Thursday, April 29, 2021

!!భయపెడుతూ!!


పైకి నవ్వుతూ అందరినీ పలకరిస్తుంటా కానీ..
లోలోపల నేను ఆత్మగౌరవపోరాటం చేస్తుంటాను!

కపటంలేకుండా దాచక ఉన్నది చెప్పేస్తా కానీ..
కరకుస్వరమే నాచుట్టూ కంచైందని తెలుపలేను!

అందరూ మెచ్చే చరిత్రను సృష్టించలేను కానీ..
ఎవ్వరూ చెయ్యెత్తి చూపి చెప్పే ఆస్కారమివ్వను!

మనస్ఫూర్తిగా చెయ్యాలనుకున్నది చేస్తా కానీ..
తిరిగి ఆశించరాదంటూనే అనురాగాన్ని ఆశిస్తాను!

ఎల్లలెన్ని ఎగసిపడ్డా పిడికిలెత్తి ప్రోత్సహిస్తా కానీ..
ఫిరంగినై మాటల తూటాలు పేల్చి నొప్పించలేను!

బానిసత్వ బంధాలపై బంధూక్ పెట్టలేను కానీ..
భయపెట్టే అంటరాని ఆయుధంగా మిగిలిపోతాను!

Wednesday, April 21, 2021

!!నా మనిషి!!

నా అనేక వైఫల్యాలను పక్కకు త్రోసి
నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి
నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో...
నాకు కనిపించేది పరమ ఆప్తుడే తప్ప
ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు!

నా భావావేశాల్లో కేవలం ఆగ్రహం చూసి
నా నిస్సహాయతను గమనించి
నన్ను అంచనా వేసే వారిలో...
నాకు కనపడేది వాదం స్వార్థం తప్ప
నన్నర్థం చేసుకున్న మనిషిని కాదు!

Monday, April 12, 2021

!!మారిచూడు!!

నా బాధ ఏమిటో తెలుసుకోవాలంటే నాలా మారు
వేషధారణలో కాదు గుణగణాల్లో మార్పు చూడు..  
ముఖంపై నవ్వుతో కంట నీరు రాకుండా రోధించు
నాలా రాత్రిళ్ళు నిదురపోకుండానే తెల్లవారిపోనీయి
నీతోడుగా లేనివారికి నీ సమయాన్ని కేటాయించు
కాలంతోపాటు కరిగే వారికి నీ ఊపిరి ఇచ్చి చూడు   
నీదగ్గర ఉన్నవన్నీ కోల్పోయి కూడా నవ్వుతుండు
నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు నాలా మారు
అంతేకానీ నా స్థితిగతుల్ని చూసి కుళ్ళి చితికిపోకు
దాని వెనుక దాగిన శ్రమ కష్టనష్టాల జాబితా చూడు
పోల్చిచూడు పొరపచ్చాల్లేని నా ప్రేమను నీ ప్రేమతో
ఆస్తి అంతస్తుల్లో కాదు జ్ఞాన సంపదలో ఎదిగి చూడు