Tuesday, September 15, 2015

!!అమ్మకానికి అన్నీ!!

నీరు అమ్ముడైపోతుంది, ఋతువులూ అమ్ముడై పోవునేమో
నేల అమ్ముడైపోయింది, అంబరం కూడా అంగడికి చేరునేమో
చంద్రమండలంలో అడుగేసి గజానికో రేటుకట్టి అమ్ముతున్నారు
సూర్యరశ్మిని కూడా సంచులు కట్టి సంతలో విక్రయించేస్తారేమో!

అమ్ముడు కానిది అంటూ ఏదీ లేదు అమ్మతనంతో పాటుగా
స్వార్థం ఎలాగో అమ్ముడైపోయింది, ధర్మం ఆ దారే పట్టిందేమో
అనుబంధాలూ ఆప్యాయతలూ తలొక రేటుకీ అమ్ముడైనాయి
కొన్నాళ్ళకి మనిషి తననితానే ముక్కలుగా అమ్ముకుంటాడేమో!

ప్రతీ పనీ పైసల కోసం, నేతలేమో పదవుల కోసం అమ్ముడైనారు
భయం వేస్తుంది, క్రమేణా దేశమే అమ్ముడు అయిపోతుందేమో
నేడు చనిపోయిన శవం కూడా రెప్పలు మూయకనే చూస్తుంది
త్వరలో శవమే, స్మశానంలో తనని పాతిన స్థలం అమ్మునేమో!

Tuesday, September 1, 2015

!!ఓ నా పాఠశాలా!!

ఉదయాన్నే లేవనంటూ మారాం చేయడం
హడావిడిగా తయారై బడికి పరుగుతీయడం
ఒకజడ రిబ్బను, షూబెల్ట్ ఊడి తిరిగిరావడం
ఇంటికి వచ్చీరాగానే ఆటలని పరుగులెట్టడం
ఆడుతూపాడుతూ పాఠాలు చదువుకోవడం
ఓ నా పాఠశాలా నన్ను మరోసారి చేర్చుకోవా!

ఆలస్యంగా వెళ్ళి ఆటస్థలం చుట్టూ ప్రదక్షణాలు
ప్రార్ధనా సమయంలో మాట్లాడి తీసిన గుంజీళ్ళు
కడుపునొప్పి అంటూ బడి ఎగ్గొట్టిన ఎన్నోరోజులు
పోటీ చదువులే కానీ పౌరుషాలకిపోని పరీక్షలు
అమాయకత్వంతో అంటుకున్న అనుబంధాలు
ఓ నా పాఠశాలా మరోమారు నన్ను రమ్మనవా!


నారింజ పిప్పర్మెంట్ బిళ్ళ తింటే ఎర్రబడిన నోరు
పుల్ల ఐస్ వల్ల జలుబుతో జ్వరం వస్తే నా పోరు
సర్కస్కి వెళ్ళి అందరంకలిసి చేసిన అల్లరిహోరు
తెలిసీ తెలియని వయస్సు అందరిలో ఏదో జోరు
అవి తలుచుకుంటే నేటి చదువులు యమబోరు
ఓ నా పాఠశాలా ఒక్కసారి నన్ను ఒడితీసుకోవా!