Monday, July 28, 2014

కలలు

స్వప్నాల్లో జీవించడమే బాగుంది
నిద్రని పెట్టుబడిగా పెడితేనే చాలని
కళ్ళతో ఆశల అంబరాన్ని తాకించి
నిదురే నాకు నిజమైన నేస్తమైంది

నెరవేరక నిరాశపరిచే నిజాలకన్నా
బూటకపు భ్రాంతియే భలేబాగుంది
అనురాగమంటూ ఆస్తులేం అడగక
ఊహల్ని వీలునామాగా అందించింది

అక్కునచేరి అవసరం తీర్చమననని
కావలసింది కనులార కలగనమంది
గతాన్ని కొనేంత గొప్పదాన్ని కాదని
గుర్తించి గుణపాఠమే నేర్చుకోమంది

Thursday, July 24, 2014

!!మార్పెందుకో!!


ఇంతలోనే ఈ మార్పు ఎందుకో!
వేలుపట్టుకుని నడిచిన చేతివేళ్ళే
వేలెత్తి వంకలు చూపుతున్నాయి

ఇంతలా తెలియని దూరమేలనో!
కరచాలం అంటూ కలిపిన చేతులే
కాదు పొమ్మని కసురుతున్నాయి

ఇప్పుడు ఎందుకని ఈ అలజడో!
నాడు అంతంలేని మాటల ఆతృతే
నేడు మాటలు వెతుకుతున్నాయి

ఇవాళ ఈ వ్యధభారమెలా తీరునో!
నాటి పరిచయ పులకరింతజల్లులే
పైనతడిసి పరాయిగా తోస్తున్నాయి

Friday, July 11, 2014

!!నవ్వుతూ బ్రతికేస్తాను!!

బ్రహ్మాండంగా బ్రతికేస్తాను.....నవ్వుతూ నవ్విస్తూ

తుప్పుపట్టిన ఊహలని ఆశలకొలిమిలో కాలుస్తూ

నలుగురూ నన్ను చూసి నవ్వితే నేను నవ్వేస్తూ!

అస్తమించే సూర్యుడిలో నన్ను నే చూసుకుంటూ

గూటికి చేరే పక్షులలో నన్ను నేను వెతుక్కుంటూ

చిరిగిన నవ్వుకి మాసికేసి నాలో నే నవ్వుకుంటూ!

కాగితంపువ్వుకి పలుసార్లు పరిమళమద్ది పీలుస్తూ

వలసలా వచ్చి పొమ్మంటూ జ్ఞాపకాలని తరిమేస్తూ

దర్జాగా బ్రతికేస్తాను...డాబుగా అని బేలగా నవ్వేస్తూ!