Sunday, November 5, 2017

!!మాట్లాడ్డానికో మనిషి!!

ఆస్తీ అంతస్తుల్ని పెంచుకునే యావలో 
బంధానుబంధాలకు ఆనకట్టలు కడుతుంటే
వాస్తవాన్ని జీర్ణించుకోలేక వ్యాకులచిత్తులై
జీవన సంధ్యాసమయంలో అనాధలై మిగిలి
ఆర్ధిక ఆహార ఆరోగ్య విషయంలో కొదవలేక
మాట్లాడుకోడానికి మనుషుల్లేక మదనపడే
నిర్భాగ్య నిస్సహాయ జీవులున్నారు ఇక్కడ
పనిలేకపోతే పక్కవాళ్ళని పలుకరించనప్పుడు          
పనిగట్టుకుని వృద్ధులమాట వినరు గ్రహించుకో!

ఎవరి జీవితానికి వారే బంధీలై స్వార్థం పెరిగె
ఒంటరితనం తప్పదని తెలిసి నీవు మసలుకో
మనిషి బెంగని సొమ్ముచేసుకునే కాలమాయె
పనిమనిషి వాచ్‌మెన్‌ వంటవాడితో పాటుగా.. 
మాట్లాడ్డానికి మనిషి మనీకి దొరికేను చూసుకో  
మమకారాలు బంధబాంధవ్యాలు గాలిబుడగలు
బెంగపోగొట్టే బంధాన్ని బాడుగకైనా అమర్చుకో   
చెంతన ఉండి చింత తీర్చి నగదు ఇస్తే నటించే
నకిలీమనిషైనా మాట్లాడ్డానికి అవసరమని తెలిసుకో!    

9 comments:

  1. అత్యభుతం మీ మాటలు.

    ReplyDelete
  2. మేలుకోమంటూ అత్యుత్తమ వాక్యాలు చెప్పారు

    ReplyDelete
  3. రుసుముతో మాట్లాడే వాళ్ళు మనసుతో మాట్లాడరు. అయినా జీవితాలే సొమ్ము సోకు అయిపోతున్న రోజులు. మున్ముందు మీరన్నదే ఖాయం కావచ్చు.

    ReplyDelete
  4. అందరికీ అటో ఇటొ అవసరమైన సలహా ఇచ్చారు

    ReplyDelete
  5. రాబోయే కాలంలో జరిగేది ఇదే..ముందు జాగ్రత్తలు లెస్స పలికినారు

    ReplyDelete
  6. వర్తమానమే ఇంత అస్తవ్యస్తంగా వుందని వర్రీ అవుతుంటే,
    భవిష్యత్ ను చూపి భయపెడుతున్నారు మేడం.

    ReplyDelete
  7. జరగబోయే వాస్తవం చిత్రించారు కవితలో.

    ReplyDelete
  8. మాట్లాడే మనుషులు మార్కెట్లో రెడీ

    ReplyDelete
  9. మేలుకొల్పి చైతన్యపరిచే వాక్యాలు

    ReplyDelete