Wednesday, June 21, 2017

!! డౌట్ !!

నాదొక డౌట్...శంకర్ బ్రాండ్ పొగాకు
గణేష్ బ్రాండ్ బీడీలు, లక్ష్మీ బ్రాండ్ టపాసులు
కృష్ణ బార్ & రెస్టారెంట్, జైమాతా మటన్ షాప్ చూసా
కానీ ఇంత వరకూ ఎప్పుడూ ఎక్కడా నేను
అల్లా బ్రాండ్ గుట్కా, ఖుదా బ్రాండ్ బీడీ,
జీజస్ బ్రాండ్ చుట్టలు, క్రీస్తు చికెన్ షాప్ అంటూ
అమ్మే దుకాణాలు ఎక్కడా చూడలేదు!!
ముస్లింలకీ క్రైస్తవులకీ ఈ అలవాట్లు లేవా?
లేక వారు ఈ దురలవాట్లకు బానిసలు కారా?
అంటే...అన్ని మతాల్లోనూ బానిసలు ఉన్నారు
వారిలో ఉన్న ధర్మ సన్మానం, భగవంతుని పై భక్తి
హిందువుల్లో కొరవడిందనే అనిపిస్తుంది...కాదంటారా!??

(ఇది కేవలం నా ధర్మ సందేహమే తప్ప ఎవరినీ ఉధ్ధేశించి కాదని మనవి చేసుకుంటున్నాను-పద్మారాణి)

Friday, June 16, 2017

!!బ్రతుకు కష్టం!!

విహంగాన్నై స్వేచ్ఛగా విహరించాలని
గ్రహాల మధ్య విలాసంగా పయనించాలని
కోట్ల క్రోసుల దూరదృశ్యాలను వీక్షించాలని
హిమాలయాల్లో ఐహిక వాంఛలు వీడాలని
భూగర్భంలో చొరబడి చిందులేయాలని
స్వల్ప రేణువుగా మారి ఎగిరిపోవాలని
సాగరంలో చేపలా కదలాడాలని
మండుటాగ్నిలో కాలక సేదతీరాలని
కోరుకోవడం ఒక ఎత్తు అయితే....
మనిషై పుట్టినందుకు మనిషిగా బ్రతకడం
మరో ఎత్తు...అవునంటారా కాదంటారా!? 

Friday, June 9, 2017

!!లోకం తీరు!!

నాలా ఉండలేక నా వెనుక
గుసగుసలాడేరు కుచితస్వభావులు..
నాకు దక్కినవి వారికి దక్కవని 
ఈర్ష్యచెందేరు అసూయపరులు..
నాతో పోల్చుకుని ప్రయత్నించకనే
లోలోన కుళ్ళేరు అసమర్ధులు..
దేన్నైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు
లోకం అర్థమైన జ్ఞానులు!

Wednesday, June 7, 2017

!!మనసా వస్తావా!!

మనసా దూరతీరాలకు వెళదాం వస్తావా 
వేదనలతో హృదయం నిండె ఊరడిస్తావా
వ్యధగాయాలు ఆశల్లేని లోకం చూపవా 
కులాసాల కొత్త కుటీరం ఏదైనా వెతకవా

ఉద్యానవనమేల అందులో మనసు కాల
నాకు అవసరం లేదు విశాలమైన లోగిలి
నావనుకున్న నాలుగు గోడలుంటే చాలు
గాలి వచ్చిపోయేలా గుండె తలుపు మేలు

బాధలే జ్ఞాపకం రానట్టి లేపనం పూయవా
ఓదార్పు ముసుగులో కన్నీరు దాచేయవా
నవ్వుతో నటించే నేర్పు నాకు నేర్పించవా 
ఓ నా మనసా ఎగిరిపోదాం నాతో వస్తావా! 

Saturday, May 20, 2017

!!మధుర జ్ఞాపకాలు!!

