Saturday, October 31, 2020

!!అప్పుడు ఇప్పుడూ!!

 జీళ్ళూ జంతికలు రూపాయికి రెండూ కొనుక్కుని తిన్నాం..
ఇళ్ళు చిన్నవి అయినా అందరి హృదయాలు పెద్దగా ఉండేవి
స్పేస్/ప్రైవసీ వంటి పదాల అర్థంతో అసలు అవసరంపడలేదు
ఎందుకంటే...అందరి ఇంటిపై కప్పులూ ఏకమై కలిసుండేవి
పొరుగు వారికి సైతం మన బంధువుల పేరులు తెలుసుండేవి
వేడి అన్నం నెయ్యి పప్పు పచ్చళ్ళతో కడుపునిండా తిన్నాక
మిద్దెపై వరుసగా పడకలేసి పిచ్చాపాటి కబుర్లతో పడుకునేవారు
కష్టసుఖాఃలు మనసువిప్పి మాట్లాడుకుని పరిష్కరించుకునేవారు 
ఆనందం అధికంగా ఉండి అహం తంత్రాలకు చోటుండేది కాదు!
మరి ఇప్పుడో..
ఇళ్ళు విశాలంగా ఉంటున్నా మనసులు కలవర పడుతున్నాయి
చిన్నా పెద్దా అందరికీ ఎవరి గది వారికే ఏడుపు నవ్వు గోప్యమే
ప్రతొక్కరి చేతిలో మొబైల్ అందులోనే హాయ్ బాయ్ పలరింపులు
గదులేమో AC తో చల్లన ఒకరి ఉన్నతి చూసి ఒకరికి మంట లోన! 

Wednesday, October 7, 2020

జీవితం అలసిపోతుందిప్పుడు!!


జీవితం ఇప్పుడు క్రమంగా అలసిపోవడం మొదలెట్టింది..
అందరూ ఏదో విధంగా మార్పు చెందుతున్నారు..
పొట్టపెరిగి బట్టతలవచ్చి జుట్టునెరసి ఉన్నారు..
కొందరు ఫిట్నెస్ కోసం ప్రాకులాడుతుంటే
మరికొందరు ఉండి మాత్రం చేసేది ఏంటి అనుకుంటున్నారు..
ఏది ఏమైనా అందరిలోనూ ఏదోక మార్పు..
బరువు భాద్యతలతో కొందరు ఏమీ లేక మరికొందరు బెంగపడుతున్నారు..
బీపీ షుగర్ కీళ్ళనొప్పులు చూపు మందగించి బాధగున్నారు..
చెప్పి కొందరు చెప్పక మరి కొందరు కాలం గడుపుతున్నారు..
ఏదోలా అందరి వయసు పెరుగుతుంటే కాలం తరుగుతుంది..
మొత్తానికి సమయం సాగుతూ జీవితం అలసిపోతుంది!!!

Thursday, September 24, 2020

!!బీ హ్యాపీ!!

యవ్వనంతో మిడిసిపడకు రేపు చింతిస్తావు
ఉదయించే సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు
కొన్నాళ్ళు కొనసాగే జీవిత బాటసారివి నువ్వు
రిక్తహస్తాలతో ఏడుస్తూ వచ్చి ఏడిపించి పోతావు

మూడునాళ్ళ ముచ్చటేనని తెలిసి మురుస్తావు

జీవితాన్ని చూసి ఏడుస్తాడు జీవితం తెలిసినోడు
అనవసరంగా ఆలోచించి ఆందోళన చెందే నువ్వు
అన్నీ తెలిసి కూడా ఎందుకనో ప్రాకులాడుతావు

గర్వంతో తలెత్తి నడిచావో తలకు బొప్పికడతావు

చావు నుండి ఎవరైనా ఎంతని తప్పించుకోగలరు
సమాధియే చివరి గమ్యం చెప్పకుండా పాతేస్తారు
ఓహ్ గుండే..ఉన్నంత వరకూ హాయిగా ఉండు!

Thursday, September 10, 2020

!!నిశ్చింత నిద్ర!!


నేను మంచి నిద్రలో ఉన్నట్లు ఉన్నాను...
నిద్రలో నాకు జాగ్రత్తగా స్నానం చేయించారు
ఇంట్లో అందరూ ఏదో కొత్త ఆట ఆడుతున్నారు
చిన్నవాళ్ళని భుజాలపై ఎత్తుకున్నట్లు నన్నెత్తి
అటూ ఇటూ తిప్పి కదలకుండా నన్ను కట్టారు
నా చుట్టు గుమ్మిగూడి ఏవో మాట్లాడుతున్నారు
ఏడుస్తూ మనసులో మరచిపోవాలనుకుంటున్నారు
ప్రేమగా ఎప్పుడూ నావైపు చూడని వారు కూడా
ప్రేమను చూపిస్తూ లోలోన తొందరపడుతున్నారు!

ఎందుకో ఏమో తెలియదు నిద్రిస్తున్న నన్ను చూసి
గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నన్ను నిద్ర లేపుతున్నారు
హైరానా పడిపోతూ హడావిడిగా తిరుగుతున్నారు!!

నా శరీరం ఎందుకో బిగుసుకుంది ఆ స్థలం చూసి
ఎక్కడైతే నన్ను శాశ్వితంగా పడుకోబెట్టనున్నారో!
ప్రేమ అనుబంధాలకు పరీక్ష పెట్టారు కామోసు..
వారి చేతులతో నాకు నిప్పు పెట్టి వెనుకకు తిరిగి
చూడకుండా వెళ్ళిపోయారు, హమ్మయ్య ముగిసింది
ఇక రోజూ నిద్ర లేవాల్సిన పనిలేదు...గుడ్ బైయ్!!




Sunday, July 19, 2020

!!ఎవ్వరూ రారు!!


తలుపులు బార్లా తీసి ఉంచినా లోపలికి ఎవ్వరూ రారు
వెన్నెల విరబూసున్నా జాబిలిని ఎవ్వరూ పలుకరించరు
ఇప్పుడు పూలవాసన్ని ఆకులూ ముళ్ళే పీలుస్తున్నాయి
పక్షుల కుహకుహలు కూడా రోదనలుగా వినిపిస్తున్నాయి
ఈ నమ్మశక్యం కాని నిజమైనా చూడ్డానికి ఎవ్వరూలేరు!

కష్టాల్లో హితులు పలుకరించడానికి రావాలనున్నా రాలేరు
కడుపున పుట్టిన వారిని అయినా సరే ముట్టుకోవద్దంటారు     
భ్రమరాలు సైతం పువ్వులలో తేనె ఝుర్ర ఆలోచిస్తున్నాయి
సీతాకోకచిలుకల రెక్కలు కూడా ఎగురలేక అతుక్కున్నాయి
ఈ విపత్కర పరిస్థితుల్లో నాలుగ్గోడలే స్వర్గం అంటున్నారు!

ఒంటరిగా అరచి గోలచేసినా వినడానిక్కూడా ఎవ్వరూ లేరు   
కరోనా సోకిన రోగి శవంపై దుప్పటి కూడా ఎవ్వరు కప్పరు
అందుకే గుంపుగా ఉండొద్దు దూరాన్ని పాటిద్దాం అంటున్నది
అత్యవసరం అనుకుంటే తప్ప ఇంటిపట్టునే ఉండమంటున్నది
ఈ మహమ్మారికి ఇంతకు మించిన పరిష్కారము లేకున్నది!