Monday, December 21, 2015

!!పిడికెడు ప్రపంచం!!

పుస్తకాలు చదివి పుణికిపుచ్చుకున్న జ్ఞానం

దోచుకుని పోయింది కంప్యూటర్ పరిజ్ఞానం

సమయాన్ని  సహనాన్ని తీసుకుని...

మతిమరుపునిచ్చె మనకది బహుమానం!

ఆప్యాయ ఆలింగనలకు సెల్ ఫోన్లే అనుసంధానం

కలిసి ముచ్చటించుకోవడం ఇప్పుడొక పెద్దసంబరం

మొబైల్ ముచ్చట్లతో ముడిపడింది ప్రతీ బంధం..

అరచేతిలో బంతిలా మారిపోయె ప్రపంచం!

Friday, December 18, 2015

!!మార్పు!!

సామాజిక స్ఫూర్తని ఆలోచించి ఎవరికేం చెప్పేది
అక్షరాలనే అస్త్రాలుగా సంధించి ఏం నేర్పించేది!?

అన్నీ అలాగే ఉన్నాయి...మనం ఏం మారలేదు
మరి లోకాన్ని మార్చాలని ఎవరికి కంకణం కట్టేది!?

ఇంటి నిండా చెత్త...మనసంతా కుట్రా నింపుకుని
జనోధ్ధారణ అంటూ ధీనంగా ఎవరిపైన అరిచేది..
ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు ఎవరికి ఉపదేశించేది!?

ముందస్తుగా ఎవరికి వారే మారి ఏకమై సాగితే...
జగతి మారి, జేజేలు కొడుతూ ఆహ్వానిస్తుంది!!

Monday, December 7, 2015

సంసార సారం

మూడుముళ్ళతో ముడిపడిన 
మా బంధానికి...ముప్పైయ్యేళ్ళు!
సమస్యల్లో సరదాలను వెతికి,
భాధ్యతల్ని బలమైన బంధంగా మలచి
కష్టాలనే ఇష్టాలుగా మార్చి సాగించిన 
ఈ సాహాసోపేత సంసార సారంలో...
తలచుకుంటే అన్నీ మధురస్మృతులే, 
కాదనుకున్నా కాలమేం తిరిగిరాదులే
అందుకే ఏది ఏమైనా ఖుషీఖుషీగా 
హ్యాపీ హ్యాపీస్ అంటూ నవ్వేసెయ్!

Wednesday, December 2, 2015

!!కాలచిత్రం!!

దొర్లుకుంటూ పోతూనే ఉంది కాలం
దారిపొడవునా నేను వెతుకుతున్నా
గడిచిన కాలపు గుర్తులున్నాయని..
కనీసం జ్ఞాపకాల పాదముద్రల్లో
కొన్నైనా మిగిలుండక పోవునాయని..
ఏది ఎక్కడా కనపడనిదే!
అయినా వెళుతూ వెతుకుతూనే ఉన్నా..
ఒడిదుడుకుల రహదారుల్లో కనబడేనని
అరచేతిని ఆటుపోట్లకు అడ్డుగా పెట్టి
ఇసుకలో అద్దాల సౌధానికి పునాది తీసి
అందంగా అల్లిన జీవితపు చిత్రాన్ని గీసి
గోడకి ఆ చిత్రాన్ని తగిలించి..
అందులో మధురమైన జ్ఞాపకాల్ని చూస్తూ!

Monday, November 16, 2015

!!దారి మళ్ళింపు!!

జీవితంతో అష్టాచెమ్మా ఆడుతూ సాగిపోవాలని..
కష్టాలని కాల్చి బూడిదచేసి గాలిలో కలిపివేస్తున్నా 

ఓడిపోయానని శోకించి లోకానికి చెప్పి వ్యర్థమని
ఓటములంటినీ విందుకు రమ్మని వేడుక చేస్తున్నా

విధి వంచించెనని వెక్కిరించడం మతిలేని చేష్టలని
మదిని మందలించి, మరో కొత్తదారి వెతుక్కోమన్నా

దక్కినదాన్నే అదృష్టంగా భావించి స్వీకరించాలని
దక్కనివి కోరనేలేదని మరిచే ప్రయత్నంలో ఉన్నా

దుఃఖానికీ ఆనందానుభూతికీ వ్యత్యాసమే లేదని
హృదయానికి అదే గమ్యమని దారి చూపుతున్నా!

