Monday, December 25, 2017

!!అది నేరమా!!

జీవించడంలో కొద్దిగా అలసట చెందాను
అందుకే దూరంగా వెళ్ళడానికి ఆలోచిస్తున్నా
అంతేకాని నడక మానేయలేదు సుమా!

తరచూ సంబంధాలు దూరాన్ని పెంచాయి
అలాగని అనుబంధాలు వదులుకోలేదు సుమా!

లౌక్యం తెలీక అప్పుడప్పుడు ఒంటరినయ్యాను
అదే అవకాశమంటూ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి 
అదును చూసి నా వ్యక్తిత్వాన్ని వీడలేదు సుమా!

నా అనుకున్న వారందరినీ మనసున తలచి
వీలైనంత మంచిచేసి మన్నన పొందక పోయినా
అలా సహాయపడి చేసిందెవరికీ చెప్పను సుమా! 

Wednesday, December 20, 2017

!!విలువ!!

చేసిన పాపం చెప్పుకుంటే సగం తీరునేమో కానీ చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడం, గర్వానికి పోయి ఎదుటివారిని కించపరిస్తే చేసిన పనితోపాటు మన విలువా తరిగిపోతుంది..చదివి ఆలోచించండి!


◆ "నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి.

◆ "నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.

◆ "అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.

◆ "అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయబడుతున్నది.

◆ తులసి ఆకు అన్ని ఔషదగుణాలు ఉండికూడా అణగి తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.

Thursday, December 7, 2017

!!వివాహబంధం!!

ఉదయపు తొలికిరణ తుషారబింధువు నేనైతే   
శీతలరేయి ఘనీభవించి తొణికిసలాడడు తను
   
ఉరుకుల పరుగులా చురుకు పయనం నాది   
నాచుపట్టినా నిలబడగల నిశ్చల నడక తనిది

తన్మయ దరహాసంతో సాగేటి సెలయేరు నేనైతే
నవ్వడానికి రీజన్ వెతికే నిండు సాగరం అతను

సీతాకోకలా రంగుల భావుకత చిందించాలని నేను
ఊసరవెల్లిలో రంగులు ఆరాతీసే మనస్తత్వం తను

వసంత సరాగాలు వినాలన్న కుతూహలం నాది   
అలల అలజడుల విషాదహోరు సంగీతం అతనిది

ప్రత్యేకమైన తేజస్సుతో వెలగాలనే తహతహ నాకు
నిశ్శబ్దం నీడల్లో నిలచిపోవాలనే ప్రాకులాట తనకు

భిన్నధృవాలకి మూడుముళ్ళుపడి ముప్పైరెండేళ్ళు
నిన్న నేడు రేపు విడిపోక సాగాలి ఇలాగే ఇద్దరం! !