Thursday, November 22, 2012

వద్దంటే

బహుశా అనుకూలవతి అయిన ఆలిని కానేమో
దురలవాట్లకి అతడ్ని దూరం చేయలేకపోయా!
ప్రొగతాగ వద్దంటే పొగరెక్కింది పోవే అన్నాడు
చుక్కేసి చేపల పులుసుకై చెంప పగులగొట్టాడు
సంపాదించడం చేతకాని నేను సంసారిని కానేమో
చిల్లిగవ్వైనా చేతికియ్యనోడికి చిల్లరదాన్నైపోయా!

Sunday, November 11, 2012

పుర్రెకో ఆలోచన!

ఒక మానేజర్, వాళ్ళ అసిస్టెంట్, ఒక తల్లి, వాళ్ళ అమ్మాయి కలిసి ట్రైన్ లో ప్రయాణమై వెళుతున్నారు. ప్రయాణంలో పలకరింపులతో పరిచయాలయ్యాక పిచ్చాపాటి మాటలతో స్నేహితులయ్యారు.
కొద్దిసేపటికి ఒక పెద్ద టన్నల్ వచ్చి దానిగుండా ట్రైన్ వెళ్ళడంవలన బోగీలో చీకటి వ్యాపించింది. అంతలో అకస్మాత్తుగా ఎవరినో ముద్దాడిన మరియు వెంటనే చెంపగుయ్యిమన్న శబ్ధం వినిపించాయి. మరి కొద్ది క్షణాలకి టన్నల్ నుండి టైన్ వెలుగులోకి వచ్చింది.
ఆ పెద్దావిడ, అసిస్టెంట్ ఎదురెదురుగా కూర్చుని ఒకరి ముఖం వంక మరొకరు అయోమయంగా చూసుకుంటుంటే, మానేజర్ ఎర్రగా కమిలిన ముఖాన్ని రుద్దుకుంటూ కూర్చున్నాడు.
ఎవరికి వారే ఒకరితో ఒకరు ఏమీ చెప్పుకోకుండానే ఒకరి గురించి ఒకరు ఇలా అనుకుంటున్నారు.

పెద్దావిడ:- మానేజర్ ఏదో చెడుబుధ్ధితో మా అమ్మాయిని ముద్దాడబోతే భలే బుద్ది చెప్పిందిలే వెధవకి అనుకుంది.
అమ్మాయి:- బహుశా మానేజర్ నన్ననుకుని మా అమ్మని ముద్దాడి చెంపదెబ్బ తిన్నాడు అనుకుంది.
మానేజర్:-ఛా!....ఛా! ఈ అసిస్టెంట్ కి బుద్ధిలేదు, ఆ అమ్మాయిని వీడు ముద్దు పెట్టుకుంటే నేనే ఆ పని చేసాననుకుని నన్ను చెంపదెబ్బ వేసింది అనుకున్నాడు.
అసిస్టెంట్:- ఈ సారి ఇంకో టన్నల్ వచ్చినప్పుడు మరలా ముద్దాడినట్లు శబ్ధం చేసి మా మానేజర్ ని ఇంకాస్త గట్టిగా చెంపదెబ్బ వేయాలి. రాస్కెల్....అఫీసులో కాల్చుకు తింటున్నాడు అనుకున్నాడు:-)

Sunday, November 4, 2012

బాడ్ లక్/గుడ్ లక్?

మేము కొత్తకారు కొన్న మర్నాడే ఆ బ్రాండ్ కార్ల రేటు 30వేలు తగ్గేసరికి చుట్టు పక్కలవాళ్ళంతా అయ్యో ఎంత “బాడ్ లక్” అంటూ జాలిచూపిస్తూ మనసులో మాత్రం భలే భలే అనుకుని మా కారుని చూసి కాస్త ఈర్ష్య పడ్డారు. నేను మాత్రం….”బాడ్ లక్?  “గుడ్ లక్?
ఎంటో చూడాలి అనుకున్నా.
కొన్న నెలలోనే అతితక్కువ ధర్లో ఇల్లొకటి కారుచౌకగా వస్తే కొన్నాము…..ఇది విని బంధువులంతా, భలే చౌక బేరము కారొచ్చిన వేళ మీకు కల్సొచ్చింది ఎంత “గుడ్ లక్” కదా అని పైకి అన్నా ఎక్కడిదో ఇంత డబ్బు అని మనసులో అనుకుని కాస్త అసూయ పడ్డారు. నేను మాత్రం “గుడ్ లక్?  “బాడ్ లక్? చూద్దాంలే అనుకున్నా.
ఇంకో పదిరోజులకి మా కుటుంబమంతా కలసి కార్లో ఊరు వెళితే యాక్సిడెంట్ అయ్యి నా కాలు విరిగింది….అందరూ ఛా! శనివారం ఇనపవస్తువు అందులోను ఈ కారు అచ్చిరాలేదు అందుకే ఇలా అయ్యిందంటూ మాకిది “బాడ్ లక్! ఆని పాపం ఆ నోరులేని కారుని ఆడిపోసుకున్నారు. నేను మాత్రం కిమ్మనకుండా కాలికి కట్టువేసుకుని కూర్చున్నా.
మరో ఆరువారాలకి నా కాలు పూర్తిగా నయమయ్యాక, మా ఫ్రెండ్స్ అందరూ కలవకుర్తిలో ఒక ఫంక్షన్ లో కలుసుకుని అక్కడి నుండి అందరం ఒక సుమో మాట్లాడుకుని హంపీ విజయనగరం వెళ్ళాలనుకున్నాము. ఎప్పుడూ తన విధిని సక్రమంగా నిర్వర్తించే మాకారు ఆరోజు సిటీ దాటి బయటికి అడుగిడనంటూ మొరాయించి అవుటర్ రింగ్ రోడ్లోనే ఆగిపోయింది....….చేసేదేం లేక అప్పటికే ఆరు గంటలు ఆలస్యమైందని నేను ప్రయాణం ఆపుకుంటే, వాళ్ళంతా ఫంక్షన్ లో కలిసి అక్కడినుండి హంపీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన సుమో లారీకి గుద్దుకుని ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్రగాయాలై బయటపడ్డారు.
“బాడ్ లక్? లేక “గుడ్ లక్? అని ఎవరిని అడగాలో తెలియక మౌనంగా ఉన్నా….