Sunday, February 7, 2016

!!అలిగిన మది!!

దక్కకూడనివి దక్కి, దక్కాలనుకున్నవి దూరమయ్యె
గాజుబొమ్మను అయితి, క్రింద పడగానే ముక్కలైపోయె
ఈ విషయం తెలియగానే కలలసౌధం అసాంతం కూలింది
ఇలాంటప్పుడు బుధ్ధిలేని మనసు ఎందుకని అలిగింది!?

ఫలించలేదు ఆశయం, కానీ జయం జానెడు దూరంలోనే
కొట్టుమిట్టాడుతూ, నన్ను తిట్టుకుంటూ...నా వైపు చూస్తూ
నిస్సహాయతని మరింత నీరుకారుస్తూ నిలబడ్డ నీడనడిగా
చీకటిలో వదలి వెళ్ళడం ఎంత వరకూ నీకు న్యాయమని!?

నాపై నాకున్న నమ్మకం నిట్టనిలువునా క్షణంలో వాలిపోయె
ఇతరులు సాధనలో సాంద్రత నాలో ఎందులో కొరవడెనంటూ
నిద్రాహారాలు మరచిన శ్రమ నీరసంతో శ్యూన్యం వైపు చూసె
జవాబు తెలియని మౌనహృదయం మరెందుకని అలిగింది!?

నేను ఓడిపోలేదు కానీ, వేరెవరో పందెంలో గెలిచి పరిహసించ
ఎంతని నన్ను నేను సమాధాన పరచుకుంటూ...సర్దుకుపోను
సిగ్గుతో తలని వంచుకుని ఎంత దూరం ఇలా ప్రయాణించను
అలిగిన మదిని బ్రతిమిలాడి మార్చి మరలేం ప్రయత్నించను!?

1 comment:

  1. గెలుపు ఓటములు ఎలా ఉన్నా తప్పదు బ్రతకవలసిందే

    ReplyDelete