Thursday, July 26, 2018

!!జీవిత రణం!!

జీవన పయనంలో అనునిత్యం సంగ్రామమేనేమో 
తీరని కోర్కెలు కోరలు తెరచి బుసకొడుతున్నట్లు 
ఓపిక నశించి  రౌద్రం తాండవిస్తూ రణానికి సిద్ధం...

మాటా మాటా కలగలిసి కూడా క్షతగాత్రమైపోతూ
వయసేమో రెక్కలు తెగిన పక్షిలా అరుస్తున్నట్లు 
ఆత్మగౌరవపు గోడకతుక్కున్న సాంప్రదాయవ్యర్థం...

ఆవేదన ఆరాటంతో కరిగిపోతున్న ఆశయాల ఆకృతితో
ఆత్మాభిమానం అంచనాకందని భీభత్సం సృష్టిస్తూ
ముక్కలై రాలిపడిపోతున్న గతస్మృతుల యుద్ధం...

ముక్తాయింపులు మాట్లాడుకుంటున్న అనుబంధాల్లో
మనసుల మధ్య మమకార కారుణ్యం కరువైపోయినట్లు 
సివంగిలా పైకి నవ్వుతూ లోన దహిస్తున్న నా రూపం!!

Wednesday, July 4, 2018

!!మారిపోతున్నాను!!

రోజులు వారాలుగా వారాలు నెలలై ఏళ్ళు గడుస్తుంటే నేను ఎందుకు మారకూడదనుకుని మారిపోతున్నాను! అవును తల్లిదండ్రుల్ని అక్కాచెల్లెళ్ళను అన్నాతమ్ముల్ని నా అనుకున్న వారిని అందరినీ ప్రేమించి కళ్ళుతెరిచి ఎవరికెవరూ కారని నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను ఎవ్వరినీ మార్చలేక నన్ను నేను మార్చుకుంటున్నాను! ఇప్పుడు నేను కూరగాయలు పండ్లు అమ్ముకునే వారితో బేరసారాలు చేసి మిగిల్చిన సొమ్ముతో భవంతిని కట్టలేను ఆ సొమ్ము పేదవాడి పిల్ల స్కూల్ ఫీజ్ ఐతే బాగుండును ఆటోలో నుండి దిగి డబ్బులిచ్చి చిల్లరడగడం మానేసాను అదే చిల్లర డ్రైవర్ పెదవుల పై నవ్వైతే ఆనందిస్తున్నాను! నేనిప్పుడు ఒంటిపై బట్ట నలిగిపోయిందని బాధపడ్డంలేదు వ్యక్తిత్వమే మనకన్నా బిగ్గరగా మాట్లాడుతుందని తెలుసు ఎందరి చేతనో మెప్పులు ప్రశంసలు ప్రేరణగా పొందిన నేను స్వేచ్ఛగా ఉదారంగా నేనిప్పుడు ఎందరినో ప్రశంసిస్తున్నాను నాకు విలువనీయని వారి నుండి నేను దూరమైపోతున్నాను నా విలువ తెలియకపోయినా నేను వారిని తెలుసుకున్నాను! అవును నిజంగానే నాలో చాలా మార్పు వచ్చినట్లనిపిస్తుంది పనికిరాని ప్రసంగం చేయక కుళ్ళూ కుతంత్రాలని వెలివేసాను ఏ అనుబంధానికైనా అహమేగా అడ్డని పూర్తిగా అణచివేసాను నావలన జరిగిన తప్పుకి క్షమార్పణ కోరడం నేర్చుకున్నాను భావోద్వేగాలతో నేను ఇబ్బందిపడి వేరెవరినీ ఇబ్బంది పెట్టను నేను సృష్టించినవైన భావోద్వేగాలు నన్ను నిర్దేసిస్తే ఊరుకోను నా ప్రతీరోజు చివరిరోజనుకుని జీవించడం అలవరచుకున్నాను ప్రస్తుతానికి ఇంతే మారాను మున్ముందు ఎంతో మారిపోతాను!