Thursday, January 23, 2014

ఏమిటో ఈ వింత!

చచ్చినోళ్ళ కళ్ళు చాటంత....

ఉన్నప్పుడు వారిపై లేనిచింత

పోయాక అందరూ చేరి చెంత

పొగిడేరు చర్చిస్తూ తలాకొంత

పలకనివారుసైతం పరామర్శిస్తూ...

మనుగడేమైనా కలిసేది మట్టిలోనని

ప్రాణమున్నప్పుడు చెప్పని సూక్తులతో

జీవంలేని శవాన్ని శుద్దిచేస్తారు అంతా

ఎందుకంటే ఆత్మశాంతంటూ పలికేరు వంత

బ్రతుకునలేని శాంతి చావులో కోరడమోవింత!

Saturday, January 18, 2014

వెలిసినగోడ

వెలిసిపోయిన గోడలాంటి జీవితంలో

దాచుకోవడానికి ఏం మిగిలి ఉందని,

నాసిరకం బంధాల రంగునీరద్దడానికి?

తప్పులేవో బీటల్లో స్పష్టం అవుతుంటే

పునాది పటుత్వ సాంధ్రత తగ్గుతుంటే

అనురాగాలసెగ ఇటుకమదిని కాల్చక

భాంధవ్యాలు ఎండిన మట్టై రాలుతుంటే

కూలబోయే గోడల కోసం ఎదురుచూస్తూ

పడబోతే ఆపే ప్రయత్నమేదో చేస్తున్నట్లు

పాతపునాది పూడ్చి కొత్తది తవ్వుతుంటే!!

Saturday, January 11, 2014

!!బ్రతుకుబాట!!

అభూతలోకంలో అంతుచిక్కని ప్రశ్నలున్నా
జీవితాన్ని చదివితే దొరికే జవాబులున్నాయి..

కట్టిన ఇష్ట ఇసుక సౌధాలెన్ని కూలిపోతున్నా
కలలు కాదంటూనే కళ్ళను కౌగలిస్తున్నాయి..

అడుగడుగున గుండె విఛ్ఛిన్నం అవుతున్నా
విరిగిన మనసుని అతికే మార్గాలు ఉన్నాయి..

ముసుగుమార్చి జీవించే జీవితాలు ఎన్నున్నా
మంచి మనిషి మనుగడలు కొన్ని ఉన్నాయి..

ఎదురు దెబ్బలు తగిలి గాయాలు అవుతున్నా
మలాం పూసి చేయందించే చేతులు ఉన్నాయి..

అదృష్టమాడే ఆటలో గెలుపోటములు ఎలాగున్నా
జీవించడానికి అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి..

Sunday, January 5, 2014

అమ్మను...

గోరుముద్దలుకొన్ని గోముగా తినిపించి

ముద్దులు ఎన్నో మూటల్లో పంచి పెంచి

ఆత్మవిశ్వాసం ఆభరణంగా అలంకరించి

చిరునవ్వనే ఆయుధాన్ని నీకు అందించి

నా ఆశలన్నీ నీ కళ్ళలో కలలుగా గాంచి

నాకు సాధ్యంకాని విజయం నీలో నే చూసి

ఆనందించే వేళలో నా ఆయువు నీకు పోసి

నీలో ఊపిరిగా ఉంటాను- అమ్మనుగా నేను!