Friday, March 18, 2016

!!నా వాళ్ళు!!

నా వాళ్ళంటూ నా ముందు నటించి..
ఆ పై నవ్వుకునే నా వాళ్ళు నాకక్కర్లేదు!
 
నన్ను నిజంగా గుర్తించి గౌరవించి..
నాతో ఉండే పరాయి వాళ్ళైనా పర్వాలేదు!

నాకోసం కన్నీరు కార్చే నలుగురే చాలు..
నమ్మించి మోసగించే నలభైమందితో పనిలేదు!

పనికోచ్చే పలుకు ఒక్కటైనా పదివేలు..
పోసుకోలు మాటలతో పళ్ళికిలించి లాభంలేదు!
 

Thursday, March 17, 2016

!!సూక్తులు!!

ఇలాంటి సూక్తులు చెప్పడం సులభమే...
ఆచరించి అవలంభించడం మాత్రం కష్టమే
అందుకునే ఇలా రాసుకుని ప్రాక్టీస్ చేస్తుంది!

Friday, March 4, 2016

!!అద్దం నేను!!

నవ్వుతూ చేతులు నులుముకుంటూ యోచిస్తున్నాను
సాఫీగా సాగలేక సాగుతున్న జీవితం పై అలిగిన నేను!!

నాకు నచ్చిన రీతిలో లోకం మారునని అనుకున్నాను
ఎండనక వాననక నిశ్చలంగా నిలబడి నిరీక్షణలో నేను!!

అంధకారంలో మునిగి మండుటెండలో మాడిపోతున్నాను
అయితేనేం కలలు అపురూపంగానే కంటున్నాను నేను!!

మున్ముందు ఇంకెన్ని భరించాలో అని భీతిల్లుతున్నాను
అలా అనుకుంటూ ప్రశ్నించుకుంటున్నాను నన్ను నేను!! 

అడిగినవారికి చేతనైన సహాయమే చేసాను, చేస్తున్నాను
అవసరానికి వాడుకుని వదిలిన వారందరిలో ఒంటర్ని నేను!!

పలుకరించి పబ్బం గడుపుకున్న వారిచే మనసువిరిగెను
ముక్కలైతేనేం అద్దాన్ని అద్దంలాగే ప్రతిబింబిస్తాను నేను!!