అనుభవసారానుసారంగా నన్ను నేను అచ్చువేసుకుంటున్నాను
ఎవరైనా ప్రేమించాననంటే వెంటనే భుజాలు తడుముకుంటున్నాను
ఒక చెంపపై కొట్టారంటే రెండవ చెంప చూపించడం పుస్తక జ్ఞానం
ఎవరైనా పక్కలో బళ్ళెమైతే వెంటనే కత్తిదూయడం నేటి పరిజ్ఞానం
అప్పట్లో పాము నీడలో ఉన్నట్లు ఊహించుకుని మరీ భయపడ్డాను
ఇప్పుడు విషానికి విరుగుడు వెతుక్కుని విలాసంగా బ్రతికేస్తున్నాను
ఒకరు నన్ను కుట్రబూని వంచిస్తే మోసబోవడం అప్పటి నా అజ్ఞానం
ఎదుటివారి చిరునవ్వులోని చిద్విలాసాన్ని చదువ గలదు నా జ్ఞానం
అనవసరంగా అన్నింటా తలదూర్చి అప్పుడు చేతులు కాల్చుకున్నాను
ఎవరేది చెప్పినా సొంతగా ఆలోచించి వాయిదా వేసి తప్పుకుంటున్నాను
ఒంటర్ని నేనంటూ వణకిపోతూ జాగ్రత్తగా ఉండేది గాజులాంటి హృదయం
ఎప్పుడైతే రాయిగా మారిపోయెనో మది ఎగిరిగెంతులు వేస్తుంది జీవితం!