Sunday, November 8, 2015

Friday, October 30, 2015

Tuesday, October 13, 2015

!!తలపు!!

కొన్నిమాటలు తలపుకు వచ్చినప్పుడు
కన్నీటిచుక్కలు చెంపల్ని తడుముతూ
ఎవరో గుండెచలమల పై అడుగేసినట్లు
నిశ్శబ్ధంగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది!

అద్దంలో నన్నునేను చూసుకున్నప్పుడు
రెండు పరావర్తన ప్రతిబింబాలు నవ్వుతూ
గడిచిన కాలమే గెంతులేస్తూ వచ్చినట్లు
మనసువిప్పి మాట్లాడినట్లు మరపిస్తుంది!


ఆలోచనల్లో అక్షరాలను వెతుకున్నప్పుడు
గుర్తులే గోళ్ళ చివర మొలచి మొరపెడుతూ
మూసిన కవనంలో తెరచిన జ్ఞాపకాలున్నట్లు
పట్టుకోబోతే దక్కిన ఆనందమే పారిపోతుంది!

Tuesday, October 6, 2015

Saturday, October 3, 2015

!!చెట్టేడ్చింది!!

చేతిలో గొడ్డలిని చూడగానే గుండె గొల్లుమంది 
నన్ను చూసి నా ప్రక్కనున్న చెట్టూ ఏడ్చింది 
చెట్లు లేక నరులకు నీడ, పక్షికి గూడూ ఏదని 
కరెంటు తీగపై కాకి అరిస్తే ప్రతీరెమ్మా ఏడ్చింది 
నేలకై నన్ను నరికితే మూర్ఖత్వం మూర్చిల్లింది! 
గాలిలేక అల్లాడే ప్రాణులని తలచి నింగీఏడ్చింది 
చెట్లులేని నేల సాంద్రత తగ్గిన విషపు మన్నంది 
ఆ మాట విని, ఎత్తెదిగిన వనమే కుప్ప కూలింది 
గలగలా పర్వతం నుండి పారి వచ్చిన జలపాతం 
నేను లేని చోట ఉండనని పారిపోతే ఏడ్పాగనంది! 
మనిషి మనుగడకై ప్రకృతి ప్రసాదించిన వృక్షాలని 
నరికి ప్లాట్లు ఫాట్లని పాడెలే కట్టబోతే ఊపిరాగింది!

Thursday, October 1, 2015

స్వయంకృషి

కంటి కొసల్లో కోపం నిప్పుకణికై రాజుకుని

అందులో స్వప్నాలే కాలి బూడిదైపోయి

అగ్ని గుండెల్లో మండి మదినే దహిస్తూ

స్వరపేటికే పూడుకునిపోయి అరుస్తుంటే

అర్థమైంది...సర్దుబాటే సరైన పరిష్కారమని

అనుకున్నవి అన్నీ జరిగితే చిద్విలాసమని

కొన్నైనా నెరవేరితే అది మన స్వయంకృషని!!

Tuesday, September 15, 2015

!!అమ్మకానికి అన్నీ!!

నీరు అమ్ముడైపోతుంది, ఋతువులూ అమ్ముడై పోవునేమో
నేల అమ్ముడైపోయింది, అంబరం కూడా అంగడికి చేరునేమో
చంద్రమండలంలో అడుగేసి గజానికో రేటుకట్టి అమ్ముతున్నారు
సూర్యరశ్మిని కూడా సంచులు కట్టి సంతలో విక్రయించేస్తారేమో!

అమ్ముడు కానిది అంటూ ఏదీ లేదు అమ్మతనంతో పాటుగా
స్వార్థం ఎలాగో అమ్ముడైపోయింది, ధర్మం ఆ దారే పట్టిందేమో
అనుబంధాలూ ఆప్యాయతలూ తలొక రేటుకీ అమ్ముడైనాయి
కొన్నాళ్ళకి మనిషి తననితానే ముక్కలుగా అమ్ముకుంటాడేమో!

ప్రతీ పనీ పైసల కోసం, నేతలేమో పదవుల కోసం అమ్ముడైనారు
భయం వేస్తుంది, క్రమేణా దేశమే అమ్ముడు అయిపోతుందేమో
నేడు చనిపోయిన శవం కూడా రెప్పలు మూయకనే చూస్తుంది
త్వరలో శవమే, స్మశానంలో తనని పాతిన స్థలం అమ్మునేమో!

