నివాసం ఉండేది చిన్న ఇంట్లోనే అయినా
మనసులు అందరివీ పెద్దవిగా ఉండేవి..
నేలపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నా
ప్రక్కనున్నారు మనవాళ్ళన్న భావముండేది
ఇప్పుడు సోఫాలు డబుల్ బెడ్ మంచాలు
మనుసుల్లో మాత్రం పెరిగాయి దూరాలు..
ఆరుబయట వేసుకునే మడతమంచాల్లేవు
చెప్పుకోవడానికి ఊసులు అంతకన్నా లేవు!
ప్రాంగణంలో వృక్షాలు వస్తూపోతుంటే పలకరించేవి
అపార్ట్మెంట్లుగా అవతరించి హడల్గొడుతున్నాయి..
తలుపులు తీసుండి బంధుమిత్రులను ఆహ్వానించేవి
సైకిల్ ఒక్కటున్నా అందరితో పరిచయాలు సాగేవి
డబ్బులు కొన్ని ఉన్నా పెదవులపై నవ్వు ఉండేది
నేడు అన్నింటినీ సాధించాము కామోసు..
అందుకే అవసరమైనవి అందకుండాపోయాయి
జీవిత పరుగులో ఆనంద వర్ణాలు వెలసిపోయాయి!
ఒకప్పుడు ఉదయాన్నే నవ్వుతూ లేచేవాళ్ళం
మరిప్పుడు నవ్వకుండా ముగిసే సంధ్యవేళలెన్నో
ఎంతో ఉన్నతి సాధించాం సంబంధాలతో నటిస్తూ..
మనల్ని మనం కోల్పోయాం మనవాళ్ళని వెతుకుతూ!