Monday, August 24, 2015

!!జ్ఞాపకగాయాలు!!

కళ్ళలో విరిగిన గాజుముక్కలే విలయతాండవం చేస్తున్నట్లు
జ్ఞాపకాలు కొన్ని గాయాలై మరల సలపరం పెడుతున్నాయి!

నిశిరాత్రి కూడా నిశ్శబ్దంగా నిద్రపోతుంటే పాతగాయాలు రేగి
మాసిక వేసిన గుండెనే మరోమారు ముక్కలు చేస్తున్నాయి!

పగటి నుండి సంధ్య వరకూ వ్యాపకాల ఒడిలో కునుకు తీసి
రాతిరవ్వగానే కన్నీట తడిసిన తలగడని ఆరనీయకున్నాయి!

మరకలను మాపుకోలేని మెత్తటి మనసు చుట్టు చీముపట్టి
నిదురలేక ఎర్రబడ్డకనుల ఉసురు పోసుకుని ఉసూరన్నాయి!

గుచ్చుకున్నవి జ్ఞాపకాల గాజుముక్కలే అని తీసివేయబోతే
మరపురాక కన్నీరు ఆగిపోయి గాట్లు రక్తమై స్రవిస్తున్నాయి!

Friday, August 21, 2015

Friday, August 7, 2015

!!ఏం తెలుసు!!

లంగరేసి ఒడ్డునున్న లాంచికేం తెలుసు
నడిసముద్రంలో తెడ్డులేని నావ గురించి
మనసు లేని బండరాయికి ఏం తెలుసు
మనోఃభావ అలజడుల సంకీర్తన గురించి!

దాహం అంటూ గోలచేసే నేలకేం తెలుసు
నరికేసిన చెట్టు కార్చలేని కన్నీటి గురించి
ఎండిపోలేకున్న ఎదపొరలకి ఏం తెలుసు
ఆవిరైపోయిన చిరాశల సెలయేటి గురించి!

ఆకాశంలో విహరించే విహంగానికేం తెలుసు
భారమైన మేఘాలు కార్చే వర్షధార గురించి
ఫలధీకరణ దాల్చిన పుప్పొడికి ఏం తెలుసు
విచ్చుకోకనే రాలిపోయిన పువ్వుల గురించి!