Wednesday, October 26, 2016

!!విభిన్నం!!

పెట్టెలో ఉంటే అగ్గిపుల్లలన్నీ ఒకేటేలా ఉంటాయి
కొన్ని దీపాలని వెలిగిస్తే కొన్ని కొంపల్ని కాల్చేను

కొన్ని అగరవత్తుల్ని వెలిగించి పరిమళాన్ని అందిస్తే
మరికొన్ని పొగవదిలే సిగరెట్లని అంటించి మురిసేను

కొన్ని పొయ్యిలో నిప్పై వెలిగి కడుపు ఆకలిని తీర్చ
మరికొన్ని కసి కాంక్షలై కడుపుమంట మిగిల్చేను

కొన్ని చలిమంటగా రాచుకుని బీదవాన్ని రక్షించగా
మరికొన్ని చితికి నిప్పుపెట్టి చిద్విలాసం చూపించేను

మొక్కలన్నీ పచ్చగా చూడ్డానికి ఒకేలా బాగుంటాయి
కొన్ని కలుపు మొక్కలై రాలితే కొన్ని కల్పవృక్షాలౌను

కొన్ని గాలినిచ్చి మరికొన్ని ఆహారమై ప్రాణాలు నిలుప
మరికొన్ని నీడనిచ్చే చెట్లై కొన్ని ఔషధాలై కాపాడును

మనుషులు జన్మించడం రక్తం రంగు ఒకటే అయినా
వారివారి ప్రవర్తనానుసారం చూపిస్తారు లోకం రంగును!!

Monday, October 17, 2016

!!గుర్తింపు!!


పండిన పండుని మెత్తగా తీయగా
మారిన రంగునిబట్టి గుర్తించినట్లే...
నమ్రతతో కూడిన సున్నితత్వం, 
మాటల్లో తీయదనం మరియు 
ఆత్మవిశ్వాసంతో కూడిన ముఖవర్చస్సునిబట్టి 
పరిపక్వం చెందిన మనిషిని గుర్తించవచ్చు...
పువ్వు ఎంత అందంగా ఉంటేనేమి
పరిమళాన్నిబట్టే పువ్వులకి నిగారింపు
మనిషి ఎంత గొప్ప వాడైతేనేమి
గుణం మంచితనాన్నిబట్టే వారికి గుర్తింపు!!

Saturday, October 8, 2016

!!నా దారి!!

నన్నునే ప్రేమించుకుని లోకాన్ని చూడబోతే
లోకంలో ధ్వేషించడానికి మనిషే కరువైనాడు
బాధలని లెక్కచేయక వదిలి నవ్వుతూ తిరిగితే
సంతోషాలే చంకలెగరేసి వచ్చి చుట్టుకునె చూడు
ఓటమిని ఒగ్గేయక కొత్తమార్గంలో పయనించబోతే
పనికిరాని ప్రయత్నమని నవ్వి గేలి చేసె నాడు
నన్ను నేనే నమ్ముకుని పలుమార్లు ప్రయత్నిస్తే
విజయమే వెతుక్కుంటూ వచ్చి చేరు ఒకనాడు
నా లక్ష్యం మంచిదని తెలుసుకుని నేను నడిస్తే
ఎత్తునున్న నన్ను చూడ జనం తలెత్తెదరు ఆనాడు!

Monday, October 3, 2016

!!జీవితం!!

జీవితం ఏమిటన్న జిజ్ఞాసతో 
ఆలోచిస్తూ సమయం వృధా చేయకు
కాస్త కష్టపడి కులాసాగా జీవించు
జీవితం పూర్తిగా అదే అర్థమౌతుంది!!

జీవితంలో నాలుగు వేదాలు 
అర్థం కాకపోయినా పర్వాలేదు 
కానీ..
చిత్తశుద్ధి, బాధ్యత, నిజాయితీ, హేతుబద్ధత
ఈ నాలుగు వాక్యాల మర్మమెరిగి మసలుకో
జీవితానికి సార్ధకత చేకూరుతుంది!!