Friday, January 29, 2016

!!ఆశ ఎందుకు?!!

ప్రైవేటు పాఠశాలల్లో విద్య బాగున్నప్పుడు...
సర్కారీ స్కూళ్ళు నడుపుతున్నది ఎందుకు?

ప్రైవేటు ఆసుపత్రిలో ఉత్తమ చికిత్స జరిగితే...
ప్రభుత్వ ఆసుపత్రులంటూ బోర్డులు ఎందుకు?

ప్రైవేటు రంగంలోనే ప్రతీదీ అంత బాగుంటే...
ప్రభుత్వ ఉద్యోగాలే కావాలన్న కోర్కె ఎందుకు?

ప్రైవేటుగా జరిగే పనులే ప్రాముఖ్యం అనిపిస్తే...
ప్రభుత్వం ఎవరో అర్థం కాని సర్కారు ఎందుకు?

కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచిన నాయకుడు
నిస్వార్ధపు దేశసేవ చేస్తారన్న వెర్రి ఆశ ఎందుకు?

Monday, January 18, 2016

!!మొక్కుబడి!!

రోజూ కాకపోయినా
అప్పుడప్పుడూ  గుడికి వెళ్ళి
స్వలాభమే ఆశించి దణ్ణం పెట్టి
కోరికల జాబితాలోని కొన్ని అడిగి
మరికొన్ని తీర్చమంటాను...
మూగ మూర్తి ముందు మోకరిల్లి
నాలో నేనే ఏవేవో అనుకుని మ్రొక్కి
ఆర్జీ పెట్టిన కోర్కెల మంజూరి కై
మొక్కుబడుల లంచం ఎరవేస్తాను...
ఇన్ని వేషాలు వేసినా
రాతి విగ్రహం తొణకదూ బెణకదూ
నిశ్చలంగా నన్నే చూసి నవ్వుతూ
కొన్నిసార్లు క్రోధంగా చూస్తూ
తరచూ నేనడిగే ప్రశ్నలు వింటూ
అవును అనదు కాదని ఖండించదు...
అంత అడగకూడని, కాని కోరికలు
ఏం కోరుకుంటున్నానో నాకు అర్థం కాదు!

Thursday, January 14, 2016

Sunday, January 3, 2016

!!రాజీ బ్రతుకు!!

సమయపు శాఖల నుండి క్షణాల్ని తెంపి వేరుచేసినట్లు
సాంగత్యమే వీడిపోయెనని సంబంధాలు తెంచుకోలేము!

కంటి క్రింద చారికలు, మోము పై ముడతలు చెరిపివేసి
చిరిగిపోయిన చిత్రాన్ని అతికించి రంగులు వేయలేము!

రోజుకి ఇంతంటూ శ్రమించి ప్రోగుచేసి కూడబెట్టిన తేనెను
పోయే ప్రాణానికి ప్రాప్తం లేదని పంచి పండుగ చేయలేము!

సాగరంలో ములుగునని ఒడ్డున తెడ్డువేసి నావ నడిపినట్లు
ఆసరా ఇమ్మని  పిల్లల ఆశయాలకి అడ్డుగా నిలవలేము!

సర్దుకుపోవడం సమయాలోచనని చేతకాని నీతులు చెప్పి
బంధాలతో కట్టివేస్తే, భారమైన బ్రతుక్కి భరోసా ఇవ్వలేము!