Monday, August 24, 2015

!!జ్ఞాపకగాయాలు!!

కళ్ళలో విరిగిన గాజుముక్కలే విలయతాండవం చేస్తున్నట్లు
జ్ఞాపకాలు కొన్ని గాయాలై మరల సలపరం పెడుతున్నాయి!

నిశిరాత్రి కూడా నిశ్శబ్దంగా నిద్రపోతుంటే పాతగాయాలు రేగి
మాసిక వేసిన గుండెనే మరోమారు ముక్కలు చేస్తున్నాయి!

పగటి నుండి సంధ్య వరకూ వ్యాపకాల ఒడిలో కునుకు తీసి
రాతిరవ్వగానే కన్నీట తడిసిన తలగడని ఆరనీయకున్నాయి!

మరకలను మాపుకోలేని మెత్తటి మనసు చుట్టు చీముపట్టి
నిదురలేక ఎర్రబడ్డకనుల ఉసురు పోసుకుని ఉసూరన్నాయి!

గుచ్చుకున్నవి జ్ఞాపకాల గాజుముక్కలే అని తీసివేయబోతే
మరపురాక కన్నీరు ఆగిపోయి గాట్లు రక్తమై స్రవిస్తున్నాయి!

3 comments:

  1. జ్ఞాపకాలు ఎప్పటికీ గుచ్చుకునే ముళ్ళే.

    ReplyDelete
  2. కవిత హృదయం ఘోషించేలా ఉందండి.

    ReplyDelete
  3. మీకు వరలక్ష్మీదేవి కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete