Tuesday, March 26, 2024

ఒంటరిపోరాటం

జీవితమార్గమిప్పుడు చెప్పులు లేకుండా నడుస్తున్నా
దారంతా కంకరాళ్ళు దుమ్మూ ముళ్ళతో నిండున్నా
నా మెత్తటి పాదాలు వాపు రక్త గాయాలతో ఉన్నా
నేను..అదరక బెదరక ఒంటరిపోరాటం చేస్తున్నా!

అప్పుడప్పుడూ పరిసరాల్లో అభిమాన కాంతులున్నా
కొన్నిమార్లు అంధకారమేదో నన్ను భయపెట్టేస్తున్నా
నా అన్నవాళ్ళు నన్ను పలుమార్లు పరామర్శిస్తున్నా
నేను..ఆదరంగా వాటిని అన్నింటినీ ఆహ్వానిస్తున్నా!

ఒకోసారి నిష్క్రమణ మదిని సజీవ గాయంచేస్తున్నా
కొందరుచేసిన అంతర్లీన గాయాలకి మందులేకున్నా
నా వేదనా కన్నీటిధారలు ఎండినా సరే ఏడుస్తున్నా
నేను..ఎవ్వరు విననని కేకలతో గగ్గోలపెడుతున్నా!

ఇప్పుడు శరీరమంతా మండుతున్నట్లు అనిపిస్తున్నా
మంటా నొప్పితో నిండిన పాదాలతో అడుగులేస్తున్నా
నా తోడుంది ఇప్పుడు ఒంటరితనమని తెలుసుకున్నా
నేను..అంగీకారాన్ని ప్రత్యామ్నయంగా ఎంచుకున్నా!

Monday, March 11, 2024

!!పైపైన!!

మనుషులు వివిధ మార్గాల్లో మనుగడసాగిస్తారు
బ్రతికేస్తూ దానిగురించి మాట్లాడేవారు కొందరు
మౌనంగా అన్నీభరించి బ్రతికేవారు ఇంకొందరు
కొద్దిమందే బ్రతుకుతూ అదర్శమార్గం చూపేరు!
 
ప్రతీఒక్కరూ ఏదొక సమస్యను ఎదుర్కొంటారు
ఎవ్వరూ తీర్పు ఇవ్వకున్నా శిక్ష అనుభవిస్తారు
చూసేవారికి ఏ బాధలూ లేనివారిగా కనిపిస్తారు
కొద్దిమందే ఒడిదుడుకుల్లో నిశ్చింతగా ఉంటారు!
 
కాబట్టి పైపైన చూసేసి బేరీజు వేయకండి మీరు
ఎవరికి ఏం ఎరుక ఎవరెంత కష్టపడుతున్నారు
ఒకచోట ప్రశాంతంగా కనబడే సముద్రపు నీరు
వేరోచోట తుఫాను సృష్టిస్తుందని గ్రహించగలరు!

Monday, March 4, 2024