Friday, February 21, 2014

!!నేనే నా సైన్యం !!

అంతరంగ మధనమే నమ్మిన నా అంగరక్షకుడిగా
నియంత్ర భావావేశాలే కాపాడే కవచకుండలాలుగా

ఆలోచనా ఆయుధాలెన్నో అంబులపొదలో దూర్చి
ఆగి అడుగేస్తు సంధిస్తున్నా అస్త్రాలను ఆచితూచి

నవ్వు మాటున దాగిన వేదనలే నా గూఢాచారులు
ఆత్మస్థైర్య, శ్రమ ఫలితాలే నా ఆయుధకోశాగారాలు

నింగికెగసిన ఆశయాలే చేరుకునే లక్ష్యాలుగా మారి
నిలబెట్టి నిలేస్తున్నాయి నిశ్చల సిపాయిలుగా చేరి

సాహసమే ఊపిరంటూ సహాయపడే సలహాదారుడు
సాధ్యంకానిది లేదంటూ సాగిపోమనే సైన్యాధ్యక్షుడు

సహనాన్నే కాలంపై సంధించబోతున్నా చివరాస్త్రంగా
ఎడతెరపిలేని జీవితరణం చేస్తున్నా నేనే నా సైన్యంగా

9 comments:

  1. మొత్తానికి అంతరంగంలోని యుద్ధాన్ని,వీరోచితంగా చూపారు...పద్మరాణిగారు బాగుంది.

    ReplyDelete
  2. ఆత్మస్తైర్యం తో కూడిన అంతరంగ సైన్యం చాలా గొప్పది ప్రేరణ గారూ,
    కవిత అద్బుతంగా ఉంది.

    ReplyDelete
  3. నవ్వు మాటున దాగిన వేదనలే నా గూఢాచారులు
    ఆత్మస్థైర్య, శ్రమ ఫలితాలే నా ఆయుధకోశాగారాలు

    నింగికెగసిన ఆశయాలే చేరుకునే లక్ష్యాలుగా మారి
    నిలబెట్టి నిలేస్తున్నాయి నిశ్చల సిపాయిలుగా చేరి..

    అవును జీవన సమరంలో యివేగా మన తోడు.. గ్రేట్ అండ్ ఇన్స్పిరేషన్ పోయిం ప్రేరణ గారూ..

    ReplyDelete
  4. అయ్యబాబోయ్ అదరగొట్టారు మీ ఆత్మస్థైర్యంతో ప్రేరణ మీరు మాకు.

    ReplyDelete
  5. తిరుగులేదండీ మీకు....తుదివరకూ విజయం మీదే

    ReplyDelete

  6. 'ఆత్మస్థైర్యం శ్రమ ఫలితాలే మీ ఆయుధ కోశాగారాలు' - అన్న మీ పదాలతో ఎందరిలోనో ఆత్మ విశ్వాసాన్ని నింపిన కవిత ఇది . కవితంతా ఓ విభిన్న రీతిలో నడిఛి " ఔరా " అని అనిపించింది,

    "సాహసమే ఊపిరంటూ సహాయపడే సలహాదారుడు
    సాధ్యంకానిది లేదంటూ సాగిపోమనే సైన్యాధ్యక్షుడు "

    ...... సైన్యంలో అన్నీ మీరే అయి అందరినీ అలరించారు ..... సాహసాన్ని నూరి పోశారు . గొప్పగా రాశారని అంటే 'అతిశయోక్తి ' అనుకుంటారేమో .... కాని ఇది వాస్తవం ..' గొప్పగా రాశారు' ప్రేరణ గారూ . మీ కలం నుండి జాలు వారిన మరో విలక్షణ అక్షర సుమమాల ఇది . మంచి కవితనందించిన మీకు శుభాభినందనలు .
    - - శ్రీపాద

    ReplyDelete
  7. మీరు మాకు ఎప్పుడూ ప్రేరణాస్ఫూర్తే

    ReplyDelete
  8. మీ నవ్వే మీ ఆత్మబలం మరియు హుందాతనం

    ReplyDelete