Tuesday, May 20, 2014

చిగురువేయడమెలా?

గుండెగదిలో బంధించి తలుపు మూసి
తాళంవేసి గొళ్ళెం వేయ మరచినంతనే
చెప్పలేనని చల్లగా జారుకుని జీవించేస్తే
ఎదను కోసిన కసాయిని ఏమనుకోవాలి?

సాగరమంత స్వార్థంలేని ప్రేమనే పంచినా
నీటిబిందువంత నిర్మల ప్రేమనీయనన్నా
అనురాగ ఆస్తుల వీలునామా అందచేస్తే
కాసులకి కుదవు పెడతానంటే ఏమనాలి?

అనురాగపందిరిని చిక్కుల వలగా చూసి
మెరిసేదంతా బంగారమని బంధాన్నివీడి
బరువు భాధ్యతలు తీర్చుకునే బంధమైతే
వేరులేని కాడను ఎలా చిగురింపజేయాలి?

Sunday, May 11, 2014

!!అప్పుగా ఆనందం!!

వాదనలు ఎందుకని వలయంలో చిక్కి

నాణెంపై బొమ్మను చూసి బొరుసు గీసి

బాలింతకాలేని బాల్యానికి బారసాల చేసి

భాధ్యతలంటూ ఆర్భాటాల నడుమ నలిగి

ఆనందాన్ని కాస్త అరువు ఇవ్వమనడిగితే

కుదవు పెట్టడానికి భాధలేగా మిగిలాయంది

కన్నీటితో కనకమేకాదు కన్నపేగూ కరగనంది.

Wednesday, May 7, 2014

!!ఓడిపోతున్నా!!

ఆశయసాధనకి ప్రణాలికలే ప్రాణమని..
నమ్మిన ప్రతిసారీ నేను ఓడిపోతున్నా!
అసంతృప్తిని మించిన పేదరికంలేదని..
సంతృప్తియే సిరులనుకుని సర్దుకున్నా!
ఆశను మించిన ఔషధం ఎక్కడుందని..
నిరాశల్ని నవ్వుతో చికిత్స చేసుకున్నా!
సరికాని సమస్యలని సమర్ధించలేనని..
సర్దుబాటంటూ కోరికల్ని అణుచుకున్నా!
పెంపకంతో ప్రేమపాశం పెనవేయలేనని..
ఊపిరైన బంధాలనే వదిలేసి జీవిస్తున్నా!
నమ్మకం ఆత్మస్థైర్యాలనే ఆయుధాలని..
ఎక్కుపెట్టి మరో జీవనసమరం చేస్తున్నా!