Saturday, May 20, 2017

!!మధుర జ్ఞాపకాలు!!

చిన్నప్పుడు చిట్టి అడుగులు వేస్తూ
చిరునవ్వుతో నన్ను ప్రశ్నిస్తూ
మురిపించి మరిపించిన నా చిన్నారి
చీర కొంగట్టుకు తిరిగి చిత్రంగా చీరకట్టి
నా ఒడిలో ఎదిగి వేరొకరి మదిలో ఒదిగి
విచిత్రంగా అన్నీ జరిగె
ఆలోచిస్తే అనిపిస్తుంది...
కాలం త్వరగా పరుగులెట్టెనని!
ఆ చిన్నినాటి చేష్టలు
అప్పటి ఆ మాటలు
ఎప్పటికీ నాకు మధుర జ్ఞాపకాలేనని!!

Tuesday, May 16, 2017

!!ప్రాకులాట!!

చెప్పేవారు కొందరు మౌనంగా మరికొందరు
నీడగా కొందరు నిట్టూర్పులతో ఇంకొందరు
ఎవరుండి చేసేది ఏముంది ఒరిగేదేముంది!

కొందరు తామేడుస్తూ ఇతరులని నవ్విస్తారు 
మరికొందరు నవ్వులు రువ్వుతూ ఏడుస్తారు
ఇలా నవ్వినా ఏడ్చినా కాలం ఆగనంటుంది!

కలలో వచ్చి జోలపాట పాడేవారు మనవారు
గాఢనిద్రలోంచి మేల్కొల్పుతారు పరాయివారు 
దరిచేర్చుకుని పొమ్మన్నా తేడా తెలియకుంది!

కొందరు మనసులో దూరి మనకి దగ్గరౌతారు
మరికొందరు వాస్తవాలకి వికృతిచేష్టలు అద్దేరు
అర్థమై అర్థంకాని వారు ఉండి లాభమేముంది!

ఇలా కొందరు అలా కొందరు ఎందుకో తెలీదు
ఆలోచించి ఆవేశపడి కూడా చేసేది ఏమీలేదు 
అందుకే పట్టింపు ప్రాకులాటలతో దిగులొద్దనేది!

Friday, May 5, 2017

!!తెలిసేది ఎలా!!

ఎలా తెలుసుకోను మదిలోని కోరికను
అవిటి ఆశ అవశేషాలే ఊతకర్రగా మారి 
కనబడే ముళ్ళమార్గాన్నే దాటేయమంటే
శాంతి సౌఖ్యమే ముందుంది పదమంటే!

ఒంటరైన ప్రయాస మొండికేసి కదలనని
దూరంగా మసగబారిన గమ్యాన్ని కసిరి  
కంపించే మరణాన్నే కౌగిలించుకోమనంటే
బండబారిన మనసుని ఎలా మభ్యపెట్టను!

గుండెకు చేరువగా మందిరం కనబడినా
ముక్తి ఉండలేనని వెళ్ళె బంధనాల దారి
తపనపడే తనువు వ్యధని తగ్గించలేనంటే
చింతలకి చికిత్స లేదని ఎలా తెలుపను!

కోమల కలుషిత హృదయాన్ని ఏమనను 
స్వార్థం ఎక్కుపెట్టి చూసె వయసునే గురి
చివరికి బాధలే బరిలోకి దిగి యుద్ధమంటే
గెలుపెవరిదనను జీవితమే అంతమౌతుంటే!