Tuesday, September 17, 2019

!!నాకు నేను!!

నేడు అనుకోకుండా చాన్నాళ్ళకు 
నన్నునేను అద్దంలో చూసుకున్నాను..
నన్నునేను గుర్తించే ప్రయత్నం చేసాను!

అదే అందమైన నిలువుటద్దం అక్కడే ఉంది 
అదే ముఖం అలా నన్ను చూసి ఆలోచిస్తుంటే
అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నట్లున్నాయి.. 
జీవిత వెతుకులాటలో నన్నునేను కోల్పోయాను!

కాలం కరిగిపోతుంటే సంబంధాలని పెనవేస్తూ
నాకు నేను దూరం అయిపోయానని..
అనుకుంటూనే వెనక్కుతిరిగి చూసుకున్నాను!

అదే అలా వెనక్కి బాగా వెనక్కు వెళ్ళి చూస్తే
ఒంటరిగా ఏకాకినై నన్ను నేను ప్రశ్నించుకున్నా 
పత్నిగా, కోడలిగా, తల్లిగా, అమ్మమ్మగా..
అనుకునో అనుకోకనో అన్ని పాత్రలూ పోషించాను
ఈ పాత్రల్లో ఎక్కడా నా అనుకునే "నేను" లేను!

నేడు నాకునేను బాసచేసుకుని నాకునేనే నా అని  
నా ఉనికిని నే ప్రేమించి స్వాభిమానంతో రమించి..  
స్వశక్తితో నేను నాకోసం బ్రతకాలి అనుకుంటున్నాను!

2 comments: