Wednesday, September 20, 2017

!!గారడీ ఆశలు!!


ఇసుక రేణువులు నీటిలోన మెరిసి 
దూరపు కొండలు నున్నగా కనబడి
కనులకి ముసుగేసి గారడీ చేసాయి!

గమ్యాలు గతులు తప్పి గాభరాపెట్టి
అస్థిత్వాన్ని చింపి చెల్లాచెదురు చేసి
జీవితమంటే ఇదేనంటూ నిలదీసాయి!

బంజరు కలలబీటల్ని కన్నీరుతడిపి  
మనోవాంఛలు మూకుమ్మడై కలబడి
కస్తూరి సుగంధాన్ని కోరుతున్నాయి!

అనుబంధాలు అవసరానికి అల్లుకుని
బంగారులేడిలా మభ్యపెట్టి మసిపూసి
బింబానికి ప్రతిబింబాన్ని జతచేసాయి!  

ఆశచావని విరిగిన మనసు పురివిప్పి
ఒంటరి సామ్రాజ్యపు రాజు రాణి తానని
బూజుల విసనకర్ర విసురుతున్నాయి! 

Monday, September 11, 2017

!!భయానికే భయం!!

భయానికి నా నవ్వంటే ఎంతో భయం
పెదవులపై ఉన్న నవ్వూ దర్పం చూసి 
నా మనసులో దాగి ఉన్న ఆవేదనను  
కష్టనష్టాల్లో కూడా పలుకరించి పోదు!

వ్యధలు ఎన్ని ఉన్నా ఎదలోనే దాచేసి 
పైకి గంభీరంగా నవ్వే నేనంటే కన్నీటికి
తెలియని అసూయా అసురక్షిత భావం 
అందుకే ఏడుపు రమ్మన్నా దరిరాదు!

Monday, August 28, 2017

!!గడిచిన కాలం!!

క్షణాలన్నీ బాటసారులై సాగిపోయాయి.. 
జ్ఞాపకాలు మాత్రం రహదారిలా మిగిలాయి
సమయం ఉన్నప్పుడు ఆస్వాధించలేదు
జీవితాన్ని నమ్మి సాధించింది ఏంలేదు 
గూడల్లుకునే ధ్యాసలో పూర్తిగా మునిగితినేమో
ఎగరడానికి రెక్కలున్న విషయమే మరిచిపోయా
సంతోషాన్ని జీవితంతో ఖరీదుకట్టి కొనొచ్చనుకున్నా 
ఆనందం అదృష్టవంతులకే దక్కుతుంది కానీ 
అమ్ముడయ్యేది కాదనీ ఆలస్యంగా తెలుసుకున్నా!

Wednesday, August 16, 2017

!!కాలమహిమ!!

సింహము గాయపడిందని గర్జించడం మాని గాభరాపడితే 
ఎలుక కూడా దానిపై ఎగిరెగిపడి గెంతుతూ ఆటపట్టించేను..
కుక్కలేమో దాని పనైయ్యిందని మొరిగేను!
ఎవరికి తెలిసినా తెలియక పోయినా
ఇదంతా కాలమహిమని సింహానికి తెలుసును
కలసిరాని కాలంతో చేతులుకలిపి సన్నిహితులే శత్రువులైనా
ఉచ్చులెన్నో వేసి చిక్కుల్లోపడేసి గాయపరచినా
సింహము చిన్నబోయేనా...
ఆకలి వేసిందని గడ్డి తినునా!?
అప్రమత్తంతో ఆలోచించి పరిస్థితుల్ని పల్టీ కొట్టించి..
మరల సింహగర్జనతో చిందులేయకపోవునా!!

Wednesday, August 9, 2017

!!చివరికి!!

ఎవరి జీవితపు ఉయ్యాలని వారే ఎక్కి ఊగాలి
ఎవరో వచ్చి ఎక్కించి ఊపుతారు అనుకోవడం
అవివేకమే కాదు అనాలోచితం అనుకుంటాను!

శూన్యంగా ఉన్న ఆకాశాన్ని చూసి ఆలోచించు
వీలైతే అంత ఎత్తుకి ఎగిరే ప్రయత్నం కావించు 
ఎత్తుని చూసి భయపడ్డం మూర్ఖత్వం అంటాను!  

సుఖదుఃఖాలు ఆటుపోట్లలా వచ్చి పోతుంటాయి 
క్షణకాలం మేఘంలా వచ్చి ఉరిమి భయపెట్టినా
తుదకు తడిసి తడిమే జ్ఞాపకాలుగా మిగులును!