Tuesday, May 28, 2013

మనసుకో ముసుగు...

ఆలోచలు పరిస్థితులకనుకూలంగా విడివేరైనాయి
మారలేనంటూ మారాంచేసి మనసే మారిపోయింది

తరాంతరాలు ఆలోచనల్ని మార్చుకోమంటున్నాయి
ఆశతో పెరిగిన ఆశయాలకీ ఒరవడి అసలు నచ్చకుంది

తప్పొప్పులతూనికలు తూగలేమంటు తప్పించుకున్నాయి
కడతేరని కోరిక కన్నీటిలో ఇంకి వెక్కిరించి కనుమరుగైంది

మనస్సాక్షిని మమకారాల ముసురులు కమ్మేసుకున్నాయి
కొత్తాశలకి అంకురార్పణ చేయమని అనుబంధమడుగుతుంది

ఆకృతిదాల్చిన ఆలోచనలు సర్దుబాటంటూ సరిపెట్టుకున్నాయి
మనసు మాత్రం మరో ముసుగేసుకుని నవ్వుతూ సాగిపోయింది

Tuesday, May 21, 2013

జీవనకవిత


చాన్నాళ్ళుగా ఒక మంచి కవిత రాయాలని ఆశ. కానీ ఏం వ్రాయాలో తెలియక అందరూ వ్రాసే కవితల్ని చదివి వీళ్ళంతా ఎలా వ్రాయగలుగుతున్నారని ఆశ్చర్యపోతూ తెలిసిన నలుగురు కవిమిత్రులని సలహా అడిగితే....అలా వ్రాయడమంతా సరస్వతీదేవి కటాక్షమని సన్నగా నవ్వి చల్లగా జారుకున్నారు. మరునాటి నుండి మహా శ్రద్ధగా సరస్వతీదేవిని కొలవడం మొదలెట్టాను.
ఒకరేయి కల్పనల కడలిని ఎంత ఈదుతున్నా ఒక్క ముత్యం కూడా చేతికందనట్లుగా కల, చివరికి సరస్వతీదేవి నన్ను ఆశీర్వధించినట్లుంది అనుకుని నా మదిలోని భావాలకి రూపం ఇవ్వాలనుకునే లోపే ఆఫీస్ లో చేయాల్సిన పనులు గుర్తొచ్చి వాటి పై మనసు లగ్నం చేసి పనిపూర్తిచేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సంసారపు ఈతిభాధలతో సతమతమై సయనించే వేళకి సారమంతా పోయి నీరసం వచ్చి సాహిత్యమంతా మరచి సన్నగా ఒళ్ళంత సలుపుతుంటే కవిత్వం కాదుకదా కాళ్ళు కూడా కదపలేక నిద్రలోకి జారుకున్నా. తెల్లావారింది షరా మామూలే మళ్ళీ......
నాకర్థమైంది.....
"మానవ జీవితమే ఒక కవితా గానమని
కాగితంపై వ్రాసుకుని ఖుషీగా ఉండలేమని
రాజీపడుతూ సాగించడమే పయనమని"