Tuesday, September 1, 2015

!!ఓ నా పాఠశాలా!!

ఉదయాన్నే లేవనంటూ మారాం చేయడం
హడావిడిగా తయారై బడికి పరుగుతీయడం
ఒకజడ రిబ్బను, షూబెల్ట్ ఊడి తిరిగిరావడం
ఇంటికి వచ్చీరాగానే ఆటలని పరుగులెట్టడం
ఆడుతూపాడుతూ పాఠాలు చదువుకోవడం
ఓ నా పాఠశాలా నన్ను మరోసారి చేర్చుకోవా!

ఆలస్యంగా వెళ్ళి ఆటస్థలం చుట్టూ ప్రదక్షణాలు
ప్రార్ధనా సమయంలో మాట్లాడి తీసిన గుంజీళ్ళు
కడుపునొప్పి అంటూ బడి ఎగ్గొట్టిన ఎన్నోరోజులు
పోటీ చదువులే కానీ పౌరుషాలకిపోని పరీక్షలు
అమాయకత్వంతో అంటుకున్న అనుబంధాలు
ఓ నా పాఠశాలా మరోమారు నన్ను రమ్మనవా!


నారింజ పిప్పర్మెంట్ బిళ్ళ తింటే ఎర్రబడిన నోరు
పుల్ల ఐస్ వల్ల జలుబుతో జ్వరం వస్తే నా పోరు
సర్కస్కి వెళ్ళి అందరంకలిసి చేసిన అల్లరిహోరు
తెలిసీ తెలియని వయస్సు అందరిలో ఏదో జోరు
అవి తలుచుకుంటే నేటి చదువులు యమబోరు
ఓ నా పాఠశాలా ఒక్కసారి నన్ను ఒడితీసుకోవా!

Monday, August 24, 2015

!!జ్ఞాపకగాయాలు!!

కళ్ళలో విరిగిన గాజుముక్కలే విలయతాండవం చేస్తున్నట్లు
జ్ఞాపకాలు కొన్ని గాయాలై మరల సలపరం పెడుతున్నాయి!

నిశిరాత్రి కూడా నిశ్శబ్దంగా నిద్రపోతుంటే పాతగాయాలు రేగి
మాసిక వేసిన గుండెనే మరోమారు ముక్కలు చేస్తున్నాయి!

పగటి నుండి సంధ్య వరకూ వ్యాపకాల ఒడిలో కునుకు తీసి
రాతిరవ్వగానే కన్నీట తడిసిన తలగడని ఆరనీయకున్నాయి!

మరకలను మాపుకోలేని మెత్తటి మనసు చుట్టు చీముపట్టి
నిదురలేక ఎర్రబడ్డకనుల ఉసురు పోసుకుని ఉసూరన్నాయి!

గుచ్చుకున్నవి జ్ఞాపకాల గాజుముక్కలే అని తీసివేయబోతే
మరపురాక కన్నీరు ఆగిపోయి గాట్లు రక్తమై స్రవిస్తున్నాయి!

Friday, August 21, 2015

Friday, August 7, 2015

!!ఏం తెలుసు!!

లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మనసు లేని బండరాయికి ఏం తెలుసు
మనోఃభావ అలజడుల సంకీర్తన గురించి!

దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి!

ఆకాశంలో విహరించే విహంగానికేం తెలుసు
భారమైన మేఘాలు కార్చే వర్షధార గురించి
ఫలధీకరణ దాల్చిన పుప్పొడికి ఏం తెలుసు
విచ్చుకోకనే రాలిపోయిన పువ్వుల గురించి!

Saturday, July 25, 2015

మనోభావన


ఈ ప్రేమ అందనంత ఎత్తులోనే ఎప్పుడూ 
ఊగుతూండే వలపు నావ అప్పుడప్పుడూ 

మనసుతో ఆడుకుని మురిసేరు కొందరు 
ప్రేమలో పందెం వేసి గెలిచేరు ఇంకొందరు 

అడుగడుగునా విజయం వరించిన నవ్వు 
దశలుదశలుగా ఓడిపోతే వగచేవు నువ్వు 

తలచినది జరుగక మొదలయ్యేను పతనం 
దక్కని వాటిపైనే ఎందుకనో మోజు అధికం 

వలపు ఎరవేసిన గాలానికి చిక్కినదే వేదన 
మరణం రాక జీవించనూ లేక ఈ సంఘర్షణ

Wednesday, July 15, 2015

!!కలలు!!