చిన్నప్పుడు చిట్టి అడుగులు వేస్తూ
చిరునవ్వుతో నన్ను ప్రశ్నిస్తూ
మురిపించి మరిపించిన నా చిన్నారి
చీర కొంగట్టుకు తిరిగి చిత్రంగా చీరకట్టి
నా ఒడిలో ఎదిగి వేరొకరి మదిలో ఒదిగి
విచిత్రంగా అన్నీ జరిగె
ఆలోచిస్తే అనిపిస్తుంది...
కాలం త్వరగా పరుగులెట్టెనని!
ఆ చిన్నినాటి చేష్టలు
అప్పటి ఆ మాటలు
ఎప్పటికీ నాకు మధుర జ్ఞాపకాలేనని!!

Tuesday, May 16, 2017

!!ప్రాకులాట!!

చెప్పేవారు కొందరు మౌనంగా మరికొందరు
నీడగా కొందరు నిట్టూర్పులతో ఇంకొందరు
ఎవరుండి చేసేది ఏముంది ఒరిగేదేముంది!

కొందరు తామేడుస్తూ ఇతరులని నవ్విస్తారు 
మరికొందరు నవ్వులు రువ్వుతూ ఏడుస్తారు
ఇలా నవ్వినా ఏడ్చినా కాలం ఆగనంటుంది!

కలలో వచ్చి జోలపాట పాడేవారు మనవారు
గాఢనిద్రలోంచి మేల్కొల్పుతారు పరాయివారు 
దరిచేర్చుకుని పొమ్మన్నా తేడా తెలియకుంది!

కొందరు మనసులో దూరి మనకి దగ్గరౌతారు
మరికొందరు వాస్తవాలకి వికృతిచేష్టలు అద్దేరు
అర్థమై అర్థంకాని వారు ఉండి లాభమేముంది!

ఇలా కొందరు అలా కొందరు ఎందుకో తెలీదు
ఆలోచించి ఆవేశపడి కూడా చేసేది ఏమీలేదు 
అందుకే పట్టింపు ప్రాకులాటలతో దిగులొద్దనేది!

Friday, May 5, 2017

!!తెలిసేది ఎలా!!

ఎలా తెలుసుకోను మదిలోని కోరికను
అవిటి ఆశ అవశేషాలే ఊతకర్రగా మారి 
కనబడే ముళ్ళమార్గాన్నే దాటేయమంటే
శాంతి సౌఖ్యమే ముందుంది పదమంటే!

ఒంటరైన ప్రయాస మొండికేసి కదలనని
దూరంగా మసగబారిన గమ్యాన్ని కసిరి  
కంపించే మరణాన్నే కౌగిలించుకోమనంటే
బండబారిన మనసుని ఎలా మభ్యపెట్టను!

గుండెకు చేరువగా మందిరం కనబడినా
ముక్తి ఉండలేనని వెళ్ళె బంధనాల దారి
తపనపడే తనువు వ్యధని తగ్గించలేనంటే
చింతలకి చికిత్స లేదని ఎలా తెలుపను!

కోమల కలుషిత హృదయాన్ని ఏమనను 
స్వార్థం ఎక్కుపెట్టి చూసె వయసునే గురి
చివరికి బాధలే బరిలోకి దిగి యుద్ధమంటే
గెలుపెవరిదనను జీవితమే అంతమౌతుంటే! 

Wednesday, April 19, 2017

!!తేనె పలుకులతో!!

తేనె ఎన్నేళ్ళ తరువాత సేవించినా
తీయదనం చెక్కుచెదరదు..
తేనెలూరే పలుకులతో ఎన్నేళ్ళైనా 
ఎదుటివారి ఎదలో కొలువుతీరొచ్చు! 

ఆనందపరిచే అవకాశం వస్తే వదలకు
పిసినారితనం చూపి ముఖం చాటేయకు
ఎదుటువారిని నవ్వించే నేర్పు.. 
అదృష్టం, అవకాశం అందరికీ దొరకవు!

Wednesday, March 29, 2017

!!హేవిళంబి స్వాగతం!!

