నా జీవితంలోకి వచ్చి ఎవరి పాత్రలు వారు
పరిపూర్ణంగానే పోషించి నిష్క్రమిస్తున్నారు..
నేను మాత్రం ఒంటరిగా పరిపూర్ణతకై ప్రయత్నించి
గెలవక ఓడిన ప్రతీసారీ ప్రయత్నిస్తూనే ఉన్నాను!
అదేం చిత్రమో కానీ అందరూ నిరుత్సాహ పడకు
పడిలేచి మరింత ఉత్సాహంగా పరిగెత్తమంటున్నారు
ఇప్పటి వరకూ పరుగులెట్టి అలసిపోయిన నేను..
నాలుగడుగులే నడవలేక పోతుంటే ఏం పరిగెట్టను
గతించిన కాలం నాది కాదు ఈ కాలంతో నాకు పనిలేదు
ఎవరి పై ఆధారపడదామన్నా ఎవరి అత్యవసరాలు వారివి
అస్థిరత్వానికి అసలుసిసలైన ఆనవాళ్ళు వారి అవసరాలు!
నన్ను నేను నమ్ముకుని ఓడిపోయినా బాధపడని మనసు
వేరొకరిలో తనని తాను చూసి తృప్తి పడమని సలహా ఇస్తే
ఎందుకో ఏమో ఉక్రోషంతో చచ్చు సలహాలివ్వొదని అరవక..
ఏం చెయ్యాలో తెలియక వ్యధతో ఏడవలేక నవ్వుకుంటుంది!