కన్నుమూస్తే కళ్ళని దానమివ్వమన్నాను
కానీ బ్రతికుండగానే జీవితం అడుగుతుంది
నా కనులను కాదు నేను కన్న కలలను!!!

కలలను ఎన్నడూ కిరాయికి ఇవ్వొద్దంటాను
మనం కట్టుకున్న సౌధాన్ని కిరాయిదారుడు
అపురూపంగా చూసుకోలేడని తెలిసును!!!

సాగుతున్న సంతలో కలలనే వేలం వేసాను
కావలసినవి కమ్మని కలలై కౌగిలించుకుంటే
నిద్రలో మేల్కొన్న అదృష్టాన్ని చూసి నవ్వాను!!!

Wednesday, July 8, 2015

!!ఎంత బాగుండు!!

కష్టాలని ఇష్టాలుగా మార్చే ఋతువుంటే బాగుండు!

సుఖదుఃఖాలని సమంగా భరించే మనసు ఒక త్రాసై

అనుభవాలు గుణపాఠాలు అయితే ఇంకా బాగుండు!

కొత్తవేదనలు పుట్టుకొచ్చి పాతవ్యధలను మాపే మందై

ఏం గుర్తుకురాని మతిమరుపు రోగం వస్తే బాగుండు!

నిందలు ఎన్ని వేసినా నిష్టూరాలాడని నిబ్బర నిధినై

వెలుగు నీడల్లో ఒకేలా వెలిగిపోతే ఇంకెంతో బాగుండు!

Friday, June 26, 2015

!!అలసిన బ్రతుకు!!


ఉద్యోగమే చేసి ఉసూరుమని ఇంటికి చేరి అనుకుంటాను
పనిచేయడానికి బ్రతుకుతున్నానా లేక బ్రతకడానికా అని
పసితనంలో తెలియలేదు ఎదిగి ఏమౌవుతావు అనడిగితే
అడిగితే చెప్పాలనుంది మళ్ళీ పసిపిల్లని అవ్వాలనుందని!
నాణెం జీవితాన్ని చూపితే ఖాళీసంచి నా వాళ్ళని చూపింది
సంపాధిస్తే తెలిసే, తల్లిదండ్రుల సంపాదనతోటిదే సంబరాలని
నేను సంపాధిస్తున్నది కేవలం అవసరాలే తీరుస్తున్నాయని
నవ్వు రాకపోయినా నలుగురిలో నవ్వుతూ నటిస్తున్నానని
క్షేమమా అనడిగితే లేకపోయినా కుశలమే అంటున్నానని!! 

జీవితమా అలసిపోయాను! లెక్కలుంటే చూసి పంపించేయి
బాకీలు బంధాలు ఏమైనా మిగిలుంటే మాఫీ చేసి కొట్టేయి!!

Monday, June 15, 2015

!!నీ ఇష్టం!!

మనసు ఎరుగని రకరకాల మనస్తత్వలు
మెండుగున్నాయి...
మంట లేకుండానే మదిలో మంటలు రేపి
మండుతుంటాయి...
పలకరిస్తే చాలు భాధలే కాక పతనమైన
గాధలు వినిపిస్తాయి...
ఎవరికి ఎవరూకాని నీకు వారు పరాయి,
వారికి నీవు పరాయి...
అయినా పద్ధతులని చెప్పి పరామర్శలతో
ప్రళయం సృష్టిస్తాయి...
ఈ సమాజంలో ఎవరికివారే ప్రత్యేకం 
అనుకోవడం లేని బడాయి...
అందుకే అందరూ చెప్పే నీతులు విని,
మనసుకి నచ్చింది చేసేయి...
ఆ పై నచ్చలేదనుకుంటే జీవించడానికి
మరిన్ని సాకులు వెతికేయి!

Monday, June 8, 2015

!!బ్రతుకు!!

