Sunday, June 26, 2016

!!వృధ్ధపరువం!!

అరంగేట్రం చేసిన ఆశలు అణచుకోవాలి అనుకునే కొద్దీ
అణగలేమని అంటూ హాస్యం చేసి ఆట పట్టిస్తున్నాయి!

వయసు పైబడి పెంచుకున్న కోరికల్లోని ప్రోత్సాహం తగ్గి
నీరసం కౌగిలంటే జీవితోత్సాహాలు సన్నగిల్లుతున్నాయి!

పంటి క్రిందవేసి పట్టుదారాన్నే కొరకలేని వృధ్ధపరువానికి
పనిలేని పరిపక్వాలు తోడున్నామంటూ పిలుస్తున్నాయి!

యవ్వనంలో తీరకుండా బోల్తాపడ్డ పసిడికలలు నిద్రలేచి
అరిగిన ఆలోచన్లకి ఆకురాయితో పదును పెడుతున్నాయి!

పరుగు తీయాల్సిన ప్రాయంలో పట్టనట్లు పడుకున్న ప్రేమ
ఇప్పుడు ప్రాకులాటతో గుండెలయల్ని వేగం చేస్తున్నాయి!

ముగ్ధమనోహరమైన మోముపై రంగులు మెరవలేక వెలసి
నిద్రపోతే జ్ఞాపకాలు జోలపాటంటూ భయపెడుతున్నాయి!

అమాయకపు హృదయం పసిపిల్లలా గెంతులువేయాలని
చేసే ప్రయత్నాలు ప్రయాసపడి లేస్తూ కుంటుతున్నాయి!

Monday, June 20, 2016

!!డామిట్ అడ్డం!!

డామిట్...విచిత్ర విన్యాసమదేమో మోహానిది మమతది
నిర్మల నిశ్చింతలని కోరుకుంటాము ముళ్ళై గుచ్చుకుంటే!

దక్కిందేదో మిగిలిందేదోనన్న ఆలోచనలే దండుగ ఏమో
వచ్చిపోయే సుఖధుఃఖపు వెలుగునీడల దాగుడుమూతల్లో!

కనులారా చూడలేదు కొలువనే లేదు భగవంతుని మదిలో
అయినా నా పై నేను వశము తప్పుతాను నిదురపోతుంటే!

జనం నవ్వుని ఆనందపు అందలాన్న ఎక్కించి ఊరేగిస్తారు
కానీ...వాస్తవానికి వగచి ఊరట పడితేనే కదా ఉపశమనం!

Wednesday, June 15, 2016

!!ఆశలు!!

ఆనందం ఎక్కడా అమ్ముడుకాదు  
ఆవేదనా మనకోసం అమ్మబడదు
ఆలోచనల్లో అవకతవకలనుకుంటా
వాటికి మందుమాకులేం ఉండవు!

కోరికలతో కొట్టుమిట్టాడు మనిషిని
మూర్ఖత్వం కౌగిలించుకుని వీడదు
సరిదిద్ది సంధి చేసుకోవాలనుకుంటే
ఆపసోపాలతో అగచాట్లపాలయ్యేవు!

ఆశలకి లొంగితే నీకు నీవే పిడిబాకు
మితిమీరితే జీవితంపై పుట్టు చిరాకు  
ఆకాంక్షలు అంతంలో చేసేను గాయం
అయినా జీవితాంతం మనల్ని వీడవు!


Saturday, June 11, 2016

!!వేచి ఉండండి!!

సూర్యుడు ఇంకా సద్దుమణగలేదు
 
పచ్చని చెట్లు ఆకులు రాల్చలేదు
 
కాస్తాగి...ఓపికతో వేచి ఉండండి
 
ఓటమి నన్ను ఇంకా వరించలేదు
 
కాస్తంత ప్రయత్నం చేయనివ్వండి
 
ఓడిపోతే నేనే తిరిగి పయనమైపోతాను
 
పోరాటం ఏదో పూర్తి కానివ్వండి
 
విరూపించ వంకలు అవసరంలేదు
 
త్వరలో ఎలాగో పరాభవించబడతాను 
 
కొద్దిగా పేరుప్రతిష్టలు ఏవో రానివ్వండి!!

Thursday, June 2, 2016

!!ప్రేమ కాని ప్రేమ!!

నాకు ప్రేమికులెప్పుడూ ఎందుకనో అర్థంకారు

అసలైన ప్రేమ వీరిది అనుకుందామంటే

అమ్మ చూపిందేంటని ఆశ్చర్యం నవ్వింది.. 

ఒకరికొకరు ఇరువురి బంధమనుకుంటే

కన్నవారి ప్రేమ కాలకూట విషమా అనంది..   

ఇద్దరి మనసులు ఒకటైనాయి అనంటే

జన్మ ఇవ్వకపోతే అంటూ అపహాస్యమాడింది..

ప్రేమకు పరిభాష వెతక్క పెద్దమనసుతో పయనిస్తుంటే

పెంచిన పాశం పసిపాపై మేనుని, మెదడుని దొలిచింది!