానంలోకి..
అలాగని తృప్తిపడాలి లేకుంటే బ్రకలేం కదా
వందమంది గుంపుగా ఉండి మాత్రం ఏమిటి
ఆ ఒక్కరి స్థానాన్ని మాత్రం పూరించలేరుగా!

నన్ను నాశనం చేయాలనుకునే ప్రయత్నాలని
పలుకరించి ప్రణామంచేసి మరీ చెబుతున్నా..
నాశనమవ్వడంలోనూ నవ్వగలనని చెబుతున్నా!

Tuesday, September 21, 2021