పని చేస్తే ఒక గుర్తింపు, అడుగేస్తే గుర్తు పడనీయి

బ్రతుకుదేముంది బజారులో కుక్కా బ్రతుకుతుంది

జీవిస్తే నీ చరిత్రని కలకాలం గుర్తుగా ఉండిపోనీయి

తల్లికి కూడెట్టక అమ్మోరికి దీపధూపనైవేధ్యాలు పెట్టి

భక్తిలో అమ్మనేం చూసేవు తల్లిలో దైవాన్ని చూసేయి

గది తీసుంటేనే లోనున్నది బొగ్గో బంగారమో తెలిసేది

మనిషి అన్నీ ఉన్న అంగడైతే మాటనే తాళం వేసేయి

కాలమే నిర్ణయిస్తుంది ఎవరికి ఎంత ప్రాప్తమో అన్నది

పనికొచ్చే నలుగురిని ఉంచి పనికిరాని వందా వదిలేయి

సంతోషమే సిరి ఆత్మవిశ్వాసమే ఎవరు దోచుకోలేని నిధి

ఆరోగ్యమే అంతులేని సంపద అని గుర్తు ఉంచుకోవోయి!!

Friday, June 5, 2015

కొన్నిసార్లు


కొన్నిసార్లు...ఆశల పై అంచనాలు అధికంగా వేసి  
మన మనోవేధనకి మనమే కారణం అవుతాము!

పలుమార్లు...ఆత్మస్థైర్యంతో భాధని నవ్వుతూ గెలిచి 
ఒంటరిపోరాటంతో అనుకున్నవి కొన్నైనా సాధిస్తాము! 

చాలాసార్లు...అసలు విషయం ఏమిటనేది వదిలివేసి 
మన దృష్టితో అంచనా వేసి హైరానా పడుతున్నాము! 

ఎన్నోమార్లు...రాయి విసిరినంత సులువుగా భాధపెట్టి 
గాయం లోతెంతో చూడకనే మన్నించమని కోరుతాము! 

అనేకసార్లు...సంపద పోతే సర్వం పోయిందని ఏడ్చి
ధైర్యం కోల్పోయి అసలు జీవితాన్నే కోల్పోతున్నాము!

Tuesday, May 26, 2015

జీవించు.


చదవడం నేర్చుకుంటే...
ప్రతిమనిషీ ఒక పుస్తకమే!
వ్రాయడం నేర్చుకుంటే...
నీ జీవితం కూడా ఒక గ్రంధమే!
జీవించడం నేర్చుకుంటే...
మనం లోకానికి ఒక ఆదర్శమే!
నీవు కృంగి పోతున్నావంటే...
భూతకాలంలో బ్రతుకుతున్నట్లు!
నీలో అతృత పెరుగుతుందంటే...
భవిష్యత్తు పై బోలెడు ఆశలున్నట్లు!
నీవు ప్రశాంతంగా జీవిస్తున్నావంటే...
ప్రస్తుతకాలంతో రాజీపడి హాయిగున్నట్లు!

Friday, May 22, 2015

ఎలా!?

మిణుకు మిణుకుమంటూ మెరిసే దీపాలెన్నో...
వాటిని దేదీప్యమానంగా ఎలా వెలిగించను నేను?
తడారిపోయిన అధరాలపై వెలగని వత్తులలో...
సంతోషపు చమురు నింపి ఎలా నవ్వించను నేను?
నిరాశ్రయులైన పిల్లలు, జబ్బుపడ్డ తల్లులెందరో...
నీడనిచ్చి, తల్లడిల్లే తల్లివ్యాధిని ఎలా తగ్గించను నేను?
ధర్మంకర్మా నీతీనియమం అనే మాటల నీతులెన్నో...
మనిషిలోని మానవత్వాన్ని ఎలా మేల్కొల్పను నేను?
స్వఛ్ఛందంగా సేవ చేసేవారు కొందరున్నారు లోకంలో...
కావలసినవారికి సరైన సహాయం ఎలా అందించను నేను?
హంగు ఆర్భాటాలతో సమగ్ర సిగ్గులేని జీవితాలెందరివో...
మరమనిషిని మనిషికే దేవునిగా ఎలా చూపించను నేను?

Wednesday, May 20, 2015

!!సూచన!!

 కాలమా! కష్టాల్లో కాస్త చూసి నడుచుకో 
కాలం కలిసొస్తే నిన్ను లెక్కచేయను పో 
జీవితమా! నీవొక చిద్విలాస చిరుస్వప్నం 
బిక్షగాడి కంటికి మహలుగా కలలో కనబడి 
మహల్లోని మారాజుకి కంటిపై కునుకై రావు 
అయినా మేల్కొని నిదురించేవారు ఉన్నారు. 

