Sunday, November 27, 2022

 !!మన'పురో'గతి!!

శ్రమించి సంపాదించి కడుపు నిండా భుజించేవారు
కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు వచ్చేసాయి
తిన్నది అరగడానికి ఇప్పుడు వాకింగు చేస్తున్నారు

నడిరాత్రి నట్టింట కన్నంవేసి దొంగలు దోచేసేవారు
కొత్త కోర్సులు పుట్టుకొచ్చి సైబర్ నేరగాళ్ళ నెలవైంది
పగలురేయి దొంగలు దొరలై నెట్ ఇంట దోస్తున్నారు

చాలామంది సాప్ట్ వేర్ ఇంజనీర్లుగానే పనిచేస్తున్నారు
మనసులు మాత్రం హార్డ్ వేర్ గా మారిపోతున్నాయి
కూర్చుని తిని కుశలప్రశ్నలు అడిగేవారు కరువయ్యారు

నాడి పట్టి చూసి గుళికలతో రోగం నయం చేసేవారు
ఆయాసమ్మొస్తే ఆస్తులు అమ్ముకోవలసి పరిస్థితొచ్చింది
చేయిపట్టి పలుకరించి ఏమైందని అడగడం మానేసారు

అప్పట్లో అప్పు చేయటం తప్పు అదోపెద్ద ముప్పనేవారు
మిషన్లుగా మారిన మనుషుల కష్టం కాసులౌతున్నాయి
క్రెడిటుకార్డు పై కొనటమే ఇప్పుడు క్రెడిట్ అంటున్నారు

వస్తువేదో చూసి బజారుకెళ్ళి కావల్సినవి కొనుక్కునేవారు
నాణ్యత చూడ్డమంటే ఇప్పుడు నామోషీ అయిపోయింది
కుర్చీలో కూర్చుని మొబైల్ ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నారు

పుష్టిగా తిని కాపురంచేసి పిల్లల్ని కనిపెంచి పోషించేవారు
సంతానం కోసం ఇప్పుడు సాఫల్య కేంద్రాలు వెలిసాయి
సెక్స్ మూడ్ కోసం తేదీచూసి మందులు మ్రింగుతున్నారు