ఏ ఏడాతికాయాడాదే ఆహా హో అనుకుంటూ 
అంతా మంచి జరుగునని గెంతులేసుకుంటూ
గడచిన కాలం తిరిగిరాదని వచ్చేది గొప్పదని 
జీవితమంటే షడ్రుచుల సమ్మేళనమని సర్దుకుని
సంకలెగరేసి సంబరపడినా కాదని చతికిలబడినా
పంచాంగ పారాయణం చేసి పళ్ళు ఇకిలించినా
జరిగేది జరుగకా మానదు బ్రతుకు మారిపోదు
కోయిల కూసిందని కాకి అరవడం మానేయదు!
బ్రతకడానికి తినే తిండిలో రుచులు తగ్గినా తిని
కారాన్ని మమకారం నుంచి తీసి తీపిని పెంచు
చేదు చేబదులిచ్చి ఉప్పును నిప్పుగా మార్చకు
మాటలకు పులుపు చేర్చి వగరుతో పొగరుబోకు
ప్రతి మనిషీ....నిర్మల నిశ్చల సమున్నతమై
సాటి వారిపై సానుభూతి ఉంచి మసలితే చాలు
ప్రకృతి ప్రతిరోజూ పులకరించి వసంతాన్ని పంచు
అది చూసి ఇంటింటా పండుగ వద్దన్నా నర్తించు!
హేవిళంబి తెలుగు సంవత్సరమా నీకు స్వాగతం..

Friday, March 24, 2017

!!వేర్పాటు పవనాలు!!

ద్వేషం చేసిన దుష్ఫలమో లేక మనిషి గుణమో 
జంతువులు రెండుగా విభజించబడ్దాయి..
ఆవులు హిందువు మేకలు ముస్లిం అయ్యాయి
మధుషాలలో మాత్రం మనిషి అవతారం అగుపడ
చెట్లూ పుట్టలు ఆకులూ అలములు కలతచెందాయి!
పక్షులు పావురాలు కూడా హిందు ముస్లింలైతే..
ఎలాగని ప్రశ్నిస్తూ ఎండిన గింజలు ఏడ్చాయి
కొబ్బరికాయ హిందూ ఖర్జూరం ముస్లిమైనట్లే తెలీదని
ఆకలిప్రేగు అసలు విభజన ఏమిటి? ఎందుకన్నాయి!
వేర్పాటు వాదులకు విడిపోవడం అచ్చొచ్చెనేమో..
కానీ..నా వాదనలు మాత్రం అత్యోత్సాహ పడనన్నాయి!

Wednesday, March 22, 2017

!!ప్రయత్నం!!

నీటి పైపైన ఈదితే..
లోనున్న ముత్యాలు దక్కవు!
అభ్యాసన చేయకపోతే..
అనుభవం రమ్మంటే రాదు! 
ముఖానికి రంగులద్ది..
మనసులో మర్మం మార్చలేవు!
పూలను తూచి..
రాళ్ళ బరువెంతో చెప్పలేవు
చేయలేనని నిరుత్సాహపడితే..
అనుకున్నది ఏదీ సాధించలేవు!!

Tuesday, March 14, 2017

!!వాటి నైజం!!

నాటనివాడు చెట్టు నరికినా
వాలిపోయే వరకు నీడనిస్తుంది
అది ఎదిగిన చెట్టు నైజం...

నీరుని వృధాగా పారబోసినా
మురికి ఉంటే కడిగేస్తుంది
అది మంచినీళ్ళ తత్వం...

తొక్కి మొక్కునని గుడిమెట్లెరిగినా
దేవుని సన్నిధికి తీసుకెళుతుంది
గుడిమెట్లకున్న ఉదాత్త గుణం... 

Wednesday, March 8, 2017

!!ఓ మహిళా!!

బలమైన స్త్రీ ఎంత లోతుగా ఆలోచిస్తుందో
అంతకు రెట్టింపు ప్రేమను పంచుతుంది!!

ఎంత సున్నిత మృదువైన మనసు కలదో 
అంతకు మించిన శక్తిసామర్ధ్యాలు కలది!!

ఎంత మనస్ఫూర్తిగా నవ్వులు చిందిస్తుందో 
అంతే వ్యధను మదిలో దాచుకుంటుంది!!

ఎంత ఆచరణాత్మకంగా పనులు చేయగలదో 
అంతగానే అధ్యాత్మికపై ధ్యాస పెడుతుంది!!

బలమైన మహిళ తనకు తానే సారాంశము
ప్రపంచము పొందిన వరానికి నిర్వచనము!!