ధనమా! ఢాంభికాలు చాలించి మసులుకో 
 నాణ్యమే సవ్వడి చేస్తూ చిందులేస్తుంది 
నోటు ఎప్పుడూ నోరుమూసుకుంటుంది 
అందుకే! విలువపెరిగితే వినయంగా ఉండు 
నీ అంతస్తుని అంచనా వేసి అల్లరి చేసి 
చిందులేసే చిల్లర వ్యక్తులు చాలా ఉన్నారు.

Friday, May 15, 2015

!!కోల్పోయి!!

బాల్యాన్ని కోల్పోయిన ఒంటరితనం మొదటిసారిగా

మరణించి, యవ్వనంలోకి పరకాయప్రవేశమే చేసి,

స్వేఛ్ఛనే హత్యచేసిన విధి వ్యంగ్యంగా నవ్వితే తెలిసె..

నన్నునే కోల్పోయిన ప్రతీసారి చచ్చి బ్రతకడమేనని

మరచిపోవడం తెలిసిన ప్రాణానికి ఇది కొత్తేం కాదని!

గుండె నుండి తోడిన గుప్పెడు కన్నీళ్ళు మోముపై

చల్లుకుని భారమేదో తీరెనన్న నా ఓదార్పులో తెలిసె..

బండబారి మదిలో లావా బడబాగ్నై మండుతుందని

పొంగి పొర్లిందంటే అస్తికల్లోనైనా అస్తిత్వం కానరాదని!

ఆలోచనలు కొండగాలికే రెపరెపలాడుతూ కీచుమంటే

చిట్లిన కనురెప్పలే మూతపడలేమని తెలిపితే తెలిసె..

భారమైన ఒంటిపై మట్టికప్పితేనే మనసు మరణమని

కోల్పోయి మరణించి లేచి మరల కోల్పోయి సాగాలని!

Friday, May 8, 2015

!!నా అ జ్ఞానం!!


నేను మంచితనం మానవత్వం చాలానే చూసా

ఒంటిపై వస్త్రం లేనివారు, ఉన్నా కప్పుకోని వారు


పరిస్థితులు అర్థమై అర్థం కానట్లు నటించేవారు


భావాలెన్ని ఉన్నా ఏ భావం తెలుపలేని వారు..


ఒకరికింకొకరు అర్థం కారు, ఎవరికి ఎవరూ కారు


తెల్లకాగితాన్ని చదివి తెలుసుకునేవారు కొందరు


పుస్తాకాన్ని చదివి అర్థంచేసుకోలేని వారున్నారు!

Tuesday, May 5, 2015

!!ఆకలి!!


ఆకలితో ఎవరైనా చచ్చిపోతే అది హత్యే కదా
ఆ హత్యలకి కారణమైన వారికి దండనే లేదా
చట్టాలలోని వ్రాతలకు ఎన్నటికీ చలనం రాదా!

ఆకలితో అలమటించే వారికి న్యాయం జరగదా
మద్దతుకై జనాలని ఆకలి ఆత్మ పట్టి పీడించదా
ఉపన్యాసాలు ఇచ్చే నేతల గొంతు పిసికేయబోదా!


ఆకలితో ఎండిన ప్రేగుకి ఉపవాసమంటే తెలియదా
దిక్కుమాలిన దేశం ఎందుకని శాపనార్ధాలు పెట్టదా
ఉసురు తగిలిన పచ్చని పంటే బీడుగా మారిపోదా?

Monday, April 20, 2015

!!వ్యధలారా పొండి!!

ప్రియమైన వ్యధలారా నన్ను వదిలిపొండి 

ఆనందాన్ని ఇవ్వని మీరు నా దరిరాకండి

మనసు మమకారమంటూ లేనివి వల్లించి

మౌనరోధనకు మరో కొత్త భాషను నేర్పించి

మరల జీవితం పై చిగురాశను రేపకండి...

నన్ను చూసి భయపడే నా నీడనడగండి

వెలుగులో తోడొచ్చి చీకటిలో వీడెను ఏలని?

సంతోషాలని వెతికి వేసారిన నాపై ధూపమేసి

మసగబారిన మదిలో మమతని వెతక్కండి

జరిగినది మంచికేనని ఉత్తుత్తినే ఊరడించి

పక్షవాతపు జీవితాన్ని పరిగెత్తమని అనకండి!!!

