నన్ను నేను హత్య చేసుకోవాలనుకున్న ప్రతీసారి
బంధాల అడ్డంకులు నన్ను అడ్డుకుంటూనే ఉన్నాయి
అందుకే చడీచప్పుడు చేయక నిష్క్రమించాలనుకుని
నాపై నేనే ప్రతీకార పగను పెంచుకునే మార్గాన్వేషణలో
మరిన్ని క్రొత్తభాధ్యతలు నన్ను చుట్టుముడుతున్నాయి
సరేలెమ్మని సర్దుకుని ఏరోజుకారోజు పొడిగించుకుంటూ
మనసుని సర్దుబాటు చేస్తూనే రోజులు దొర్లుతున్నాయి
మారుతున్న ఋతువులు ఏవో కూడా తెలియకుండానే
ఉన్న దేహం ఒక్కటైనా పరిపరివిధాలా మార్పుచెందగా
పంతంపట్టిన మదిపొరలు కుదుటపడలేక చిట్లుతున్నాయి
కొన్ని మోహాల్లో దాహాల్లో నాకై నేనే చిక్కుకున్నానంటూ
నన్ను నేనే తిట్టుకుని అలాగని సమాధానపడనూ లేక
చెదరిన గడ్డిపరకల గూటినే మరలా అల్లుకునే పిట్టలా
తప్పనిసరై నాలో నేనే మమకారం వెతుక్కుంటున్నా!!