Friday, March 28, 2014

!!ఏమార్పు!!

వరదలా పొంగిపొర్లే భావాలను దాచి..
నదిలాంటి ఆశల ధృఢనివాసం కట్టలేవు

అడవిలో తూఫాను హెచ్చరితో అరచి..
కాండానికి ఊహల ఊయలకట్టి ఊగలేవు

విరిగినద్దంలో ముక్కలైన మోము చూసి..
ముఖకవళికలు మార్చానని ఏమార్చలేవు

తీయనిమభ్య మాటల తివాచీ ఏదో పరచి..
అరికాలు కడిగి  మది మలినం తుడవలేవు

రాగయుక్తంగా భావంలేని గీతం ఆలపించి..
అవిటితనచేతి చప్పట్లు విని ఆనందించలేవు

పచ్చని తోరణాలుకట్టి వాయిద్యాలు మ్రోగించి..
చావుని కళ్యాణ కార్యక్రమమంటూ చూపలేవు

Thursday, March 13, 2014

!!ఆశయం!!

ఆనంద ఆశలసౌధాల మధ్య నిర్మితమైన ఈ జీవనపయనంలో
నడుమ కాస్త సేదదీరబోయి విరామంలో విశ్రాంతిగా మండుతూ
నిన్ను నీవు ఓదార్చుకుంటూ భారం తగ్గించుకోబోయి పెంచుకోకు!

ఆలోచనల చితిలో అనవసరంగా కాలుతూ నీకు నువ్వే దూరమై
కన్నీటివాన కురిపించి నీ స్వప్నాలని నీవే భావాలతో బంధించేస్తూ
మౌన నిట్టూర్పుల మధ్య హృదయం దేదీప్యమై వెలగాలి అనుకోకు!

అర్థరాత్రి  కరిపోయే జ్ఞాపకాలకు విలువ కట్టుకుంటూ నిద్రలేమిలో
మరువలేని మరపురాని కోర్కెలకు కళ్ళెం విప్పి కొరడా ఝళిపేస్తూ
భాధలో భుజం కాకపోయినా వేదనలో నీ మది నీ తోడని మరువకు!

అనవసర క్షణాలని నిరీక్షణా కాలం అంటూ కార్యాలకి కాపలా పెట్టి
సరదాలకీ సభ్యతకీ నడుమ జరిగే భీకరపోరులో నిస్సహాయతంటూ
అలసట చెందిన గతానికి ఆలోచనల పందిరివేసి పైకి ఎగబ్రాకనీయకు!

Saturday, March 1, 2014

!!గురిచూసి!!

వాస్తవాల్లోకి వంగిచూసి వంకర్లు వెతికేసి

వివేకిననుకుంటూ తలెగరేసి తర్కించడం...

ఆటవిడుపులైన అనుబంధాలు ముడివేసి

సాఫీగా సాగమంటే సాగేనా సహజీవనం...

నేలతాకేలా గాలిపటాన్ని క్రిందికి వ్రేలాడదీసి

ఉన్నతమైన ఆశలంటే అంటేనా అవి ఆకాశం...

ఎత్తుమడాల చెప్పులతో దర్పంగా అడుగులేసి

హుందా అనుకోవడం ఎంత వరకు సమంజసం...

చిన్నిగడ్డిపోచలంటి ధ్యేయాలని తాడుగా పెనవేసి

పైకి ఎగబ్రాకితే ఎన్నడూ కావు కన్నకలలు  కైవశం...

ధృఢనిశ్చయానికి ధైర్యాన్ని జతచేసి ధ్యేయాన్ని చూసి

గురిపెట్టి శ్రమని సూటిగా సంధించడమే విజయసాధనం..