Saturday, April 11, 2015

!!జోస్యఫలం!!

నా అలవాట్లు నా పై అలుగుతుంటాయి
నా చేష్టలు నాతో చెలిమి కూడనంటాయి
నా ఇష్టాలు నన్ను వీడి వెళ్ళిపోయాయి
దురదృష్టం వలపంటూ నీడై వెంటాడుతూ
నా కోరికలతో కయ్యమంటూ కాలుదువ్వి
నా ప్రమేయం లేకుండానే భాధల్ని రువ్వి
నా కంట జారే నీరు చూసి విరగబడి నవ్వి
నుదుటిరాత మార్చలేమని జోస్యమే చెబితే
నాలోని పట్టుదలే విధిపై నన్ను ఉసిగొల్పింది
నా గమ్యం నాకు తోడై శ్రమని నమ్ముకోమంది
నా ప్రయత్న ఫలితమే నాకు జయం అయ్యింది!

Tuesday, March 24, 2015

జీవితం పేకాట

జీవితం పేకాటవంటిది
నువ్వు కనుగొనలేదు...
నీఇష్టం వచ్చినట్లు ఆడలేవు!
నీకు పంచిన పేకలనే నీవు నియంత్రించగలవు..
కానీ, ఎదుటివారు వేసిన పేకలతోఆడి గెలవగలవు!
మంచి ఆటగాడు, పనికిరాని పేకలని నైపుణ్యంగా మార్చి గెలిస్తే...
చేతకానివాడు, పనికొచ్చే పేకలు పేకలు చేతినిండా ఉన్న ఆడి ఓడిపోతాడు!

Sunday, March 15, 2015

!!అద్దె దేహం!!

సొంతం కాని ఇల్లులాంటి శరీరాన్ని..
ఏదో ఒకరోజు వదిలి వెళ్ళవలసిందే కదా!
శ్వాసపీల్చడం పూర్తి అయితే ప్రాణాన్ని..
తనువు నుండి వేరు చేయవలసిందే కదా!
మరణం ఎన్నటికీ కోరదు లంచాన్ని..
కూడ బెట్టిన ఆస్తిని వీడవలసిందే కదా!
సంబర పడుతున్న సంతోషాలు అన్నీ..
సాంతం వీడి మట్టిలో కలవాల్సిందే కదా!
తిరుగు లేదని తలలు ఎగురవేస్తే ఏమీ..
తిరిగి వెళ్ళిపోతూ తలవాల్చాల్సిందే కదా!
రెండుచేతుల ఆర్జించి బీరువాలు నింపినా..
శవం పై కప్పే బట్టకు జేబులుండవు కదా!
మనతోటిదే లోకమనుకునే ఏ మనిషైనా..
కన్నుమూస్తే అద్దెదేహాన్ని వీడాల్సిందే కదా!
ఏడుస్తూ భూమి పై ఒకరు పుడుతుంటే..
వేరొకరు చచ్చి బూడిదై ఏడిపించడమే కదా!


Thursday, March 5, 2015

మానవ హోలీ

ఎరుపు పసుపు నీలి పచ్చ రంగులు కలిపెయ్

మనసుల మధ్య దూరాన్ని దోచే రంగులద్దేయ్

అహంకారాన్ని దహనం చేసి హోలీ ఆడేసెయ్

శత్రువుకి స్నేహపు రంగుల అర్థం వివరించెయ్

ధ్వేషమన్నదే కనబడని కారుణ్యాన్ని పూసేయ్

ప్రేమ పరిమళమద్ది పలురంగుల పిచకారీచెయ్

మతమేదంటే అన్నిరంగుల మానవత్వమనెయ్

రంగులన్నీ కలిసి మనిషిజాతి తెలుపని తెలిపెయ్

వసంతకేళోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ....

Thursday, February 19, 2015

!!తీరని రుణం!!

బ్రతుకు ఖాతాలో అసలు జమా కాలేదు
ఊపిరి రుణంగా మారి ఇంకా మిగిలుంది!

చెల్లించిన జీవితం వడ్డీలా కాలంలో కలిస్తే
అసలు ఆశగా మారి పెరిగిపోతూనే ఉంది!