Friday, March 3, 2017

!!ఎంత బాగుండు!!

ఋతువు మారెనని గాలితెమ్మెర గాబరాపడె
పూల పుప్పడినేమో తుమ్మెద జుర్రున దోచె
జీవిత స్థితిగతులు మార గుండె గుబులాయె
ఈ వంకన నేను మారితే మరింత బాగుండునే!

వీధీ వాకిలి పాతదైనా కొత్తవెలుగు దానిపైపడె
చిలిపితనమేమో కుప్పిగెంతులు వేస్తూ ఎగిరె  
మదిరూపమే మారి అదృష్టం తలక్రిందులాయె
ఇలా సాకులతో నా స్థితి మారితే బాగుండునే!

ఆశయాలు ఆకారాన్ని మార్చేసి కుంటుపడె 
నవ్వడం మరచిన ముఖం కన్నీటితో తడిచె 
వలస పక్షులు వచ్చినట్లే వచ్చి పైకెగిరిపోయె
ఇదే అదునుగా నేను ఎగిరిపోతే బాగుండునే!

Thursday, February 23, 2017

!!ఎదుగుదల!!

నివాసం ఉండేది చిన్న ఇంట్లోనే అయినా
మనసులు అందరివీ పెద్దవిగా ఉండేవి..
నేలపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నా
ప్రక్కనున్నారు మనవాళ్ళన్న భావముండేది
ఇప్పుడు సోఫాలు డబుల్ బెడ్ మంచాలు 
మనుసుల్లో మాత్రం పెరిగాయి దూరాలు..
ఆరుబయట వేసుకునే మడతమంచాల్లేవు
చెప్పుకోవడానికి ఊసులు అంతకన్నా లేవు!

ప్రాంగణంలో వృక్షాలు వస్తూపోతుంటే పలకరించేవి
అపార్ట్మెంట్లుగా అవతరించి హడల్గొడుతున్నాయి..
తలుపులు తీసుండి బంధుమిత్రులను ఆహ్వానించేవి
సైకిల్ ఒక్కటున్నా అందరితో పరిచయాలు సాగేవి
డబ్బులు కొన్ని ఉన్నా పెదవులపై నవ్వు ఉండేది
నేడు అన్నింటినీ సాధించాము కామోసు..
అందుకే అవసరమైనవి అందకుండాపోయాయి 
జీవిత పరుగులో ఆనంద వర్ణాలు వెలసిపోయాయి!

ఒకప్పుడు ఉదయాన్నే నవ్వుతూ లేచేవాళ్ళం 
మరిప్పుడు నవ్వకుండా ముగిసే సంధ్యవేళలెన్నో
ఎంతో ఉన్నతి సాధించాం సంబంధాలతో నటిస్తూ..
మనల్ని మనం కోల్పోయాం మనవాళ్ళని వెతుకుతూ!

Sunday, February 12, 2017

!!ప్రోద్భలం!!

ఆత్మఘోష రెపరెపలాడుతూ పైకెగురుతుంటే 
శాంతి సంకెళ్ళ కోసం వెతికే మనసు అలిసిపోతే
ఊరడించడానికైనా ఒక్కసారి ఆ ఘోష వినరాదా
ఓదార్పు కోసమైనా అశాంతిలో శాంతి చూపరాదా
సలహా సంప్రదింపులతో ఓటమికి గెలుపు నొసగి 
ఆత్మస్థైర్యానికి సరిహద్దులేదని చాటి చెప్పరాదా!

అవకాశాలతో అల్లుకున్న గొంగళిపురుగులుంటే
కాలానికి అణుకువను ఆయుధంగా అందించి 
రంగురంగుల సీతాకోకచిలుకలుగా మార్చేయరాదా
ఒద్దికలేని మిడిసిపాడు జయంకి ప్రతిబంధకం కదా
నిరంతర కృషికి ఓర్పుని శక్తి ఔషధంగా నూరిపోసి
బ్రతుకు బంధీ కాకుండా ప్రోద్భలాన్ని చేకూర్చరాదా!

Wednesday, February 8, 2017

!!ప్రాయం!!

