పదవీ విరమణ తరువాత జ్ఞాపకాల్లో బ్రతుకుతూ
కాలాన్ని మళ్ళీ తిరగేస్తూ కొన్ని అనుభూతులని
ఒకటికి రెండుసార్లు తలుచుకోవాలి అనుకుంటాను
పసిపిల్లలా మారి పరుగులు తీయాలనుకుంటాను
నాగరిక నడకలో నన్నునేను పరిగెత్తించాలని కాదు
నా పరుగు చూసి అమ్మ నవ్వి మురిసిపోవాలని!
పాఠశాలకు యూనిఫారంలో మరోమారు వెళతాను
చదువులన్నీ చదివి ఏదో వెలగబెట్టేయాలని కాదు
స్కూల్ ఫ్రెండ్సుని పలుకరించి అల్లరి చేసెయ్యాలని!
కొత్తగా జాబ్లో చేరి కొలీగ్స్ ని కలవాలనుకుంటాను
పని తక్కువ కబుర్లెక్కువా చెప్పుకోవచ్చని కాదు
మొదటి నెల జీతం తీసుకున్న ఆనందంపొందాలని!
మరోసారి పెళ్ళిచేసుకుంటే బాగుంటుందనుకుంటాను
కంగారు పడకండి భాగస్వామిని మార్చాలని కాదు
పెళ్ళి సంబరాలు మరింత ఘనంగా చేసుకోవాలని!
పెళ్ళైన నా పాప మళ్ళీ పసిపిల్లైపోవాలనుకుంటాను
తొందరగా ఎదిగి పెళ్ళితో దూరమైపోయిందని కాదు
మరింత సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని!
బ్రతకడానికి మరికొంత సమయం కావాలనుకుంటాను
జీవితంలో సంపాధించి ఇంకేదో ఉద్దరించేద్దామని కాదు
ఇతరులకు నేనేదో విధంగా కొంతైనా సహాయపడాలని!
ఎన్ననుకుని ఏం లాభం..? గడిచిన కాలం తిరిగిరాదు
అందుకే ఈ క్షణం మనదనుకుని సంపూర్ణంగా జీవిద్దాం!