తీరాలన్న కోరిక రెక్కలు లేకనే ఎగరబోవ
ఆనందం ఎండినాకులా మారి నేలరాలింది!

నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే
విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!

అంచనాలే గజ్జకట్టి అంబరాన్న చిందేయబోవ
నకిలీనవ్వు సంరక్షణగా మారి తైతక్కలాడింది!

Tuesday, February 10, 2015

వెళుతూ...

నన్ను కాదని వెళ్ళిపోతూ...
పెదవిపై నవ్వు చెరగనీకు అన్నాడు!
అతని ఆనందాన్ని కాదనే హక్కు నాకేదని.
నవ్వుతూ అనుకున్నాను...
నేను పోగొట్టుకున్నది నాది కాదని!
అతడు కాదన్నది కేవలం తన సొంతమేనని.
బంధం బిగుతు సడలిపోయిందని...
అపార్థాల్లో పుట్టి, ప్రశ్నా జవాబు తానైనాడని
నేనడిగాను క్షణాల్లో ఊపిరెలా ఆగేనని?
నడుస్తూ పట్టుకున్న చేతిని కాదని వదిలేసాడు!

Saturday, February 7, 2015

!!చౌక బేరం!!

ఈ అనంతకాల గమనంలో...
నా రవ్వంత జీవిత పయనంలో
ఎన్నెన్నో తెలియని మలుపులతో
సుధీర్ఘ ప్రయాణమెన్నో కష్టాలతో..సాగి
నల్లని శిరోజాలు తెలుపుగా మారెనే..కానీ
లోకంతీరు మాత్రం తెల్లబడలేదు ఎందుకనో!
నమ్మకం కానక నీరసించి వీధిలో వెతకలేక
గమ్యం ఏగూటికి ఏగెనని ఎవరినీ అడగలేక
బజారులో నమ్మకత్వం ఖరీదు ఎంతని అడిగితే
అందరూ నవ్వుతూ ఒకే సమాధానం చెప్పారెందుకో!
"నమ్మకమే నగ్నంగా నడిబజారులో నిలబడితే చూడలేక
మానవత్వం ఎప్పుడో కారుచవకగా అమ్ముడైపోయిందని"

Sunday, February 1, 2015

!!మరో ప్రయత్నం!!

నిగ్రహమంటూ గోడపై నిటారుగా నిలబడి

దురాశతో యుద్ధమే చేసి ఓడిపోతే తెలిసే...

నేను మాత్రమే మారి ప్రయోజనం ఏమని

అన్నీ తెలిసినా ఏమీ తెలియని అజ్ఞానినని

పలుకులే పొదుపుగా వాడి పొగరుబోతునై

కలలనే కని కునుకుతో కయ్యాలాడి గెలిచి

నిదురనే రాక నిస్తేజంతో నిశీధిలో నిలబడి

ప్రయత్నమే చేసి పైకి ఎగరలేక పడిపోయి

గాయాలనే కప్పేసి గాట్లకే కుట్లు వేసుకుని

మరోసారి నిలబడ ప్రయత్నిస్తే తప్పులేదని!!

Tuesday, January 27, 2015

చివరికి శూన్యం

బ్రతుకులో మచ్చలు బ్రతిమిలాడితే పోవు
చచ్చినా మాసిపోనివి ఈ చీడ చెదలు...
చేసుకున్నవాడికి చేసుకున్నంత అయితే
చెప్పినా వినని వాడికేల చెప్పేవు నీతులు...
నవ్వితే నష్టపోయేది ఏముందని మానేవు
ఏడిస్తే ఏం వస్తుందని పెట్టేవు శోకండాలు...
కష్టాల్లో కనబడక సంతోషాన్ని వాటా కోరేవు
కుప్పచేసి కూడబెట్టేవు వెంటరాని కాసులు...
భాధలని భాధ్యతలతో భాగించి వగచేవు
కాటికి వెళ్ళుతూ చూపేవు రిక్తహస్తాలు...
నవ్వుని నవ్వుతో కాక ఏడుపుతో భాగించి
హృదయాన్ని ఎందుకు చేస్తావు ముక్కలు...
మెదడుతో ఆలోచించక నాలుకతో మాటలాడి
మనసుని ఏల అడుగుతావు నీవు లెక్కలు...
చివరికి జీవితం మతలబు లేని కితాబు అనేవు

Saturday, January 10, 2015