Saturday, March 23, 2019

క్షయవ్యాధి నివారణ దినోత్సవం

 "క్షయ" అంటే నశింపజేసేది..ఆరోగ్యాన్ని నశింపజేసే రోగమాయ
ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వచ్చే వ్యాధి క్షయ..
ఊపిరితిత్తుల సంబంధించినదైనా ఏభాగాన్నైనా తాకును దీని ఛాయ!
     
ఏ రోగమైనా ఎలా వస్తుందో తెలుసుకుని రాకుండా జాగ్రత్తగుండాలి
రావద్దన్నా సోకిందా ఇతరులకి అంటకుండా చికిత్స చేయించుకోవాలి
పరిసరాల శుభ్రతతో పాటు ఇళ్లలోకి గాలి వెలుతురు బాగా ఉండాలి
వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంతో వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవాలి!

కఫం రక్త మూత్రపరీక్షలు ఛాతీఎక్సరేతో వైద్యుడ్ని కలవడం మానకు  
వ్యాధి సోకితే నిరాశ చెంది జీవితమే నాశనం అయ్యిందని చింతించకు
నోటి నుండి వచ్చిన కఫాన్ని కాల్చివేయకుండా బయట పారవేయకు 
క్షయ సోకితే బాహటంగా దగ్గి తుమ్మి ఉమ్మి ఇతరులకు అంటించకు!

"డాట్స్" పరిమిత కాలంలో క్షయవ్యాధి నయంకై నేరుగా చేసే చికిత్స
క్షయరోగ నిర్ధారణ జరిపి రోగి చికిత్సను పర్యవేక్షించే బాధ్యతగల వ్యవస్థ 
ఈ వ్యాధి బారిన పడకుండా పుట్టినపిల్లలకు బి.సి.జి టీకా వేయించండి
రోగ దినోత్సవం నిర్వహించాల్సిన అవసరంలేని అవగాహనకై తోడ్పడండి! 

Friday, March 8, 2019

!!నేనే ఆధారం!!

నా కళ్ళతో కాదు నీ మనసుతో చూడు కనబడతాను
కరుణ దయ రక్షణ సంరక్షణనే పేర్లతో పిలవబడతాను 
నీ జీవితంలో నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచేది నేను
మనసుని చల్లపరచి ఉధ్రేకాన్ని నీరులా మారుస్తాను..

శ్రమతో అలసిన నరాల్లో కొత్త రక్తానినై ప్రవహిస్తాను   
చీకటిలో కొట్టుమిట్టాడు జీవితంలో వెలుగు నింపుతాను!

మనసుపెట్టి చూడు...ప్రతి మగువా ప్రతి రూపంలోనూ
తల్లి చెల్లి కుమార్తె స్నేహితురాలు భార్య ప్రియురాలే కాక
ఉపాధ్యాయురాలిగా భోధించి అవసరమైతే దండిస్తాను!!

సుచితో ప్రవహించే నీరులా పరిస్థితికనుగుణంగా మర్లుతాను
నేను లేనిది జీవితం తీరని దాహం ఇంకా అసంపూర్ణం..
ఈ సృష్టికి నేనే మూలం...సంతృప్తికర జీవనానికి ఆధారం!

Wednesday, March 6, 2019

!!ముందుచూపు!!


మెకానికల్ మనుషుల మనసు కరిగించాలని
కంకణం కట్టుకుని కాలంతో పోటీపడి కుదరక
సర్దుబాటు కాని సమయంతో రాజీకి రాలేక..
కాలాన్ని అద్దెకు తీసుకుని ఆశల్ని బ్రతికిస్తున్నా!
  
ఆధునిక కలికాలంలో అధికవేగంతో పరిగెట్టాలని 
ప్రయత్నం ఎంతో చేసి అలసినా విసుగు చెందక 
తెగిన మదిని మమతల దారంతో ముడేయలేక..    
చమురు చేబదులు అడిగి లాంతరు వెలిగిస్తున్నా!

వాడి వెలిసిపోయిన నవ్వును చిగురింపజేయాలని 
బరువు బాధ్యతల్లో మునిగిన వారిని అడుగలేక    
యంత్రాలకు బానిసైన వారిని బంధించడం రాక..
త్వరగా తీసుకెళ్ళమని ఆయువుకి అర్జీపెట్టుకున్నా!