పెరుగుతున్న ప్రాయం నాతో అంది 
ఇకనైనా వీడు ఈ అమాయకత్వానని
గంభీరత్వంతో వ్యవహరించమని..
తరుగుతున్న తుంటరితనం అంది
ఇంకొన్నాళ్ళు తనతో జల్సా చేయమని
ఆపై మృత్యువే వద్దన్నా వదలదని..    
గడ్డిపువ్వైనా గులాబీ అయినా 
విప్పారి వికసించినాక వడలక తప్పదని!

Saturday, February 4, 2017

THIS SOCIETY

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది .
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
ఎందుకలా జరిగింది ?
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.
THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY!!

Tuesday, January 31, 2017

!!ఫోటోపిచ్చి!!

ఫోటోలంటే పిచ్చ ప్రేమ నాకు 
  
ఎందుకంటే...మనిషి మారినా

ఎప్పటికీ అవి మారక మురిపిస్తాయి

నీలోని లోపాలను నీకు చూపిస్తాయి

ఒంటరై ఏడిస్తే ఓదార్పై నవ్విస్తాయి

ఎన్నటీకీ వయసు పైబడనంటాయి

విడిపోయిన బంధాలని బలపరచి 

మరచిన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి! 

Monday, January 30, 2017

!!పరిశోధన!!

నోటిమాట వినే వారే అందరూ
మనసు పడే వేదన వినరెవ్వరూ
శబ్దాలతో మారుమ్రోగు సంతలో..
నిశ్శబ్దాన్ని గుర్తించేవారు ఉండరు
అక్కరకురాని ఎన్నో ఆలోచనలు
ప్రేమ సంపాదన బంధాలు అంటూ
అనవసర చర్చలు సమావేశాలు..
ఆర్జించింది ఎంతో కోల్పోయిందేమిటో
       తెలుసుకునే ప్రక్రియలో ఫలితం శూన్యం       
శతాబ్దాలుగా దొర్లుతున్న పరిశోధనలో   
సాగుతూనే ఉంది శాంతి కొరకు శోధన!!

Wednesday, January 18, 2017

!!హైటెక్ లైఫ్స్!!

సుఖఃసాధనాల నడుమ యాంత్రికజీవులు
అనుభూతుల్ని దాచే దర్పాలు ఢాంబికాలు
మసకల ముసుగులో అనిశ్చల గమ్యాలు
అలరించే రంగుల్లో రాగంలేని అనురాగాలు
మమతలకు మరకలు అంటి అరమరికలు
ఆదరణ ఆప్యాయతలు జ్ఞాపకపు చిహ్నాలు
ఆనందాల్ని సుడిగుండంలోకి నెట్టిన వ్యధలు
నిరాశ నిట్టూర్పుల్తో బంధించబడ్డ బ్రతుకులు
సంతోషాలని సంతలో వెతుక్కునే ప్రాణులు
నేటి కృత్రిమ హైటెక్ ఆశ్చర్యకర జీవితాలు!!

Wednesday, January 11, 2017

!!పయనం!!

నా పాదాలకున్న పగుళ్ళు
నన్ను పదే పదే వారిస్తున్నా
ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నా
నా తనువును సేదతీర్చాలని
గాలితెమ్మెర పవనాలు వీస్తున్నా
కృషిచేయాలని కంకణం కట్టుకున్నా
నా మనసుకి హాయిని ఇవ్వాలని
కమ్మనైన రాగం వింటున్నా...
ఉత్సాహంగా గమ్యంవైపు సాగిపోతున్నా!

Wednesday, January 4, 2017

!!మృత్యువు!!

నేను నమ్మిన వారే నన్ను మోసగిస్తే

గాయమైన గుండెకే గాయమౌతుంటే

నిజాయితీ లేని వారు సైతం నీతి చెప్ప

కొరగాని వారు కూడా కోపంతో చూడగా

కుళ్ళు కుతంత్రాలు కబళించి కన్నుగీట 

ఇష్టంలేని క్రియలే కౌగిలించి కాటువేయ

భయపడతాయి అనుకున్నవి బంధించ 

మృత్యువుని మాత్రం మోహించి రమ్మని

బాహటంగా పిలువ భయమేలనో దానికి!

Sunday, January 1, 2017