Wednesday, August 28, 2013

!!తప్పుచేస్తున్నా!!

సదా తప్పు చేస్తూనే ఉన్నాను....
ఆ తప్పుని జీవితాంతం భరిస్తాను!


నా ఒడిని కష్టాలముళ్ళతో నింపి
నీ మార్గంలో పూలెన్నో పరిచాను!


స్నేహమో శత్రుత్వమో ఏదేమైనా
నిస్వార్ధంగానే నీతో చేయికలిపాను!


మావిచిగురిని రుచి చూడాలనెంచి
కుహూ....అని కోయిలని పిలిచాను!


కన్నీటిధార చెంపన ఆరకపోయినా
పరిహారంగా నా నవ్వుని చెల్లించాను!


మదికంటిన మసిని కన్నీటితో కడగక
మోముపైన ధూళిని శుభ్రం చేసాను!

Friday, August 23, 2013

!!నా నీవు!!

పారే సెలయేరులా
సూర్యుడి తొలికిరణంలా
జీవితాశయ సారానివి నీవు!

విరిసిన వెన్నెలలా
మృగనయనాల భీతిలా
జీవితాలంకరణ పిపాసివి నీవు!

నిర్మానుష్యపు తోడులా
ఎడారిలో ఒయాసిస్సులా
జీవితాన్న అమృతానివి నీవు!

పెదవిపై చిరునవ్వులా
అలసినమోముపై చినుకులా
జీవితానుగ్రహ బహుమతి నీవు!

నీవరోకాదు...నన్నిలా
అనుక్షణం వెంటాడే నీడలా
నాలోదాగిన ఆత్మస్థైర్యానివి నీవు!

Sunday, August 18, 2013

క్రొత్తనీరుకి ఆహ్వానం

ఎన్నో ఆశల్ని అదృశ్యంగా మూటకట్టుకుని
ఏదో సాధించేయాలన్న తపనతో సాగుతూ
ఆర్పేసాను అడ్డొచ్చిన మండేమాధ్యమాలని
ఆశల తనువు తగలబడినా ఆశతో నడుస్తూ
గుడ్డిగా నమ్మాను ఫలించని ఆత్మవిశ్వాసాన్ని
మనసుమమతల మధ్యయుధ్ధంలో నేనోడుతూ
మోముపై శింగారించాను బూటకపు విజయాన్ని
తనువు అనుక్షణం మనసు ప్రతిక్షణం నలుగుతూ
జ్ఞాపకాలనీడలో వెతుకుతున్నా మరణించని ఆశని
మండే వెలుగుని చూడలేక చీకటే నయమనిపిస్తూ
మరణాన్ని కౌగలించుకోవాలని మరలకాదు తప్పని
నిత్యం నేను మండుతూ మనసుని మభ్యపెడుతూ
నన్నునే ఓదార్చుకుంటూ ఆహ్వానిస్తున్నా క్రొత్తనీరుని!

Thursday, August 15, 2013

జైహింద్...

చాలింక పాలద్రోలు నీ స్వార్ధచింతన
కాసింత పెంచు నీలో దేశభక్తి భావన
దేశం నీకేమిచ్చిందని వేయకు ప్రశ్న
నీవిచ్చిందేమిటో ఆలోచించు ఇకనైనా
ఏంచేయని నీకెందుకనవసర ఆక్రంధన
కనులు తెరచిచూడు ఆపి నీ ప్రేలాపన!!


అవినీతి అగ్నిగుండంలో కాలే కోరికల్నిలేపు
మత్తుబానిస మనిషయ్యే మార్గాన్ని చూపు
సంస్థలుమారినా సంఘర్షణతో నిరాశ చెందకు
మార్గన్ని మార్చిన నీవు గమ్యాన్ని మార్చకు
దేశపురూపాన్ని నీవు మార్చి వేలెత్తిచూపకు
దేశమే మనం అయ్యేలా చాకచక్యాన్నిచూపు
నిర్ధిష్టనీటిచుక్కలతో మారిన తూఫాన్నిచూపు


మంచి కొరకై చెడును ఎదిరించి చూడు
నీలోని నమ్మకపు ఖజాన తెరచిచూడు
సిరధమనుల రక్తాన్ని వేడెక్కించిచూడు
కలతలెరుగని దేశాన్ని కళ్ళెదుటచూడు
సాధనకై పట్టుదలతో ప్రయత్నించిచూడు
ఆకాశమే తలవంచి సలాం కొట్టేనుచూడు!!

Monday, August 12, 2013

!!సర్దుబాటు!!

ఒంటరి బాటసారిపై ఇంత వలపెందుకు
అతకని తాడుని కతికేలా ముళ్ళెందుకు
దక్కదని తెలిసాక తగని మక్కువెందుకు
కలసిరాని కాలంలో కలిసి కలవరమెందుకు

ఒకరంటే పడిచస్తాను అనడమే ప్రేమకాదు
వెర్రిగా వెంటపడి వేధించడం వివేకమేంకాదు
ప్రేమని పొందడమే ప్రేమకి పర్యవసానంకాదు
దక్కనివాటిపై వ్యామోహమది విరహమేకాదు

ఆశలున్నా అందరికీ నెరవేరేది మాత్రం కొందరికి
ఎగసినకెరటాల్లో కొన్నిమాత్రమే చేరతాయి ఒడ్డుకి
మనసుపడే తపన ఏం తెలుసు కలలుకనే కళ్ళకి
సర్దుకోక తప్పదు మనకీ మరోసారి మనమనసుకి

Monday, August 5, 2013

శోధన

అద్దంలోని మోములో అందాన్ని వెతికాను
అర్థంకాని కవిత వ్రాసి సారాంశం అడిగాను
చేతిగీతల్లో నుదుటిరాతను మార్చబోయాను
నా ఊహాసౌధాలని నా నీడలోనే శోధించాను
ఓటమిపై గెలుపుకై పట్టుదారం పట్టుకెగిరాను!

అనుభవసారంలో జీవితాన్ని చూస్తున్నాను
భావోద్రేకపు ఆటుపోట్లను తప్పక జయిస్తాను
పడిలేచి నిలకడగా నిజాన్ని తెలుసుకుంటాను
ప్రతిరోజు ఉదయపు ఆశాకిరణాన్ని పిలుస్తాను
నిదురించిన ధ్యేయాన్ని నిదురలేపుతుంటాను!

అనవసర జ్వాలగా కాక దీపమై వెలుగుతాను
ఆశయసాధకై అనువైన అస్త్రాన్ని అన్వేషిస్తాను
నిరాశనైనా మృత్యువుని మాత్రం ఆశ్రయించను
లోకం గేలిచేసినా ఆశచావక ప్రయత్నిస్తుంటాను
నన్ను నే నమ్ముకుని ముందుకు సాగిపోతాను!