Tuesday, June 23, 2020

!!నాలో నేను!!

నా ఆలోచనలు ఎన్నో యోజనాలు పయనించి 
తమలోతామే సుధీర్ఘంగా చర్చించుకుంటాయి... 
స్వార్థసంకుచితాలు ఒకవైపు, సహాయసహకారాలు మరోవైపు
తర్జనభర్జనల నడుమ మానవత్వం ఆచరణాయోగ్యమై 
మలినమంటని మనసు తర్కం అనవసరమని రాజీపడుతుంది!
  
నా వివేకం నైతిక మూలాల్లేని విలువల్ని ఏరిపారేసి 
కొత్త దృక్కోణంలో తమనితామే ప్రశ్నించుకుంటాయి...
కళ్ళతో చూసినదే యదార్ధమని, చెప్పిన మాటలు వినక
వేదహిత సద్గతిలో సాగే సాధనే జీవనపయన మార్గమని  
తాను నమ్మిన సిద్ధాంతాలు ఎంత కష్టతరమైనా ఊడిగం చేస్తుంది!   
   
అదేనేమో నన్ను ఆకాశమంత ఎత్తుకు ఎగురవేసిన నా వ్యక్తిత్వం
అందరికీ నచ్చనిది ఆ తత్వం...అయినా అదే నా అస్తిత్వం!!! 

Thursday, June 18, 2020

!!బ్రతకడమంటే!!

గుర్రం ఎక్కినంత సులభం కాదు స్వారీ చెయ్యడం 
శిక్షణ ఆచరణ అనుభవ చాకచక్య నైపుణ్యం కావాలి

చేతిలో చెయ్యివేసి చెబితే అయిపోదు బాస వెయ్యడం
ఓర్పు నేర్పు ధీక్ష నెరవేర్చాలన్న పట్టుదల ఉండాలి

సక్రమంగా సమకూరితే సాధించేది కాదు విజయమంటే
అడ్డంకులు ఎన్ని ఎదురైనా వాటిని ఖండించి గెలవడం

చదవడం చూసి తెలుసుకోవడమే కాదు జ్ఞానమంటే
అనుభవజ్ఞులు చెప్పిన వాటిని కూడా శ్రధ్దగా వినడం

ప్రయత్నించి ఓడితే దారిమార్చుకునేది కాదు ధ్యేయం
కష్టాలుపడి సరికొత్తదారి తవ్వుకొనైనా చేరాలి గమ్యం

నలుగురూ ఏమనుకుంటారోనని బ్రతికేది కాదు జీవితం
ఆరునూరైనా అనుకున్నది చేసి శభాష్ అనిపించుకోవడం 

Wednesday, June 10, 2020

!!నిచ్చెనెక్కి!!

ప్రేమను పంచితే ప్రేమే దక్కుతుందని నమ్మి
లోకానికి లెక్కలేనన్ని లవ్ లెటర్స్ రాసాను 
ధ్వేషాన్ని కూడా ప్రేమతో జయించవచ్చునని 
ఓడిపోయిన ప్రతీసారి ఓటమినే ప్రేమించాను!  

ఎగిరితే ఎగిరాను ఎప్పుడైనా ఎగిరిపోయేదేనని
ఎదుటివారి ఎదలో ఒదిగి ఉండాలనుకున్నాను
ఊతమిచ్చి ఊరడించాననుకుని ఊహించుకుని
నమ్మి బొక్కబోర్లాపడి బొడిపికట్టించుకున్నాను!

సిద్ధాంతాల నిచ్చెనెక్కి నిటారుగా నిలబడాలని
చేసిన సహాయాలు అన్నీ చిత్తశుద్ధితో చేసాను
అవసరానికి హారతులుపట్టి ఆపై ఆర్పివేస్తారని
తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తున్నాను!