Thursday, November 23, 2017

!!మరో ప్రయత్నం!!

ఆలోచిస్తూ నడుస్తున్నానని తెలిసిన నా అడుగులు
పగిలిన పాదాలకు మంచు లేపనం పూస్తున్నాయి!

అలజడ్ళతో చెమటపట్టిన తనువును తల్లడిల్లవద్దని
సేద తీర్చేలా గాలితెమ్మెరలు వీవనలై వీస్తున్నాయి!

ఆవేశంతో హృదయం ఎగసిపడుతుంటే హాయిగొల్పేలా
కోయిలలు కమ్మగకూసి మదికి జోలపాడుతున్నాయి!

ఆశలు నిద్రపోతున్న నాలో కలగా రూపాంతరం చెంది
స్ఫూర్తిని ఇచ్చే ఉదయకిరణాలు మేల్కొల్పుతున్నాయి!

అణచి వేయబడిన కోరికలు బద్దకం వీడి రెక్కలు విప్పి
రివ్వుమంటూ మరో ప్రయత్నం వైపు సాగుతున్నాయి!

Tuesday, November 14, 2017

!!సరిపోయింది!!

నా మానాన్న నన్ను వదిలేయి
సజీవంగా ఉన్నానుగా సరిపోదా!

గాలిని వాటా ఇవ్వమని అడిగాను
కనబడకుండా శ్వాసని ఇచ్చిందిగా

ఒంటరితనాన్ని తోడుకోరుకున్నాను
మది జ్ఞాపకాలే ఊసులు చెప్పెనుగా

జీవితం అడగమని బలవంతపెట్టినా 
అడగడానికి ఆశలంటూ మిగల్లేదుగా!

Sunday, November 5, 2017

!!మాట్లాడ్డానికో మనిషి!!

ఆస్తీ అంతస్తుల్ని పెంచుకునే యావలో 
బంధానుబంధాలకు ఆనకట్టలు కడుతుంటే
వాస్తవాన్ని జీర్ణించుకోలేక వ్యాకులచిత్తులై
జీవన సంధ్యాసమయంలో అనాధలై మిగిలి
ఆర్ధిక ఆహార ఆరోగ్య విషయంలో కొదవలేక
మాట్లాడుకోడానికి మనుషుల్లేక మదనపడే
నిర్భాగ్య నిస్సహాయ జీవులున్నారు ఇక్కడ
పనిలేకపోతే పక్కవాళ్ళని పలుకరించనప్పుడు          
పనిగట్టుకుని వృద్ధులమాట వినరు గ్రహించుకో!

ఎవరి జీవితానికి వారే బంధీలై స్వార్థం పెరిగె
ఒంటరితనం తప్పదని తెలిసి నీవు మసలుకో
మనిషి బెంగని సొమ్ముచేసుకునే కాలమాయె
పనిమనిషి వాచ్‌మెన్‌ వంటవాడితో పాటుగా.. 
మాట్లాడ్డానికి మనిషి మనీకి దొరికేను చూసుకో  
మమకారాలు బంధబాంధవ్యాలు గాలిబుడగలు
బెంగపోగొట్టే బంధాన్ని బాడుగకైనా అమర్చుకో   
చెంతన ఉండి చింత తీర్చి నగదు ఇస్తే నటించే
నకిలీమనిషైనా మాట్లాడ్డానికి అవసరమని తెలిసుకో!